ఇంటర్వ్యూ : పూర్ణా – ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలి !

ఇంటర్వ్యూ : పూర్ణా – ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలి !

Published on Nov 24, 2016 4:43 PM IST

poorna
కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ హీరో హీరోయిన్లుగా శివ రాజ్ కనుమూరి డైరెక్ట్ చేసిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. మొదటి నుండి ట్రైలర్లతో, పోస్టర్లతో ఆకట్టుకుంటున్న ఈ చిత్రాన్ని నిన్న సాయంత్రం సరికొత్తగా పబ్లిక్ ప్రీమియర్ల రూపంలో ప్రదర్శించారు. ఈ చిత్రానికి సంబందించిన విశేషాలను, తన అనుభవాలను హీరోయిన్ పూర్ణ మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం…

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?
జ) ఇందులో నాది పువ్వులను ఇష్టపడే చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఎక్కువగా మాట్లాడను. కానీ మామూలుగా నేను ఎక్కువగా మాట్లాడుతుంటాను. అలాంటి నాతో ఆ పాత్రను చేయించిన క్రెడిట్ అంతా డైరెక్టర్ శివగారికే దక్కుతుంది.

ప్ర) శివ రాజ్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
జ) ఆయన ఒక కొత్త డైరెక్టర్. కానీ పని చేసేటప్పుడు మాత్రం ఒక లెజెండ్ తో వర్క్ చేస్తున్నట్టు అనిపించింది. ప్రతి సీన్ మీద ఆయనకు చాలా కమాండ్ ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. సినిమా విజయంలో ఎక్కువ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది.

ప్ర) శ్రీనివాస్ రెడ్డిగారితో కలిసి పని చేయడం ఎలా ఉంది ?
జ) ‘గీతాంజలి’ సినిమాలోనే ఆయనతో చేయాల్సింది. కానీ మిస్సయింది. ఆ తరువాత మధ్యలో కూడా ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం. అది కూడా కుదరలేదు. చివరికి ఈ సినిమాతో అది సెట్ అయింది. సెట్ లో ఆయన చాలా యాక్టివ్ గా, ఫ్రెండ్లీగా ఉంటారు. తెలియని విషయాన్ని అర్థమయ్యేలా చెప్పేవారు. చాలా హెల్ప్ చేశారు.

ప్ర) అసలు మీకీ సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది ?
జ) ఈ సినిమాకి పనిచేసిన ఇద్దరు కెమెరా మెన్లలో భరణి నా ఫ్రెండ్. ఆయనే నన్ను ఈ సినిమాకి ప్రిఫర్ చేసి కథ వినమన్నారు. కథ వినగానే నచ్చి ఒకే చెప్పేశాను.

ప్ర) మీరు చాలా హర్రర్ సినిమాలు చేశారు కదా.. అవంటే ఇష్టమా ?
జ) లేదు(నవ్వుతూ).. నాకు హర్రర్ సినిమాలంటే చాలా భయం. చివరికి నా ‘అవును’ సినిమా కూడా థియేటర్లో చూడడానికి భయపడి టీవీలో వేసినప్పుడు చూశా . ఇప్పటికీ ఒక్కదాన్నే పడుకోవాలనుంటే చాలా భయం. కానీ నాకు అలాంటి సినిమాలే వచ్చాయి. అవే చేశాను. వాటితోనే నాకు హర్రర్ క్వీన్ అనే పేరొచ్చింది.

ప్ర) అసలు మీరు సినిమాల్లోకి ఎలా వచ్చారు ?
జ) నేను సినిమాల్లోకి రావడానికి నా డ్యాన్స్ నాకు దారి చూపించింది. మా ఫ్యామిలీలో మొత్తం నలుగురు పిల్లలం. నేనే చివరి అమ్మాయిని. మా విలేజ్ లో ట్రెడిషనల్ డాన్స్ నేర్చుకున్న మొదటి అమ్మాయిని నేనే. మా అమ్మ ప్రోత్సాహం వలనే ఇక్కడి దాకా వచ్చాను. లేకుంటే ఇంట్లోనే కూర్చుని ఉండేదాన్ని.

ప్ర) సినిమాలో సక్సెస్ సాధించాలంటే ఎలా కష్టపడాలని అనుకుంటున్నారు ?
జ) సినీ పరిశ్రమలో సక్సెస్ సాధించాలంటే టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలి. లక్ లేకుండా టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఆ లక్ లేక చాలా మంది వెనకబడిపోయారు. కాబట్టి టాలెంట్ తో పాటు లక్ కూడా అవసరమే.

ప్ర) ఇంతకు ముందు మహేష్ సినిమాలో చేసినట్టు స్పెషల్ సాంగ్స్ ఇకపై చేస్తారా ?
జ) ఖచ్చితంగా చేస్తాను. కానీ కేవలం గ్లామర్ కోసమే అంటే మాత్రం చేయను. నా డ్యాన్స్ ఐటం కాదు. అది నా లైఫ్. ఆ డ్యాన్స్ కు ఇంపార్టెన్స్ ఉన్నప్పుడే స్పెషల్ సాంగ్స్ చేస్తాను.

ప్ర) మీరు ఎక్కువగా ఇన్నోసెంట్ పాత్రలే చూజ్ చేసుకుంటున్నారు ఎందుకు ?
జ) నేను చూజ్ చేసుకోవడం లేదు. అవే నా దగ్గరకొస్తున్నాయి. నాకు రొమాంటిక్ పాత్రలు చేయాలని కోరిక. కానీ మన ఇష్టా ఇష్టాలు సినిమాలో పని చేయవు. దర్శకుడు, కథ ఏది చెబితే అదే చేయాలి.

ప్ర) మీ నెక్స్ట్ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) రేపు ఒక సినిమా సైన్ చేయాలి. అందులో నాది మూడు వెరియేషన్లు ఉన్న పాత్ర. ఒకటి మదర్ రోల్, ఒకరి ట్రెడిషనల్, మరొకటి గ్లామర్ పాత్ర. ఇంకా ఆ సినిమాకి పేరు పెట్టలేదు. వివరాలు త్వరలోనే చెబుతా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు