ఇంటర్వ్యూ : శ్రీనివాస్ రెడ్డి – హీరోగానే సెటిల్ అయిపోవాలని అస్సలు లేదు!

ఇంటర్వ్యూ : శ్రీనివాస్ రెడ్డి – హీరోగానే సెటిల్ అయిపోవాలని అస్సలు లేదు!

Published on Nov 15, 2016 5:16 PM IST

srinivas-reddy
తెలుగులో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. తనదైన కామెడీ టచ్ ఉన్న డైలాగులతో, కామిక్ టైమింగ్‌తో టాప్ కమెడియన్స్‌లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఇప్పటికే ‘గీతాంజలి’ అనే సినిమాలో ఒక పూర్తి స్థాయి హీరో తరహా పాత్రలో నటించిన శ్రీనివాస్, తాజాగా హీరోగా నటించిన మరో సినిమా ‘జయమ్ము నిశ్చయమ్మురా’. శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 25న విడుదల కానుంది. ట్రైలర్‌తో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా గురించి, కెరీర్ ప్లాన్ ఈరోజు నవంబర్ 16న తన పుట్టిన రోజు పురస్కరించుకొని శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఆ విశేషాలు..

ప్రశ్న) ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అంటూ హీరోగా వస్తున్నారు. ఎలా ఉంది?

స) ‘గీతాంజలి’ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసినా, అది కథలో వచ్చే పాత్రగానే చెప్పాలి. ఇప్పుడు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మాత్రం పూర్తిగా హీరోగా చేసిన సినిమా. గీతాంజలి తర్వాత 50 కథలు వస్తే, అవన్నీ కాదని ఈ సినిమా ఎంచుకున్నా.

ప్రశ్న) 50 కథలను పక్కన పెట్టేయడానికి కారణం? ఈ సినిమాలో వాటికి మించి ఉన్న కొత్తదనం ఏంటి?

స) ‘గీతాంజలి’ చూసి హర్రర్ సినిమాలకే నన్ను సంప్రదిస్తూ వచ్చారు. కొన్ని వేరే ఇతర కథలున్నా అవీ ఈ కోవలోనే ఉన్నాయి. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మాత్రం అన్నింటికీ భిన్నంగా అచ్చమైన తెలుగు సినిమా కథ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో వచ్చింది. ఇలాంటి సినిమా కోసమే నేను ఎదురుచూస్తున్నది అనిపించగానే వెంటనే ఓకే చేశా.

ప్రశ్న) దర్శకుడి గురించి చెప్పండి?

స) శివరాజ్ కనుమూరికి ఇది మొదటి సినిమా. గతంలో రామ్ గోపాల్ వర్మ, జేడీ చక్రవర్తి, ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి దర్శకుల దగ్గర పనిచేశారు. లండన్‌ వెళ్ళి బాగా సంపాదించి, అక్కడ సంపాదించిన డబ్బు పెట్టి ప్యాషన్‌తో సినిమా చేయడానికి ఇక్కడికొచ్చారు. జేడీ చక్రవర్తి గారే ఈ సినిమాకు నన్ను సజెస్ట్ చేశారట. అలా నేను కోరిన తరహా సినిమా నాకే తెలియకుండా నా దగ్గరకు వచ్చింది.

ప్రశ్న) దేశవాళీ వినోదం అంటున్నారు. సినిమా ఏం చెప్పబోతోంది?

స) ట్రైలర్‌లోనే చూపించినట్లు కరీంనగర్ యువకుడు కాకినాడలో ఉద్యోగం చేసే పరిస్థితుల్లో సినిమా నడుస్తుంది. రాష్ట్రం విడిపోక ముందు నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఆ యువకుడి చుట్టూ ఏయే పాత్రలుంటాయి, వాటి ప్రభావం వల్ల అతడి జీవితం ఏయే మలుపులు తిరుగుతుందన్నదే సినిమా. జంధ్యాల సినిమాల్లోలా మన తెలుగు సినిమా కామెడీ అన్నట్లుగా ఇందులో సన్నివేశాలు ఉంటాయి. దానికే మేము దేశవాళి వినోదం అన్న పేరు పెట్టి ప్రమోట్ చేస్తున్నాం.

ప్రశ్న) త్రివిక్రం, సుకుమార్, కొరటాల శివ లాంటి స్టార్ డైరెక్టర్స్ మీ సినిమాను ప్రమోట్ చేశారు. ఎలా అనిపిస్తోంది?

స) వాళ్ళంతా అడగగానే సినిమా కోసం ముందుకొచ్చి మాట్లాడడం అదృష్టం. అందరికీ సినిమా చూపించాకే, వాళ్ళు మెచ్చాకే ప్రమోట్ చేయమని కోరాం. వారికి సినిమా నచ్చడం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పుడు సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నా.

ప్రశ్న) చివరగా, కమెడియన్ నుంచి హీరో అయ్యారు. ఇలాగే కొనసాగిపోతారా? లేక క్యారెక్టర్ పాత్రలు కూడా చేస్తూంటారా?

స) నాకు పేరు తెచ్చిందే కమెడియన్, క్యారెక్టర్ రోల్స్. వాటిని వదిలే ప్రసక్తే లేదు. హీరోగా మంచి అవకాశాలు వస్తే చేస్తూనే, క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూనే ఉంటా.

ఇంతటితో ఈ ఇంటర్వ్యూ ను ముగిస్తూ శ్రీనివాస్ రెడ్డి గారికి తప్పకుండా విజయం కలగాలని కోరుకుంటూ మరొక్కసారి 123తెలుగు.కామ్ తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు