ఇంటర్వ్యూ : రాధాకృష్ణ – ప్రభాస్ గారిచ్చిన కాంప్లిమెంట్ మరచిపోలేను!

ఇంటర్వ్యూ : రాధాకృష్ణ – ప్రభాస్ గారిచ్చిన కాంప్లిమెంట్ మరచిపోలేను!

Published on Apr 1, 2015 7:29 PM IST

Radha-Krishna
గోపీచంద్‌‌ను మొదటిసారి సూపర్ స్టైలిష్‍గా ప్రెజెంట్ చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘జిల్’. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు రాధాకృష్ణ కుమార్ అనే కొత్త దర్శకుడు పరిచయమయ్యారు. జిల్ సినిమా మంచి టాక్‌ని సొంతం చేసుకొని హిట్ దిశగా దూసుకెళుతోన్న సందర్భంగా చిత్ర దర్శకుడితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘జిల్’ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?

స) చాలా మంచి రెస్పాన్స్ వస్తోందండీ. చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రేక్షకులు ఏయే విషయాల్లో కనెక్ట్ అవుతారనుకున్నామో అక్కడ కనెక్ట్ అవుతున్నారు. గోపీచంద్, రాశిఖన్నాల యాక్టింగ్‌కు, వారిద్దరి మధ్యన లవ్‌ట్రాక్, స్టైలిష్ మేకింగ్ లాంటివి ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందరూ బాగుందంటూ సినిమాకు మంచి విజయాన్ని తెచ్చిపెట్టారు.

ప్ర) మీ నేపథ్యమేంటీ ? ఈ సినిమాకి అవకాశమెలా వచ్చింది ?

స) నాది విశాఖపట్నం. అక్కడే డిగ్రీ పూర్తి చేశా. సినిమాలంటే ఇష్టంతో హైద్రాబాద్ వచ్చి దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటిగారి దగ్గర అసిస్టెంట్‌గా చేరా. ఆయనతో కలిసి ‘ఒక్కడున్నాడు’, ‘ప్రయాణం’, ‘సాహసం’ సినిమాలకు పనిచేశా. ఆ క్రమంలోనే గోపీచంద్ గారితో పరిచయం ఏర్పడింది. ఆయనకు ‘జిల్’ కథ చెప్పగా, యూవీ క్రియేషన్స్ వారికి ఆ కథ చెప్పమన్నారు. వంశీ గారు, ప్రమోద్ గారికి కూడా కథ నచ్చడంతో జిల్ సినిమా రూపొందింది.

ప్ర) గోపీచంద్‌ను స్టైలిష్‌గా ప్రెజెంట్ చేయాలన్న ఆలోచన ఎవరిది?

స) స్క్రిఫ్ట్ దశనుంచే అన్నీ ప్లాన్ చేసుకున్నాం. గోపీచంద్‌ను ఈ సినిమాలో అందంగా, స్టైలిష్‌గా చూపించాలని ముందే ఫిక్సయ్యాం. దానికితోడు ఫైర్ ఆఫీసర్ బ్యాక్‌డ్రాప్‌లో కథను ప్లాన్ చేయడం ఇంకా కలిసివచ్చింది. కాస్ట్యూమ్ డిజైనర్ భాస్కర్ గారు ఈ సినిమాకు చాలా బాగా పనిచేశారు. గోపీచంద్‌ను అందంగా చూపించగలగడంలో ఆయనకూ క్రెడిట్ దక్కుతుంది.

ప్ర) విలన్ క్యారెక్టర్‌ను కూడా అద్భుతంగా ప్లాన్ చేశారు కదా ? దాని గురించి చెప్పండి ?

స) విలన్ క్యారెక్టర్ ఇలాగే ఉండాలని పక్కాగా ప్లాన్ చేశాం. ఈ క్యారెక్టర్ కోసం దాదాపుగా 200లకు పైగా ప్రొఫైల్స్‌ను పరిశీలించాం. చివరగా ముంబైకి చెందిన కబీర్‌ను సెలెక్ట్ చేశాం. కబీర్ ఈ సినిమా కోసమే నాలుగు నెలలు గడ్డం కూడా పెంచాడు. మేము అనుకున్నదానికంటే అద్భుతంగా నటించాడనే చెప్పాలి. కబీర్‌ను ఈ సినిమాకు గొప్ప ప్లస్‌పాయింట్‌గా చెప్పుకోవచ్చు.

ప్ర) సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి కాంప్లిమెంట్స్ అందుకున్నారు ?

స) సినిమా విడుదల కంటే ముందే ఫస్ట్ కాపీని చూసి ప్రభాస్ గారు ‘భవిష్యత్‌లో పెద్ద డైరెక్టర్‌వి అవుతావ్!’ అన్నారు. అది నేనందుకున్న మొదటి కాంప్లిమెంట్. ప్రభాస్ గారిచ్చిన కాంప్లిమెంట్ మర్చిపోలేను. ఎక్కువమంది ‘చాలా సినిమాలు తీసిన వాడిలా ఈ సినిమా తీశావ్’ అనడం సంతోషాన్నిచ్చింది. చంద్రశేఖర్ ఏలేటి గారు కూడా ఇదే విషయం చెప్పారు.

ప్ర) చంద్రశేఖర్ ఏలేటి గారి దగ్గరనుంచి ఏమేం నేర్చుకున్నారు ?

స) ఆయన దగ్గరనుంచి మెయిన్‌గా క్రాఫ్ట్ నేర్చుకున్నా. నా స్టైల్‌కి ఆయన స్టైల్‌కి సంబంధం లేదు. నా స్టైల్లో ఆయన దగ్గర నేర్చుకున్న టెక్నిక్స్‌తో సినిమా తీశా.

ప్ర) భవిష్యత్‌లో ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు?

స) నాకు బేసిగ్గా లవ్‌స్టోరీస్, యాక్షన్ సినిమాలు బాగా ఇష్టం. నేను తీయాలనుకున్నా అలాంటి సినిమాలు తీయడానికి చాలా ఇష్టపడతా.

ప్ర) తరువాతి సినిమా ఏంటీ ?

స) కొత్తగా రెండు మూడు పెద్ద అవకాశాలే వచ్చాయి. ప్రస్తుతం ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. త్వరలోనే కొత్త సినిమా ప్రకటన వస్తుంది.

ఇక అక్కడితో దర్శకుడు రాధాకృష్ణతో మా ఇంటర్వ్యూ ముగిసింది. భవిష్యత్‌లో మరిన్ని మంచి చిత్రాలతో రాధాకృష్ణ మనల్ని అలరించాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు