ఇంటర్వ్యూ : సందీప్ కిషన్ – ‘టైగర్‌’.. మురుగదాస్ గారే చేద్దామనుకున్నారు.

ఇంటర్వ్యూ : సందీప్ కిషన్ – ‘టైగర్‌’.. మురుగదాస్ గారే చేద్దామనుకున్నారు.

Published on Jun 25, 2015 5:51 PM IST

Sundeep-Kishan
వైవిధ్యభరితమైన కథాంశాలతో రూపొందిన సినిమాల్లో నటించి, ఇప్పుడున్న యువహీరోల్లో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సందీప్ కిషన్. తాజాగా ఆయన మరో యువహీరో రాహుల్ రవీంద్రన్‌తో కలిసి నటించిన ‘టైగర్’ సినిమాతో మనముందుకు రానున్న సంగతి తెలిసిందే..! ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు (జూన్ 26న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా టైగర్ సినిమా గురించి హీరో సందీప్ కిషన్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘టైగర్’ సినిమా విశేషాల గురించి చెప్పండి?

స) టైగర్ సినిమా ఓ మూడు పాత్రల చుట్టూ తిరిగే వైవిధ్యమైన కథ. నార్త్ ఇండియాలో జరిగిన ఓ నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. స్నేహం, ప్రేమ చుట్టూ ఈ కథ తిరుగుతూంటుంది. చాలా కొత్తదనమున్న కథ, సినిమా చూసిన ప్రతిఒక్కరూ కచ్చితంగా థ్రిల్ ఫీలవుతారన్న నమ్మకం ఉంది. మా టీమ్ మొత్తానికీ సినిమా తెగ నచ్చేసింది. రేపు ఆడియన్స్‌ కూడా అలాగే అనుభూతి చెందుతారని అనుకుంటున్నా.

ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఏంటి?

స) ఈ సినిమాలో నా క్యారక్టర్ పేరు టైగర్. పేరు ఎంత విచిత్రంగా ఉంటుందో ఆ క్యారెక్టర్ కూడా అంతే విచిత్రంగా ఉంటుంది. తనవారనుకున్న వారి కోసం ఏదైనా చేసే టైగర్‌‌కి బెస్ట్ ఫ్రెండ్ అయిన విష్ణుకి ఎదురైన ఇబ్బందులేంటి? దానికోసం టైగర్ ఎలా పోరాడాడు అన్నదే ఈ సినిమా..! చెప్పాలంటే ‘గుండెల్లో గోదారి’ తర్వాత పరిధుల్లేని ఓ క్యారెక్టర్ చేశా. ఈ సినిమాలో నటించడానికి చాలా స్కోప్ దొరికింది. ఇక ఈ సినిమాలో నాకు హీరోయిన్ ఉండదు.

ప్రశ్న) మరో హీరో రాహుల్‌తో కలిసి నటించడం గురించి చెప్పండి?

స) రాహుల్ నాకు ఎప్పట్నుంచో మంచి ఫ్రెండ్. రాహుల్‌ది ఈ సినిమాలో మెచ్యూర్డ్ క్యారెక్టర్. క్యారెక్టరైజేషన్ల ద్వారా నడిచే ఈ కథ ఎక్కువ భాగం నా క్యారెక్టర్, రాహుల్, శీరత్ కపూర్‌ పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఈ ముగ్గురి జీవితాలూ కొన్ని సంఘటనల ద్వారా ఎలాంటి మలుపులు తిరిగాయన్నదే పాయింట్!

ప్రశ్న) దర్శకుడు ఆనంద్ గురించి చెప్పండి?

స) ఆనంద్, అంతకుముందు మురుగదాస్ గారి దగ్గర శిష్యుడుగా పనిచేశారు. నిజానికి ఈ సినిమాను మురుగదాస్ గారే తన సొంత బ్యానర్‌లో నిర్మించాలని అనుకున్నారు. ఆయనకీ కథ విపరీతంగా నచ్చేసింది. నేనైతే ఈ కథకు బాగుంటానని ఆనంద్‌కి మురుగదాసే చెప్పారట. ఈ కథ విన్నవెంటనే వేరే ఆలోచనలన్నీ పక్కనపెట్టేసి ఈ ప్రాజెక్టునే విపరీతంగా ప్రేమించా. అదే సమయంలో మురుగదాస్ గారి ప్రొడక్షన్‌లో విక్రమ్ సినిమా ఒకటి ప్రొడక్షన్‌లో ఉండడంతో ఆయన చేయలేకపోయారు. నేను మాత్రం ఆనంద్‌ను వదలకుండా పట్టుకొని మధు గారిని ఒప్పించి టైగర్‍ను మొదలుపెట్టా. తనకేం కావాలో సరిగ్గా తెలిసిన వ్యక్తి ఆనంద్. ఒక ఇంటిలిజెంట్ సినిమాను అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలోనే అతడి ప్రతిభను చూడొచ్చు.

ప్రశ్న) మురుగదాస్ గారు టైగర్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యేవారా?

స) మురుగదాస్ గారు ఈ సినిమా విషయంలో మొదట్నుంచీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వచ్చారు. కథలో కొన్ని మార్పులు సూచించడమే కాక స్క్రిప్ట్ ఫైనల్ అయ్యే దాకా దగ్గరుండి చూసుకున్నారు. ఆ మధ్య సినిమా పూర్తి కాక ముందు కొంత భాగం ఆయనకు చూపించాం. ఆయన బాగా ఎగ్జైట్ అయ్యారు. అది మాకు మరింత ఎనర్జీనిచ్చింది.

ప్రశ్న) ఈ సినిమాకు మేజర్ హైలైట్స్ ఏంటి?

స) మేజర్ హైలైట్ అంటే.. ముందు కథే అని చెప్పాలి. అద్భుతమైన ఎమోషన్ ఉన్న సినిమాను తెరపై కూడా అదే స్థాయిలో ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. థమన్ మ్యూజిక్, చోటా గారి సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలుస్తాయి. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే కాదు. కొత్త కథ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ప్రేక్షకుడికి మంచి ఫీల్‌నిస్తాయని చెప్పగలను.

ప్రశ్న) మీ తదుపరి సినిమాలేంటి?

స) ప్రస్తుతం తమిళంలో స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నా. అది దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇక తెలుగులో 14 రీల్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేయనున్నా. త్వరలోనే ఆ సినిమా మొదలుకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు