ఇంటర్వ్యూ : సుధీర్ బాబు – నన్ను సరికొత్తగా ఎస్టాబ్లిష్ చేసే సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’!

ఇంటర్వ్యూ : సుధీర్ బాబు – నన్ను సరికొత్తగా ఎస్టాబ్లిష్ చేసే సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’!

Published on May 21, 2015 12:20 PM IST

sudheer-babu

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి తెలుగు తెరకు పరిచయమైన యువహీరో సుధీర్ బాబు. ‘ఏ మాయ చేశావే’ సినిమాలో చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమా ద్వారా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా సుధీర్ బాబు హీరోగా నటించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ ఈ వారమే (మే 22న) విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘మోసగాళ్ళకు మోసగాడు’ సినిమా గురించి ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘మోసగాళ్ళకు మోసగాడు’ సినిమా విశేషాలు చెప్పండి?

స) ‘స్వామిరారా’ లాంటి ఓ మంచి క్రైమ్ కామెడీ సినిమాకు సీక్వెల్‌గా ఓ సినిమా తెరకెక్కుతోందనే వార్త రాగానే ఈ సినిమా పట్ల నాకు మంచి ఆసక్తి కలిగింది. ఈ వార్త బయటక వచ్చినపుడు ఈ అవకాశం నాకు వస్తే ఎంత బాగుణ్ణు అనుకునేవాణ్ణి. అదృష్టం కొద్దీ నిర్మాత చక్రి గారు, దర్శకుడు బోస్ ఇదే ప్రాజెక్టుతో నన్ను సంప్రదించారు. కథ చాలా బాగుండడంతో సినిమా ఓకే చేశా. మేము అనుకున్నట్టుగానే చాలా స్టైలిష్‌గా, అన్ని రకాల అంశాలు కలగలిసిన సినిమాగా బాగా తెరకెక్కించాం. ఈ సమ్మర్‌కి అందరూ ఎంజాయ్ చేసే ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’.

ప్రశ్న) ‘స్వామిరారా’ సినిమాతో, ఈ సినిమాను ఎలా కనెక్ట్ చేశారు?

స) నిజానికి ఈ సినిమా ‘స్వామిరారా’కి సీక్వెల్ అయినా ఆ సినిమాకు, ఈ సినిమాకు చిన్న బేసిక్ కనెక్షన్ మాత్రమే ఉంది. రెండు సినిమాల్లోనూ పురాతన కాలం నాటి దేవుడి విగ్రహం దొంగతనానికి గురికావడమనే కామన్ పాయింట్ తప్ప ‘మోసగాళ్ళకు మోసగాడు’ పూర్తిగా డిఫరెంట్ కథ. కథ పరంగా ఈ సినిమాలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఆ సబ్‌ప్లాట్స్ ఈ సినిమాకు మరింత కొత్తదనాన్ని తెచ్చిపెట్టాయి.

ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతోంది?

స) ఇంతకుముందు ఏ సినిమాలోనూ కనిపించనంత కొత్తగా ఈ సినిమాలో కనిపిస్తా. చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే ఓ దొంగకు ఒకేసారి పెద్ద అమౌంట్ అవసరమైతే అతనేం చేశాడూ? అనే అంశం చుట్టూ తిరిగే కథలో దొంగగా కనిపించడం ఓ సరికొత్త అనుభూతి. గతంలో నేను చేసిన సినిమాల్లో స్టైలిష్‌గా కనిపించే అవకాశం రాలేదు. ఈ సినిమాలో మాత్రం చాలా స్టైలిష్‌గా కనిపించే అవకాశం దక్కింది.

ప్రశ్న) ఈ సినిమా ద్వారా కొత్తగా కోరుకుంటున్న ఐడెంటిటీ ఏంటి?

స) ఈ సినిమా ద్వారా ‘సుధీర్ ఈ తరహా పాత్రలు మాత్రమే చేయగలడు’ అనే జోన్ నుంచి బయటకు వచ్చేస్తానని అనుకుంటున్నా. నన్ను సరికొత్తగా ఎస్టాబ్లిష్ చేసే సినిమాగా ‘మోసగాళ్ళకు మోసగాడు’ నిలుస్తుందని ధీమాగా ఉంది.

ప్రశ్న) కృష్ణగారి సూపర్ హిట్ ‘మోసగాళ్ళకు మోసగాడు’ అనే టైటిల్ ఈ సినిమాకు పెట్టడానికి కారణం?

స) మోసగాళ్ళకు మోసగాడు అనే టైటిల్ ఈ కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ అని నమ్మాం. ఇదే విషయాన్ని కృష్ణ గారికి చెబితే ఆయనా సరే అన్నారు. టైటిల్ ఫాంట్ కూడా కృష్ణ గారి మోసగాళ్ళకు మోసగాడు స్టైల్లోనే డిజైన్ చేశాం. ఓ రకంగా ఈ సినిమాతో ఈతరం వారికి కృష్ణ గారు అప్పట్లో చేసిన ఓ ప్రయోగాన్ని తెలియజేసినట్లైంది.

ప్రశ్న) మోసగాళ్ళకు మోసగాడు టీమ్ గురించి చెప్పండి?

స) ఈ సినిమాకు చాలా మంచి టీమ్ కుదిరిందనే చెప్పాలి. దర్శకుడు బోస్‌కు తన కథ పట్ల, ప్రతీ సన్నివేశం పట్ల మంచి క్లారిటీ ఉంది. ఏ ఒక్క సన్నివేశం కూడా వృధాగా తీసుకుంటూ పోవడం లాంటివి జరిగే అవకాశమే లేదు. ఇక నిర్మాత చక్రి గారు కథకి ఏమేం కావాలో అన్నింటినీ సరిగ్గా అందించారు. కొత్తదనమున్న సినిమాలు తెరకెక్కించాలంటే ఎవ్వరికైనా గట్స్ ఉండాలి. అలాగే హీరోయిన్ నందిని తెలుగులో మొదటి సినిమా అయినా చాలా బాగా చేసింది.

ప్రశ్న) ఈ సినిమాకు మేజర్ హైలైట్స్ ఏంటి?

స) ఓ కత్తదనమున్న కథను అంతే కొత్తగా తెరకెక్కించడం ఈ సినిమాకు మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే ఓ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులు కలిసిన ఎంటర్‌టైనర్ ఈ సినిమా కావడంతో అన్ని రకాల ప్రేక్షకులూ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు.

ప్రశ్న) మీ తదుపరి సినిమా విశేషాల గురించి చెప్పండి?

స) ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ..’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘మోసగాళ్ళకు మోసగాడు’ విడుదలైన మూడు వారాల తర్వాత ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ‘చూపులు కలిసిన శుభవేళ’ అనే వర్కింగ్ టైటిల్‌తో మరో సినిమా చేస్తున్నా. అన్ని సినిమాలూ వేటికవే కొత్తవిగా ఎంచుకుంటూ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు