ఇంటర్వ్యూ : సత్య దేవ – బాలయ్య లేకపోతే ‘లయన్’ సినిమా లేదు.!

ఇంటర్వ్యూ : సత్య దేవ – బాలయ్య లేకపోతే ‘లయన్’ సినిమా లేదు.!

Published on May 13, 2015 1:55 PM IST

Satya-Deva

‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ తర్వాత నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ‘లయన్’. సత్య దేవ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌లోని డైలాగులు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య రేపు (మే 14న) విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు సత్య దేవతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు…

ప్రశ్న) నమస్తే అండీ. ముందుగా.. ‘లయన్’ సినిమా అవకాశమెలా వచ్చింది?

స) సినిమాలంటే ఇష్టంతో 2000వ సంవత్సరంలో సినీ పరిశ్రమలోకొచ్చా. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దగ్గర కొన్నేళ్ళ పాటు అసిస్టెంట్‌గా పనిచేశా. ఈ క్రమంలోనే బాలయ్య గారితో పరిచయం ఏర్పడింది. గత ఐదేళ్ళుగా ఆయనతో ట్రావెల్ అవుతూ వస్తున్నా. బేసిగ్గా నేను రాసుకునే కథలన్నీ పెద్ద బడ్జెట్ కథలే కావడం, కొత్త దర్శకుడిని ఎవరూ నమ్మకపోవడం లాంటి కారణాలతో ఇప్పటివరకూ సినిమా చేయలేకపోయా. ఓసారి బాలయ్య గారికి లయన్ కథ చెప్పగా, ఆయన ఎంతో ఎగ్జైటై వెంటనే నన్ను ఓకే చేసేశారు. కొత్త దర్శకుడినైనా బాలయ్య నన్ను నమ్మి ఈ సినిమా చేశారు. ‘లయన్’ ఆయన నమ్మకాన్ని నిలబెట్టే సినిమా అవుతుందని కచ్చితంగా చెప్పగలను.

ప్రశ్న) బాలయ్య గారిని అంతగా ఎగ్జైట్ చేసిన అంశమేంటి?

స) బాలయ్య గారికి ఈ సినిమా స్క్రిప్ట్ విపరీతంగా నచ్చింది. ఇప్పటివరకూ మనం చూడనటువంటి సరికొత్త కథాంశంతో ఈ సినిమా నడుస్తుంది. బాలయ్య గారి ఇమేజ్‌కి సరిపడేంత ఎమోషన్, సెంటిమెంట్ ఈ సినిమాలో ఉంది. అందుకే ఆయన ఈ సినిమా విషయంలో నాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. గాడ్సేగా, బోస్‌గా రెండు పాత్రల్లో ఆయన అద్భుతంగా నటించారు.

ప్రశ్న) బాలయ్య లాంటి స్టార్‌ను డైరెక్ట్ చేయడం ఎలా ఉంది?

స) కచ్చితంగా కొంత టెన్షనైతే పడ్డాను. అయితే బాలయ్య గారితో గత కొన్నేళ్ళనుండి ఉన్న పరిచయం వల్ల షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాత చాలా ఈజీగా చేసేశా. బాలయ్య గారు ఒకరిని నమ్మారంటే వారికి కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చి వారినుంచి మంచి ఔట్‌పుట్‌ను రప్పిస్తారు. ఒక కొత్త దర్శకుడికి ఇంత పెద్ద సినిమా చేసే అవకాశం రావడమనేది మామూలు విషయం కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. బాలయ్య లేకపో్తే ఈ సినిమా లేదు.

ప్రశ్న) డైలాగులు చూస్తే రాజకీయ నేపథ్యమున్న సినిమాగా కనిపిస్తోంది. దాని గురించి చెప్పండి?

స) ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అయితే కాదు. స్క్రిప్ట్ పరంగా అక్కడక్కడా పొలిటికల్ టచ్ ఉందే తప్ప పూర్తి పొలిటికల్ సినిమా కాదు. ఇక డైలాగుల విషయానికి వస్తే.. బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టు వాటిని డిజైన్ చేశాం. ట్రైలర్‌లో చూసినదానికంటే మరిన్ని పంచ్ డైలాగులు ఈ సినిమాలో ఉన్నాయి.

ప్రశ్న) హీరోయిన్లు త్రిష, రాధిక ఆప్టేల గురించి చెప్పండి?

స) ఈ సినిమాలో త్రిషది చాలా ఎంటర్‌టైనింగ్ పాత్ర. బాలయ్య, త్రిషల కాంబినేషన్‌లో ఇప్పటివరకూ సినిమా రాలేదు. ఈ సినిమాలో వారిద్దరి కాంబినేషన్ చూడముచ్చటగా ఉంటుంది. ఇక రాధిక ఆప్టే లెజండ్ సినిమాలో చాలా బాగా చేసింది. ఆ సినిమా చూశాక లయన్ సినిమాకు ఆమె సరిగ్గా సరిపోతుందని ఎంపిక చేశాం. బాలయ్య, త్రిష, రాధిక ఆప్టేలు సినిమాకు నిండుతనాన్ని తెచ్చారు.

ప్రశ్న) ఈ సినిమాకు బడ్జెట్ భారీగా పెరిగిపోయిందని వినిపిస్తోంది? అది ఎంతవరకు నిజం?

స) ఈ సినిమా కథకు తగ్గట్టుగానే ఖర్చు చేశాం. బడ్జెట్‌ ఇంత అవుతుందని సినిమాను ప్రారంభించకముందే అనుకున్నాం. నిర్మాత రుద్రపాటి రమణారావు గారు కూడా కథానుగుణంగా ఖర్చు చేయడానికి ఎక్కడా వెనుకాడలేదు. టెక్నికల్‌గా గ్రాండ్‌గా ఉండే ఈ సినిమాకు ఈ స్థాయి బడ్జెట్ అవుతుందని ముందే ఊహించాం. సినిమా చూశాక ఆ రిచ్‌నెస్ మీకే తెలుస్తుంది. ఈ సినిమాకు డబ్బులు పెట్టిన నిర్మాత దగ్గరనుండి డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ ఇలా అందరూ హ్యాపీగా ఉంటారని మాత్రం నమ్మకంగా చెబుతున్నా.

ప్రశ్న) చివరగా ‘లయన్’ సినిమాకు మేజర్ హైలైట్స్ ఏంటి?

స) ఈ సినిమాకు మేజర్ హైలైట్ అంటే బాలయ్య గారనే చెప్పాలి. ఒక మంచి కథలో ఆయన భాగమవడంతో ఈ సినిమాకు మరింత అందం చేకూరింది. ఇక ఈ సినిమా స్క్రీన్‌ప్లే అందరినీ కట్టిపడేస్తుంది. మణిశర్మ మ్యూజిక్, గౌతం రాజు ఎడిటింగ్ ఈ సినిమాకు హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా చెప్పుకుంటే.. అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉన్న ఓ మంచి సినిమాగా ‘లయన్‌’ నిలుస్తుందని ధీమాగా ఉంది.

ఇక అక్కడితో దర్శకుడు సత్య దేవతో మా ఇంటర్వ్యూ ముగించి, రేపు విడుదలవుతున్న లయన్ సినిమా మంచి విజయం సాధించాలని 123తెలుగు.కామ్ తరపున ఆల్ ది బెస్ట్ చెప్పాము..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు