ఇంటర్వ్యూ : రాశి ఖన్నా – నా కెరీర్ కి బాగా హెల్ప్ అయ్యే సినిమా ‘జిల్’

ఇంటర్వ్యూ : రాశి ఖన్నా – నా కెరీర్ కి బాగా హెల్ప్ అయ్యే సినిమా ‘జిల్’

Published on Mar 25, 2015 6:00 PM IST

Rasi-kanna
హిందీ మూవీ ‘మద్రాస్ కేఫ్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన హీరోయిన్ రాశి ఖన్నా, ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకోవడంతో తెలుగులో మంచి మంచి ఆఫర్లను కొట్టేసింది. తాజాగా గోపీచంద్ హీరోగా కొత్త దర్శకుడు రాధాకృష్ణను పరిచయం చేస్తూ వరుస విజయాల బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మించిన చిత్రం ‘జిల్‌’లో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఈ నెల 27న విడుదలవుతోన్న సందర్భంగా రాశిఖన్నాతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘జిల్’ సినిమా గురించి చెప్పండి ?

స) జిల్ సినిమా మంచి కథతో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్. అందరికీ నచ్చేవిధంగా దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను తెరకెక్కించారు. అందరికీ నచ్చుతుందని నమ్మకంగా ఉంది. పేరుకు తగ్గట్టుగానే ఆడియన్స్ కి జిల్ అనే ఫీలింగ్ కలుగ చేసే సినిమా.

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

స) ఈ సినిమాలో నేను సావిత్రి అనే పాత్ర చేస్తున్నాను. నటించడానికి చాలా మంచి స్కోప్ ఉన్న పాత్ర. బబ్లీ బబ్లీగా ప్రవర్తించే ట్రెడిషనల్ అమ్మాయిగా కనిపిస్తాను. నిజ జీవితంలో నాకు, సావిత్రి పాత్రకు చాలా తేడా ఉంది.

ప్రశ్న) ఈ సినిమాలో లిప్‌ లాక్ సన్నివేశంలో నటించినట్టున్నారు ?

స) అదేం లిప్‌ లాక్ సీన్ కాదు. అది కేవలం పెగ్ లాంటిది. ప్రేమని వ్యక్తపరచడానికి ఎంచుకున్న చిన్న పొయెటిక్ ఎక్స్‌ప్రెషనే తప్ప అది లిప్‌ లాక్ కాదు. సన్నివేశం డిమాండ్ చేసినప్పుడు అలాంటి సన్నివేశాల్లో నటించడం తప్పేమీ కాదు. అదేమీ కావాలని జొప్పించిన సన్నివేశమైతే కాదు. ఆ సందర్భానికి అది అవసరమని భావించాకే ఆ సన్నివేశంలో నటించాను.

ప్రశ్న) గోపీచంద్‌తో నటించడం ఎలా అనిపించింది?

స) గోపీచంద్ పెద్ద స్టార్. మొదట్లో గోపిచంద్ గారితో నటించాలంటే కొంత ఒత్తిడిగా ఫీలయ్యాను. అయితే ఆయన మాత్రం ఒక స్టార్‌లా కాకుండా మామూలుగా కలిసిపోయే వ్యక్తి. సెట్స్‌లో అందరితో చాలా సరదాగా ఉండేవారు. కొన్ని కొన్ని డైలాగులు చెప్పడంలో నేను ఇబ్బంది పడితే ఆయనే దగ్గరుండి ఎలా చెప్పాలో నేర్పించేవారు. యాక్టింగ్, డ్యాన్సుల విషయంలో చాలా సహాయం చేశారు. గోపించంద్ గారితో నటించడం మంచి అనుభూతి.

ప్రశ్న) ఈ సినిమా ఎంచుకోవడానికి ముఖ్య కారణం ?

స) సినిమా కథే నేను ఒప్పుకోవడానికి గల కారణం. ఇంతమంచి కథలో నా పాత్రకి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. అంతకంటే కావాల్సింది ఏముంది. అయితే ఈ పాత్రను ఇంత అందంగా తెరకెక్కిస్తారని నేనైతే ముందే ఊహించలేదు. జిల్.. కచ్చితంగా నా కెరీర్‌కి బాగా హెల్ప్ అయ్యే సినిమా. కమర్షియల్‌ గానూ మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నా.

ప్రశ్న) గ్లామరస్ రోల్స్ ఇష్టమా? ట్రెడిషనల్ రోల్స్ ఇష్టమా?

స) రెండూ ఇష్టమే. ఈ సినిమాలో రెండూ ఒకేసారి పోషించే అవకాశం దక్కింది. సావిత్రి అనే పాత్రలో చాలా ట్రెడిషనల్ అమ్మాయిగా కనిపిస్తాను. పాటల్లో మాత్రం గ్లామరస్‌గా కనిపిస్తాను. ఎప్పుడూ ఒకేరకమైన పాత్రలో కనిపించాలని లేదు. అందుకే కొత్త కొత్త పాత్రలు ప్రయత్నిస్తుంటాను.

ప్రశ్న) అక్కినేని అఖిల్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నారని విన్నాము. అందులో నిజం ఎంత?

స) ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు. ఇప్పటివరకైతే ఈ విషయమై ఎవరూ నన్ను సంప్రదించలేదు. అది ఐటం సాంగా ? స్పెషల్ సాంగా ? అన్నది పక్కనపెడితే ఇప్పటికిప్పుడు అలాంటివి చేసే ఆలోచనైతే లేదు. భవిష్యత్‌లో అలాంటి పాటలు చేస్తానేమో చెప్పలేను.

ప్రశ్న) మీరు పనిచేసిన వారిలో మీకు బాగా నచ్చిన కోస్టార్ ?

స) (నవ్వుతూ..) నాగశౌర్యతో నటించడం కంఫర్ట్‌గా ఉండేది. ఇద్దరం ఒకే వయసు వాళ్ళం కావడం, ఒకేసారి కెరీర్ ప్రారంభించడం వల్లనేమో, నాగశౌర్యతో బాగా కనెక్ట్ అయ్యాను.

ప్రశ్న) ఈ పాత్ర కోసం బరువు తగ్గినట్టున్నారు ?

స) అవును. 5, 6 కేజీల వరకు బరువు తగ్గాను. కొత్తగా, గ్లామరస్‌గా కనిపించాల్సిన అవసరముంది కనుక కొంత బరువు తగ్గాల్సి వచ్చింది.

ప్రశ్న) మీ తదుపరి చిత్రాలేంటి ?

స) ప్రస్తుతం రవితేజ బెంగాల్ టైగర్ సినిమాలో నటిస్తున్నాను. మరికొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి. మంచి పాత్రలను ఎంచుకొని నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను.

ఇక్కడితో రాశి ఖన్నాతో మా ఇంటర్వ్యూ ముగిసింది. ఇక ఈ వారమే విడుదలవనున్న ఈ సినిమా విజయాన్ని కాంక్షిస్తూ 123తెలుగు తరపున ఆల్ ది బెస్ట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు