ఇంటర్వ్యూ : రామ్ చరణ్ – ‘బ్రూస్ లీ’లో చిరు స్పెషల్ అప్పియరన్స్ అదిరిపోతుంది..!

ఇంటర్వ్యూ : రామ్ చరణ్ – ‘బ్రూస్ లీ’లో చిరు స్పెషల్ అప్పియరన్స్ అదిరిపోతుంది..!

Published on Oct 10, 2015 8:58 PM IST

ram-charan-interview
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్లల కాంబినేషన్లో ‘బ్రూస్ లీ’ పేరుతో ఓ సినిమా సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 16న పెద్ద ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘బ్రూస్ లీ’ అంటూ మంచి యాక్షన్ టైటిల్‌తో వస్తున్నారు. సినిమా ఎలా ఉండబోతోంది?

స) బ్రూస్ లీ అనేది పూర్తి యాక్షన్ టైటిల్‌లా కనిపిస్తున్నా, సినిమా మాత్రం ఫ్యామిలీ మొత్తం కలిసి చూడగలిగే సరదా సినిమా. కథ, పాత్ర రీత్యా ఈ సినిమాకు బ్రూస్ లీ అనే టైటిల్ పెట్టామే కానీ, ఇదేదో కంప్లీట్ యాక్షన్ సినిమా కాదు. మొదట్లో ఈ టైటిల్ విషయమై కాస్త భయపడ్డాం. అయితే శ్రీనువైట్ల గారి బ్రాండ్‌, ఆయన సినిమాలకు సాధారణంగానే కనిపించే అప్పీల్‌పై నమ్మకంతో ‘బ్రూస్ లీ’ అనే పేరుతోనే ముందుకెళ్ళాం. అదీకాక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని స్పష్టం చేసేసింది.

ప్రశ్న) ముందు ‘గోవిందుడు అందరివాడేలే’, ఇప్పుడు ‘బ్రూస్ లీ’.. ఇలా ఫ్యామిలీ కథలతోనే వెళ్తున్నారు. ఏదైనా ప్రత్యేక కారణమా?

స) అలాంటిదేమీ లేదు. సమయానికి ఈ రెండు కథలు అలా వచ్చాయి. ‘బ్రూస్ లీ’ కథ కూడా ‘గోవిందుడు..’ టైమ్‌లోనే వచ్చింది. ఈ సినిమాలో అక్క-తమ్ముడు, తండ్రి-కొడుకుల సెంటిమెంట్ నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆ ఎమోషన్‍కు బాగా కనెక్ట్ అవ్వడంతో వెంటనే ఒప్పేసుకున్నా. ప్రత్యేకంగా ఇలాంటి సినిమాయే చేయాలని ఎప్పుడూ అనుకోలేదు.

ప్రశ్న) శ్రీనువైట్ల సినిమా అంటే కామెడీకి పెట్టింది పేరు. ఆయనతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది? ఈ సినిమాలో ఆయన బ్రాండ్ కామెడీ ఉంటుందా?

స) శ్రీనువైట్ల గారితో కలిసి పనిచేయడం చాలా నచ్చిందండీ. ఆయన సినిమాల్లో కనిపించే ఫన్ నాకు తెలిసి ఆయన వ్యక్తిత్వం నుంచే వచ్చిందనుకుంటా. సెట్లో చాలా సరదాగా ఉంటారు. బ్రూస్ లీలోనూ శ్రీనువైట్ల మార్క్ కామెడీ తప్పకుండా ఉంటుంది. ఈ సినిమాలో అంతా కథ రీత్యా సాగిపోయే ఫన్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఈ తరహా కామెడీ తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ముందే చెప్పినట్లు ఫ్యామిలీ సెంటిమెంట్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది.

ప్రశ్న) ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్‌గా కనిపించబోతున్నారు. ఈ పాత్ర గురించి చెప్పండి?

స) ఈ సినిమాలో నా పాత్ర నాకే కొత్తగా కనిపించిందండీ. మొదట్లో ఈ సినిమాలో లుక్‌ కోసం రకరకాల హెయిర్‌స్టైల్స్ అవీ ట్రై చేశాం. చివరగా ఇప్పుడు చూస్తున్న ఈ లుక్‌కి ఫిక్సయ్యాం. కార్తీ అనే ఓ స్టంట్ మాస్టర్‌గా ఈ సినిమాలో కనిపిస్తా. ఈ తరహా క్యారెక్టర్, నేపథ్యం మన సినిమాల్లో తక్కువగా చూశాం కాబట్టి కచ్చితంగా కొత్తగా ఉంటుందని చెప్పగలను.

ప్రశ్న) కేవలం నాలుగు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశారు. దానికి ఎలాంటి ప్లాన్ చేసుకున్నారు?

స) సినిమా ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ కూడా ప్రకటించాం. ఓపెనింగ్‌కి, రిలీజ్‌కి నాలుగు నెలలో టైమ్ ఉండడంతో ఈ గ్యాప్‌లో షూటింగ్ పూర్తి చేయడం కోసం చాలా కష్టపడ్డాం. ఇదే విషయమై శ్రీనువైట్ల గారితో మాట్లాడుతూ.. ‘సినిమా లేట్ అయినా పర్లేదు, క్వాలిటీ బాగుండాలి. కావాలంటే రెండు నెలలు వెనక్కి వెళదాం’ అని చెప్పా. శ్రీనువైట్ల గారు మాత్రం డీఓపీ మనోజ్ పరమహంసతో ఎలా సెట్ చేసుకున్నారో తెలీదు కానీ ఇంత తక్కువ టైమ్‌లో అద్భుతమైన ఔట్‌పుట్ తెచ్చారు.

ప్రశ్న) థమన్ అందించిన ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియో గురించి చెప్పండి?

స) నా సినిమాల్లో సూపర్ హిట్ అనిపించుకున్న ఆల్బమ్స్‌లో బ్రూస్ లీకి టాప్ 3లో చోటు దక్కుతుంది. ప్రస్తుతం ఈ పాటలు అంతటా మారుమోగిపోతున్నాయని విన్నా. థమన్ ఆల్బమ్‌లోని అన్ని పాటలూ సూపర్ హిట్ అనిపించుకునే మ్యూజిక్ ఇచ్చాడు.

ప్రశ్న) చాలాకాలం తర్వాత చిరంజీవి స్క్రీన్‌పై కనిపించనున్నారు కదా! దాని గురించి చెప్పండి?

స) నాన్నను స్క్రీన్‌పై చూడడానికి నేను కూడా అందరిలానే ఎగ్జైటింగ్‌గా ఉన్నా. ఈమధ్యే డబ్బింగ్‌లో ఆయన విజువల్స్ చూశా. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని చెప్పొచ్చు. మొదట్లో ఈ గెస్ట్ రోల్‌ను వేరొక హీరోతో చేయించాలని ప్లాన్ చేశాం. చివరి నిమిషంలో అది కుదర్లేదు. దీంతో నాన్నే స్వయంగా ఈ రోల్ చేస్తా అని నన్ను ఒప్పించాడు. నేనైతే అస్సలు ఒప్పుకోలేదు. నాన్న, శ్రీనువైట్ల కలిసి నన్ను కన్విన్స్ చేసేశారు. శ్రీనువైట్ల గారు ఓ పాట కూడా ప్లాన్ చేద్దాం అన్నారు. నేను ససేమిరా అన్నాను. 150వ సినిమాలోనే నాన్న డ్యాన్స్ చేయాలి.

ప్రశ్న) శ్రీనువైట్ల-కోన వెంకట్‌ల కాంబినేషన్‌ను మళ్ళీ కలిపారు. అదెలా సాధ్యం అయింది?

స) మనం ఏది చేసినా సినిమా బాగుండాలన్నదే అందరి లక్ష్యం. శ్రీనువైట్ల-కోన వెంకట్‌ల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు వారిద్దరూ కలిసి పనిచేస్తే బాగుంటుందని అనిపించింది. అందుకే స్వయంగా నేనే దగ్గరుండి ఆ పనిచేశా. శ్రీనువైట్ల గారు రాసుకున్న బలమైన స్టోరీకి కోన వెంకట్-గోపీ మోహన్‌ల స్క్రీన్‌ప్లే కలిసి ఈ సినిమాను ఓ బలమైన సినిమాగా నిలబెట్టింది.

ప్రశ్న) గత కొద్దినెలలుగా తెలుగు సినిమా మార్కెట్ స్థాయి పెరిగింది. ఈ నేపథ్యంలో వస్తోన్న మీ సినిమా ఎలాంటి రికార్డులపై కన్నేసింది?

స) చూడండి… బేసిగ్గా సినిమా బాగా ఆడాలి, నిర్మాతకు డబ్బులు తెచ్చిపెట్టాలన్నదే నా బలమైన కోరిక. సినిమాలు హిట్ అయితేనే ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. నాకైతే ఈ రికార్డుల టెన్షన్ అస్సలు లేదు. సినిమా బాగా ఆడుతుందా.. ఫైన్. ఇంతకుముందు సినిమాల కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుందా.. గుడ్. అంతేకానీ రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా చూడకూడదు.

ప్రశ్న) మీ తదుపరి సినిమా విశేషాలేంటి?

స) తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తని ఒరువన్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళుతుంది. గౌతమ్ మీనన్ గారితో ఓ సినిమా డిస్కషన్‌ స్టేజ్‌లో ఉంది.

ప్రశ్న) ఈ ప్రశ్న టాలీవుడ్‌లో హాట్ టాపిక్. చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు?

స) (నవ్వుతూ).. అక్టోబర్ 16న నాన్నగారి 150వ సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుంది. దానిగురించి ఇప్పుడే ఏమీ చెప్పను. జనవరి తర్వాత ఆ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. ఇక నేను కూడా మరో రెండు నెలలు ఖాళీయే కాబట్టి ఇప్పుడిక నాన్న 150వ సినిమాపైనే పూర్తి శ్రద్ధ పెడుతున్నా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు