ఇంటర్వ్యూ : సోనాల్ చౌహన్ – చాలెంజ్‌గా తీసుకొని ఈ రోల్ చేశా!

ఇంటర్వ్యూ : సోనాల్ చౌహన్ – చాలెంజ్‌గా తీసుకొని ఈ రోల్ చేశా!

Published on May 26, 2015 3:16 PM IST

Sonal-Chowhan

ఎనర్జిటిక్ హీరో రామ్, సూపర్ హిట్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కిన తాజా సినిమా పండగ చేస్కో. రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ వారమే (మే 29న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సోనాల్ చౌహన్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) పండగ చేస్కో సినిమా విశేషాల గురించి చెప్పండి?

స) ఈ సమ్మర్‌కి సరిగ్గా సరిపోయే కూల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పండగ చేస్కో. ఏ ఒక్క జానర్‌కో ఈ సినిమా చెందదు. ఈ సినిమాలో రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి పాటలు ఇలా అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఏంటి?

స) పండగ చేస్కోలో నేను ఓ బిజినెస్ వుమెన్‌గా కనిపిస్తా. ఒక రకంగా డామినేటింగ్ రోల్ అనే చెప్పాలి. ఇంతకు ముందు నేను చేసిన పాత్రలన్నీ టిపికల్ హీరోయిన్ తరహా బబ్లీ పాత్రలే. ఈ సినిమాలో మాత్రం చాలా కొత్తగా కనిపిస్తా. రిస్క్ చేస్తేనే కొత్తదనం వస్తుంది. చాలెంజ్‌గా తీసుకొని ఈ పాత్రలో నటించా.

ప్రశ్న) హీరో రామ్‌తో కలిసి నటించడం ఎలా ఉంది?

స) రామ్‌ ఎప్పుడూ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. షాట్ రెడీ అనగానే వెంటనే ఆ పాత్రలోకి మారిపో్తాడు. ఇక అతడి డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ సారి ‘మీ బాడీలో ఏవైనా స్ప్రింగ్‌లు ఉన్నాయా?’ అనడిగా (నవ్వుతూ). డ్యాన్సులు, యాక్టింగ్‌లో అతడి ఎనర్జీ అద్భుతం. ఆఫ్‌స్క్రీన్‌లో కూడా అందరితో కలిసిపోయి చాలా కూల్‌గా ఉంటాడు.

ప్రశ్న) దర్శకుడు గోపీచంద్ మలినేని గురించి చెప్పండి?

స) గోపీచంద్ మలినేని గారు చాలా ఓపిక ఉన్న వ్యక్తి. అన్ని పనులూ దగ్గరుండి మరీ చూసుకుంటారు. ప్రతీ డిపార్ట్‌మెంట్ పట్ల ఆయనకు మంచి కమాండ్ ఉంది. ఈ సినిమా క్రెడిట్ చాలావరకు ఆయన ఖాతాలోకి వెళుతుంది.

ప్రశ్న) ఇతర హీరోయిన్లతో కలిసి నటించడం ఎలా ఉంటుంది?

స) నాకు ఇతర హీరోయిన్లతో నటించడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. నా పాత్ర ఎలా ఉంది అన్నంతవరకే ఆలోచిస్తా. సినిమాకు అవసరమన్నపుడు కచ్చితంగా ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది.

ప్రశ్న) ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి నటించడం ఎలా ఉంది?

స) రకుల్ ప్రీత్ సింగ్‌కు, నాకు మధ్యన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. రకుల్‌తో కలిసి నటించడం చాలా హ్యాపీ. ఇద్దరం ఒకే దగ్గర్నుంచి వచ్చాం. తను నాకంటే బాగా తెలుగు మాట్లాడుతుంది. నాకు చాలావరకూ తనే తెలుగు నేర్పింది. రకుల్ చాలా కూల్‌గా మాట్లాడుతుంది.

ప్రశ్న) టాలీవుడ్ మీకు నచ్చిందా?

స) చాలా నచ్చింది. హైద్రాబాద్ అంటే కూడా ఇష్టం పెరిగింది. తెలుగులో పనిచేయడం కంఫర్ట్‌గా ఉంటుంది. టాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు కూడా నన్ను బాగా ఆదరిస్తున్నారు.

ప్రశ్న) మీ తరువాతి సినిమాలేంటి?

స) ప్రస్తుతం కళ్యాణ్ రామ్‌తో ‘షేర్’ అనే సినిమా చేస్తున్నా. అనుష్క ‘సైజ్ జీరో’ సినిమాలోనూ నటిస్తున్నా. ఈ మధ్యే షూటింగ్‌లో కూడా జాయినయ్యా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు