ఇంటర్వ్యూ : శీరత్ కపూర్ – ‘టైగర్’ సినిమాకు కథే మేజర్ హైలైట్!

ఇంటర్వ్యూ : శీరత్ కపూర్ – ‘టైగర్’ సినిమాకు కథే మేజర్ హైలైట్!

Published on Jun 25, 2015 7:10 PM IST

Seerath-Kapoor
‘రన్ రాజా రన్‌’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శీరత్ కపూర్, తన తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది. తాజాగా సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్‌లు హీరోలుగా రూపొందిన ‘టైగర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. మురుగదాస్ శిష్యుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు (జూన్ 26న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శీరత్ కపూర్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘టైగర్’ సినిమా గురించి చెప్పండి?

స) నా దృష్టిలో టైగర్ సినిమాను సింపుల్‌గా మూడు క్యారెక్టర్‌లా ఎమోషనల్ జర్నీగా చెప్పుకోవచ్చు. టైగర్, విష్ణు, గంగల జీవితాల్లో కొన్ని పరిస్థితుల వల్ల వచ్చిన ఇబ్బందులేంటి? అనే అంశంపై ఈ సినిమా నడుస్తుంది. కథే ఈ సినిమాకు మేజర్ హైలైట్. ఇక సినిమాలో మూడు పాత్రల ఎమోషనల్ జర్నీ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందనేది నా నమ్మకం.

ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఏంటి?

స) ఈ సినిమాలో ఓ సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన గంగ అనే అమ్మాయిగా కనిపిస్తా. తన ఫ్యామిలీ కోసం, ప్రేమించిన వాడి కోసం ఎంతవరకైనా నిలబడగల అమ్మాయిగా ఈ సినిమాలో నటించా. నా మొదటి సినిమా ‘రన్ రాజా రన్‌’కి పూర్తి డిఫరెంట్ క్యారెక్టర్‌లో నన్ను ఈ సినిమాలో చూడొచ్చు.

ప్రశ్న) ఇద్దరు హీరోలు సందీప్ కిషన్, రాహుల్‌లతో కలిసి నటించడం ఎలా ఉంది?

స) ఈ సినిమాలో నేను రాహుల్‌ గర్ల్‌ఫ్రెండ్‌గా కనిపిస్తా. రాహుల్ స్క్రీన్‌పై ఎలా ఉంటాడో బయట కూడా అలానే ఉంటాడు. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్‌ క్యారెక్టర్ అంటే అస్సలు పడని క్యారెక్టర్‌లో నేను కనిపిస్తా. ఇక సందీప్ యాక్టింగ్ విషయానికి వస్తే.. యాక్షన్ అనగానే సందీప్ టక్కున ఆ మూడ్‌లోకి వెళ్ళిపోతాడు. చాలా సహజంగా ఒకే సీన్‌ను రకరకాలుగా చేసి చూపిస్తాడు. రాహుల్, సందీప్‌లిద్దరు ఎప్పుడూ సినిమా ప్రపంచంలోనే గడిపేస్తుంటారు.

ప్రశ్న) దర్శకుడు ఆనంద్ గురించి చెప్పండి?

స) ఆనంద్ గారిది ఓ డిఫరెంట్ స్టైల్. ఎంత ఒత్తిడిలోనైనా చాలా కూల్‌గా ఉంటారు. సెట్లో గొడవ గొడవగా ఉన్నపుడు కూడా ఆయనేదో స్క్రిప్ట్ పనులతో తన పని తాను చేసుకుపోతుంటారు. నేనైతే ఏ ఇబ్బందీ లేకుండా చాలా కూల్‌గా నటించేశానంటే అది దర్శకుడి క్రెడిటే!

ప్రశ్న) తెలుగులో రెండు సినిమాలు చేశారు. ఈ ఇండస్ట్రీ ఎలా ఉంది?

స) తెలుగులో ‘టైగర్’ నా రెండో సినిమా. ఇక్కడి ఇండస్ట్రీ నాకు చాలా బాగా నచ్చింది. టిపికల్ సమాధానంగా కనిపించినా నేను మనస్ఫూర్తిగా చెబుతున్న మాట ఇది. ఇక్కడివారంతా మంచి సపోర్ట్ ఇచ్చారు. ప్రేక్షకులు కూడా నన్ను బాగా ఆదరిస్తున్నారు. ఇక నన్ను హీరోయిన్‌ను చేసిన ఈ ఇండస్ట్రీలో భవిష్యత్‌లోనూ వరుస సినిమాలు చేస్తా.

ప్రశ్న) మీ తదుపరి సినిమాలేంటి?

స) ప్రస్తుతం సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతోన్న ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నా. మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు