ఇంటర్వ్యూ : రవి వర్మ – ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకం!

ఇంటర్వ్యూ : రవి వర్మ – ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకం!

Published on Mar 25, 2015 4:59 PM IST

Ravi-Varma
‘వెన్నెల’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన యువ నటుడు రవివర్మ. ఆ తర్వాత తెలుగులో వరుస చిత్రాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. తాను లీడ్ రోల్‌లో నటించిన తాజా సినిమా కాలింగ్‌బెల్‌కు వస్తోన్న స్పందన పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు రవివర్మ. 2015 తనకు ప్రత్యేక సంవత్సరంగా మిగిలనుందని ఆశాభావం వ్యక్తం చేసిన రవివర్మ మాతో పంచుకున్న ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ఇప్పటివరకూ చేసిన సినిమాలు, మీ కెరీర్ గురించి కొంత చెప్పండి.?

స) ‘వెన్నెల’ సినిమా ద్వారా నేను నటుడిగా పరిచయమయ్యాను. ఇంజనీరింగ్ చదివిన తర్వాత అమెరికాలో ఉన్న సమయంలో వెన్నెలలో నటించే అవకాశం వచ్చింది. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా తర్వాత నాకు వరుస అవకాశాలు వచ్చాయి. బొమ్మరిల్లు, రాఖీ, సైనికుడు.. ఇలా వరుస సినిమాల్లో అవకాశాలు వరించాయి. ఇప్పటివరకూ దాదాపుగా ఇరవై ఆరు సినిమాల్లో నటించాను.

ప్రశ్న) నటుడిగా మీకు మంచి గుర్తింపునిచ్చిన సినిమాలు ఏవి ?

స) దాదాపుగా ప్రతి సినిమాలో నాది బలమైన పాత్రే. కథతో సంబంధం లేని పాత్రను ఇప్పటివరకూ చేయలేదు. నటుడిగా బాగా పేరొచ్చిన సినిమాల గురించి చెప్పాలంటే.. వెన్నెల, రాఖీ, విరోధి, జల్సా లాంటి సినిమాల గురించి చెప్పుకోవాలి. ప్రేక్షకులు కూడా నన్ను ఆ పాత్రల ద్వారానే గుర్తు పడతారు.

ప్రశ్న) యాక్టింగ్ పట్ల ఆసక్తి ఎలా ఏర్పడింది ?

స) స్కూల్ రోజుల నుంచే నేను కథక్ నేర్చుకున్నా. నేనెక్కువగా ప్రేమించేది డ్యాన్స్‌నే. సినిమాల్లో హీరోల డ్యాన్సులను చూస్తూ పెరిగా. అక్కడి నుంచే నాకు సినిమా పట్ల ఆసక్తి ఏర్పడిందని అనుకుంటా. డ్యాన్స్, యాక్టింగ్ నా డెస్టినీ అని అర్థమయ్యాక, న్యూయార్క్ వెళ్ళి యాక్టింగ్ కోర్స్ చేద్దామనుకున్నా. అయితే ఆ ఖర్చును భరించలేమని తెలిశాక ఆ ప్రయత్నాలను పక్కన పెట్టా. అదే సమయంలో వెన్నెల అవకాశం రావడం, ఆ తర్వాత వరుసగా సినిమాలు రావడం జరిగిపోయాయి. అయితే ఈ మధ్యే న్యూయార్క్‌లో యాక్టింగ్‌లో క్రాష్ కోర్స్ మాత్రం పూర్తి చేశా.

ప్రశ్న) ఇన్ని సినిమాలు చేశారు కదా.. బ్రేక్ దొరికిందని అనుకుంటున్నారా ?

స) (నవ్వుతూ..) నేను చేసిన పాత్రలన్నీ ఒకదానికి ఒకటి కొత్తగా ఉండే సినిమాలే. బ్రేక్ వచ్చిందా? రాలేదా? అన్నది పక్కనపెడితే నాకు మంచి అవకాశాలు వచ్చాయనే భావిస్తున్నా. ఇక ఈ సంవత్సరమైతే నాకు చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఇప్పటికే నేను లీడ్‌ రోల్‌ చేసిన కాలింగ్ బెల్ విడుదలై నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ప్రశ్న) 2015 సంవత్సరం మీకు ఏరకంగా ప్రత్యేకం?

స) 2015లో నేను నటించిన ఏడుకు పైగా సినిమాలు విడుదల కానున్నాయి. అందులో మహేష్ గారి సినిమా శ్రీమంతుడులో చేసిన పాత్ర నాకు మంచి పేరు తెస్తుందని అనుకుంటున్నా. ఇక ఈ మధ్యే విడుదలైన కాలింగ్ బెల్, తుంగభద్ర సినిమాలకైతే నేను ఊహించనంత రెస్పాన్స్ వస్తోంది. ఇవేకాక ఈ ఏడాది నేను చేసిన సినిమాలన్నీ నాకు మంచి పేరు తెచ్చిపెట్టేవే!

ప్రశ్న) శ్రీమంతుడులో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

స) మహేష్ గారి శ్రీమంతుడులో నాది చాలా మంచి పాత్ర. సినిమాకి కీలకమైన పాత్రల్లో ఒకటిగా ఈ పాత్రను చెప్పుకోవచ్చు. కొరటాల శివ గారు ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ పాత్రకు సంబంధించి ఎక్కువ విషయాలను ఇప్పుడే చెప్పలేను.

ప్రశ్న) ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద హీరోలతో చేశారు కదా ? ఆ అనుభవం గురించి చెప్పండి ?

స) మహేష్, పవన్, ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోలందరితోనూ నటించా. వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నా. అందరూ నాతో బాగా మాట్లాడుతూ చాలా సరదాగా ఉండేవారు. పవన్ కళ్యాణ్ గారితో చేసిన జల్సా, ఎన్టీఆర్ గారి రాఖీ, మహేష్ బాబు గారి సైనికుడు సినిమాల సమయంలో వాళ్ళ దగ్గరనుంచి నేర్చుకున్న విషయాలు నా కెరీర్‌కి చాలా ఉపయోగపడ్డాయి.

ప్రశ్న) మీ డ్యాన్స్ స్కిల్‌ ని చూపే అవకాశం దక్కలేదేమో ?

స) (నవ్వుతూ..) ఇప్పటికైతే దక్కలేదు. కానీ అవకాశం వస్తే మాత్రం వదులుకోను. ముందే చెప్పినట్టు నేను ఎక్కువగా ప్రేమించింది డ్యాన్స్‌నే అయినపుడు ఆ అవకాశాన్ని ఎలా వదులుకుంటాను?

ప్రశ్న) మీ తదుపరి చిత్రాలేంటి ?

స) మహేష్ బాబు గారి సినిమా గురించి ఇందాకే చెప్పా. ఇక ఆ సినిమా కాకుండా అసుర, క్రిమినల్స్ వంటి సినిమాల్లో కీలకపాత్రలు చేస్తున్నా. శ్రీకాంత్ గారు హీరోగా సతీశ్ కాషెట్టి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలోని పాత్ర నాకు మంచి పేరు తెస్తుందని భావిస్తున్నా. వీటితో పాటు మరికొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. నేనో పాత్ర పోషించడం ద్వారా దానికి వ్యాల్యూ వస్తుందనుకుంటే అది లీడ్ రోల్ అయినా, సపోర్టింగ్ రోల్ అయినా చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటా.

ఇక అక్కడితో నటుడు రవివర్మతో మా ఇంటర్వ్యూ ముగిసింది. భవిష్యత్‌లో మరిన్ని మంచి పాత్రలతో, రవివర్మ నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు