ఇంటర్వ్యూ : రాఘవేంద్రరావు – నాగార్జున ఒప్పుకోకపోతే ‘ఓం నమో వెంకటేశాయ’ చేసేవాడిని కాదు!

ఇంటర్వ్యూ : రాఘవేంద్రరావు – నాగార్జున ఒప్పుకోకపోతే ‘ఓం నమో వెంకటేశాయ’ చేసేవాడిని కాదు!

Published on Feb 6, 2017 6:56 PM IST


దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో టాప్ కమర్షియల్ డైరెక్టర్స్‌లో ఒకరుగా పేరు తెచ్చుకున్న ఆయన ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిర్డీసాయి’ లాంటి భక్తిరస చిత్రాలతోనూ తనకంటూ ఒక స్థాయి ఏర్పరచుకున్నారు. ఇక పై మూడు సినిమాల్లో టైటిల్ రోల్స్‌లో నటించిన నాగార్జునతోనే రాఘవేంద్రరావు తాజాగా తెరకెక్కించిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’ ఈనెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘ఓం నమో వెంకటేశాయ’ అంటూ వచ్చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి చుట్టూనే తిరిగే ‘అన్నమయ్య’కు, ఈ సినిమాకు తేడా?

స) ‘అన్నమయ్య’ పూర్తిగా భక్తుడి కోణంలోనుంచి చెప్పిన కథ. ‘ఓం నమో వెంకటేశాయ’ కూడా భక్తుడి కోణంలోనే చెప్పినా, ఇందులో వెంకటేశ్వరస్వామితో భక్తుడి స్నేహం అన్న మరో కొత్త కోణం కూడా ఉంది. ఇకపోతే కథ, ఎమోషన్ పరంగా రెండూ వేటికవే భిన్నమైన సినిమాలు. ఈ రెండు సినిమాలను అస్సలు పోల్చలేం!

ప్రశ్న) ఓం నమో వెంకటేశాయ నాగార్జున చేసిన హతిరామ్ బాబా గురించి సమాచారం చాలా తక్కువ ఉంది కదా? సినిమా ఎలా తీయగలిగారు?

స) కథకు కావాల్సిన ప్రధాన ఘట్టాలన్నీ తెలిస్తే అది చాలు. మాకు తెలిసిన సమాచారాన్నే తీసుకొని, సినిమాటిక్ లిబర్టీతో ఫిక్షన్ జతచేశాం. సినిమాలో వచ్చే సన్నివేశాలన్నీ అలాగే జరిగాయని కాదు. మాకు తెలిసిన సమాచారం అల్లిన సన్నివేశాలవి. అన్నమయ్యకు సంబంధించిన పూర్తి కథ ఉన్నా కూడా క్లైమాక్స్‌ను డ్రమటైజ్ చేసి చెప్పాం. ఇలాంటి సినిమాల్లో ఇదంతా ఎప్పుడూ జరిగేదే!

ప్రశ్న) పూర్తి స్థాయి సమాచారం లేని వ్యక్తి కథ సినిమాగా తీద్దామని నాగార్జునను ఎలా ఒప్పించారు?

స) నాగార్జున ముందు ఈ సినిమా వద్దనే అన్నాడు. ‘అన్నమయ్యతో పోల్చిచూస్తే తేలిపోతాం, అలాంటి క్లైమాక్స్ మళ్ళీ రాదు’ అన్నాడు. ఎప్పుడైతే పూర్తి స్క్రిప్ట్ వినిపించానో అప్పుడు వెంటనే ఒప్పేసుకున్నాడు. అన్నమయ్యలానే ఈ సినిమాకు కూడా క్లైమాక్స్‌నే హైలైట్‌గా చెబుతా.

ప్రశ్న) నాగార్జున కాకుండా రామ్ బాబా పాత్రలో ఇతర హీరోలను ఎవరినైనా ఊహించారా?

స) లేదు. ఈ కథ అనుకోగానే నాగార్జున తప్ప ఇంకెవ్వరూ గుర్తురాలేదు. నాగ్ కాకుండా ఈ సినిమా ఎవ్వరూ చేయరని నేనడం లేదు. ఆయన ఒప్పుకోకపోతే నేనైతే ఈ సినిమా చేసేవాడ్ని కాదు.

ప్రశ్న) నాగార్జునతో నాలుగో భక్తిరస చిత్రం తీయడం ఎలా అనిపించింది?

స) అవన్నీ ఆ దేవుడే రాసిపెట్టి చేయించాడేమో అనిపిస్తూంటుంది. భక్తుడంటే అందరికీ నాగార్జునే గుర్తొస్తారు. ఈ సినిమాలోనూ రామ్ బాబాగా ఆయన నటన అద్భుతం. కొన్ని సన్నివేశాలు తీసేప్పుడు నేనే చాలా ఎమోషనల్ అయిపోయి కట్ కూడా చెప్పేవాడిని కాదు. సెట్లో ఉన్న అందరికీ నాగ్‌ని చూస్తే రామ్ బాబాను చూసినట్టే అనిపించేంది. మా కాంబినేషన్‌లో ఇలా ఇన్ని భక్తిరస చిత్రాలు రావడం అదృష్టం.

ప్రశ్న) భక్తిరస చిత్రాలు తీయాలంటే రాఘవేంద్రరావు గారే తీయాలన్న పేరొచ్చింది కదా! దాన్నెలా చూస్తారు?

స) భక్తిరస చిత్రాలు నేనొక్కడినే తీయగలనని ఏమీ లేదు. ఏ దర్శకుడైనా చేయొచ్చు. ఒక్క భక్తిరస చిత్రాలనే కాకుండా నిజ జీవిత కథలు, పురాణాలు.. ఇలా మన సంస్కృతి సాంప్రదాయాలను చాటిచెప్పే కథలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీతో ఇప్పటి దర్శకులంతా ఈ తరహా సినిమాలు చేసేయొచ్చు.

ప్రశ్న) ప్రస్తుతం కమర్షియల్ సినిమాల సందడి ఎక్కువైన రోజుల్లో ‘ఓం నమో వెంకటేశాయ’ లాంటి సినిమా అంటే రిస్క్ అనిపించలేదా?

స) రిస్క్ ఏమీ లేదు. నిజం చెప్పాలంటే ఒక మంచి ఎమోషన్‌తో ఓ కథ చెప్తే, అది ఏ జానర్ సినిమా అయినా ప్రేక్షకులు చూస్తారు. కమర్షియల్ సినిమాలనే ఎక్కువగా ఇష్టపడే యూత్ కూడా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారన్న నమ్మకం ఉంది. ఓం నమో వెంకటేశాయ కథ అలాంటిది.

ప్రశ్న) ఇప్పటి పరిస్థితుల్లో ఇలాంటి సినిమా తీయడానికి మేకింగ్ పరంగా తీసుకున్న జాగ్రత్తలు ఏంటి?

స) మేకింగ్ పరంగా చాలా జాగ్రత్తలే తీసుకున్నాం. తిరుమలలో షూటింగ్‌ చేయడానికి ఎప్పుడూ అవకాశం లేదు కాబట్టి అందుకోసం కెమెరామేన్ ఎస్.గోపాల్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కలిసి కొన్ని వేల కిలోమీటర్లు తిరిగి చిక్‌మంగళూరు, మహాబలేశ్వరం లొకేషన్స్‌ను ఎంపిక చేశారు. నేను, రచయిత జేకే భారవి కలిసి ఇక్కడ కాస్ట్యూమ్స్, సినిమాటిక్‌గా ఈ కథను ఎలా మార్చొచ్చు అని నిరంతరం కష్టపడుతూ ఉండేవాళ్ళం. సెట్స్‌పైకి వెళ్ళాక ఆ దేవుడి దయవల్లే ఒక్క ఆటంకం కలగకుండా సినిమా పూర్తైంది.

ప్రశ్న) చివరగా, దర్శకుడిగా ఇదే మీ చివరిసినిమా అన్న ప్రచారం గురించి ఏమంటారు?

స) ఇప్పటివరకూ నా జీవితమంతా ఆ దేవుడు చెప్పినట్లే జరుగుతూ వస్తుందనుకుంటున్నా. ఈరోజు ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యానన్నా అంతా ఆ దేవుడి దయవల్లే! ‘ఓం నమో వెంకటేశాయ’ నా చివరి సినిమా అని నేను అనుకోవట్లేదు. ఆ దేవుడేమనుకుంటున్నాడో తెలియదు కదా!!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు