ఇంటర్వ్యూ : శ్రీకాంత్ అడ్డాల – మహేష్ మంచితనమే నాకు బలంగా నిలిచింది!

ఇంటర్వ్యూ : శ్రీకాంత్ అడ్డాల – మహేష్ మంచితనమే నాకు బలంగా నిలిచింది!

Published on May 18, 2016 4:08 PM IST

srikanth-addala
శ్రీకాంత్ అడ్డాల.. దర్శకుడిగా ఇతడిది ఓ ప్రత్యేక శైలి. బంధాలు, బంధుత్వాలు, మనదనే ప్రపంచం చుట్టూనే సహజమైన భావోద్వేగాలతో ఆయన సినిమాలు సాగుతూంటాయి. తాజాగా ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాలతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) సినిమా రిలీజ్‍కు రెడీ అయిపోయింది. ప్రొడక్షన్ ఆలస్యం అవ్వడానికి కారణం?

స) ‘బ్రహ్మోత్సవం’ ఎంతోమంది స్టార్స్ నటించిన సినిమా. ఈ సినిమాలో వారందరినీ సరిగ్గా ఒక సమయానికి సిద్ధం చేసి, డేట్స్ కుదిర్చేసరికి కాస్త ఆలస్యమైందనే చెప్పాలి. అంతకుమించి మరేమీ లేదు.

ప్రశ్న) ఈ సినిమాకు ఈ స్థాయిలో స్టార్స్ నటించాల్సిన అవసరం ఉందంటారా?

స) తప్పకుండా ఉంది. ఇందులో ప్రతి పాత్రా ప్రాధ్యాన్యమైనదే! ఆ పాత్రల నేపథ్యం, పరిస్థితుల దృష్ట్యా చూసినా, ఈ స్థాయి స్టార్స్ తప్పకుండా ఉండాలనే అంటారు. సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్ లాంటి నటులతో సినిమాకు మరింత నిండుతనం వచ్చింది.

ప్రశ్న) మహేష్‍తో కలిసి రెండో సినిమా చేశారు. ఆ అనుభవం గురించి చెప్పండి?

స) మహేష్ గారి మంచితనమే నాకు ఈ సినిమా విషయంలో ఎప్పుడూ ప్రేరణగా నిలిచింది. అంత స్టార్ స్టేటస్, చరిష్మా ఉన్నా కూడా చాలా సింపుల్‍గా, ఏ హంగూ లేకుండా మహేష్ ఉండడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. మహేష్ లాంటి వ్యక్తుల నుంచి నేను చాలా నేర్చుకుంటూంటా. నటుడిగా ఆయన స్థాయి గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. ఒక్కసారి సెట్స్‌పైకి వెళ్ళాక దర్శకుడు ఎలాంటి సన్నివేశం చేయమన్నా, ఏ లెక్కలూ వేసుకోకుండా చేసే దర్శకుల హీరో మహేష్!

ప్రశ్న) ఈ సినిమా చేస్తున్నప్పుడు ఏవైనా ఇబ్బందులు పడ్డారా?

స) నిజంగా చెప్తున్నా.. ఒక్కసారి మహేష్ స్క్రిప్ట్ ఓకే చేశాక, ఇక ఈ సినిమా విషయంలో అన్నీ పకడ్బందీగా అనుకున్నట్లుగా జరిగిపోయాయి. నేను ఎప్పుడైనా కాస్త ఇబ్బందిగా, ఒత్తిడిగా ఫీలైనా, మహేష్‍ గారిని చూడగానే ఆ టెన్షన్ అంతా తీరిపోయేంత కూల్‌గా కనిపిస్తూ ఎప్పుడూ సపోర్ట్‌గా నిలుస్తూ వచ్చారు.

ప్రశ్న) ఎక్కువగా చిన్న కథాంశాలనే తీసుకొని వాటిచుట్టూ సినిమాలు తీస్తుంటారు. కారణం?

స) చిన్న కథ అని కాదు కానీ, నా సినిమాలన్నీ మానవ సంబంధాలు, భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంటాయి. కొన్ని పరిస్థితులను ఎవరెవరు ఎలా ఎదుర్కుంటారన్న ఆలోచన నుంచి పుట్టే కథలే ఇవన్నీ. అందులో చిన్న కథాంశమా? పెద్ద కథాంశమా? అన్న లెక్కలు ఉండవు.

ప్రశ్న) ప్రఖ్యాత టెక్నీషియన్ తోట తరణి గారితో పనిచేయడం ఎలా అనిపించింది?

స) మొదట్లో ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు. ఈ సినిమాకు పనిచేస్తుంటే ఆయన గొప్పదనం ఏంటో తెలుసుకున్నా. ఈరోజు ‘బ్రహ్మోత్సవం’ ఇంత కలర్‌ఫుల్‌గా ఉందంటే అందులో తోటతరణి గారి కృషి ఎంతో ఉంది.

ప్రశ్న) శ్రీకాంత్ అడ్డాల నుంచి పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాలు ఆశించవచ్చా?

స) ప్రస్తుతానికి నాకు తెలిసిన ఈ జానర్‌లో ఫీల్ గుడ్ సినిమాలు తీసుకుంటూ వెళుతున్నా. భవిష్యత్‌లో కచ్చితంగా నా శైలికి భిన్నమైన సినిమాలు కూడా చేస్తా.

ప్రశ్న) చివరగా, సినిమా అంతా చూశాక ఎలా అనిపించింది?

స) చాలా బాగుంది. మేము అనుకున్న విధంగానే ఫైనల్ ఔట్‌పుట్ వచ్చింది. రేపు ప్రేక్షకులకు కూడా సినిమా బాగా నచ్చుతుందన్న నమ్మకం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు