ఇంటర్వ్యూ : తమన్నా – మరోసారి అలాంటి సినిమా చేయొద్దని ఫిక్సయ్యా!

ఇంటర్వ్యూ : తమన్నా – మరోసారి అలాంటి సినిమా చేయొద్దని ఫిక్సయ్యా!

Published on Sep 26, 2016 3:22 PM IST

tamanna-67
సౌతిండియన్ సినిమాలో టాప్ హీరోయిన్లలో ఒకరుగా దూసుకుపోతోన్న తమన్నా, తాజాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ‘అభినేత్రి’ అనే సినిమాతో మెప్పించేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి, తన కెరీర్ గురించి తమన్నా చెప్పిన విశేషాలు..

ప్రశ్న) ఒకేసారి మూడు భాషల్లో నటించడం ఎలా అనిపించింది?

స) నిజం చెప్పాలంటే, చాలా కష్టంగా ఉండేది. ఇకపై ఇలా మూడు భాషల్లో తెరకెక్కే సినిమాలు చేయొద్దని ఫిక్స్ అయిపోయా.

ప్రశ్న) ఒక్కసారే అలాంటి నిర్ణయం తీసుకున్నారు ఎందుకని?

స) అభినేత్రి సినిమా కోసం 58 రోజులు కష్టపడ్డాం. ఈ 58 రోజుల్లోనే మూడు భాషలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశాం. ఒకేసారి మూడు డిఫరెంట్ భాషల్లో నటించడం, ఆ పాత్ర తీరుతెన్నులను అన్ని భాషల్లోనూ ఒకేలా ఉండేలా చూడడం.. ఇలా చాలా కష్టపడాల్సి వచ్చేది. మరొకసారి అలాంటి కష్టం వద్దనే అనుకుంటున్నా.

ప్రశ్న) మూడు భాషల్లో సినిమా తెరకెక్కించాలన్న ఆలోచన ఎవరిది?

స) ఈ ప్రాజెక్టులోకి నేనొచ్చాక, తెలుగులోనూ ఒకేసారి చేసేస్తే బాగుంటుందని సలహా ఇచ్చా. తెలుగులో నాకు ఉన్న మార్కెట్ దృష్ట్యా చూసినా అది మంచి ఆలోచనే కాబట్టి చేసేశాం.

ప్రశ్న) ప్రభుదేవాతో కలిసి నటించడం ఎలా అనిపించింది?

స) ప్రభుదేవా పక్కన నటించడం అంటే చాలా ఎగ్జైట్ అయ్యా. ఒకసారి పాట షూటింగ్ ఉందంటే, డ్యాన్స్ ఎలా చేయాలీ అని రాత్రంతా నిద్ర పట్టలేదు. అయితే ప్రభుదేవా మాత్రం సెట్లో చాలా సరదాగా ఉంటారు. స్టార్‌డమ్ మొత్తాన్నీ పక్కనపెట్టి సింపుల్‌గా ఉంటారు. ఒక్కసారి కెమెరా స్విచ్చాన్ చేస్తే మాత్రం మళ్ళీ ఆయన తన పనిలో సీరియస్‌గా ఇన్వాల్స్ అయిపోతారు.

ప్రశ్న) ఈ సినిమాలో మీ డ్యాన్స్ ఎలా ఉండబోతోంది?

స) ఒకపాట కోసం చాలా కష్టపడి డ్యాన్స్ చేశా. సినిమాకే హైలైట్‌గా నిలిచే పాట అది. ఇలాంటి సినిమాను వేరే ఇంకొవ్వరూ చేయలేరనే అనుకుంటా.

ప్రశ్న) ఈ సినిమాలో డబుల్‍రోల్ చేశారా?

స) లేదు. నా పాత్రలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఒకటి గ్రామీణ అమ్మాయి పాత్రైతే, ఇంకొకటి హీరోయిన్ పాత్ర. ఈ రెండు షేడ్స్‌లో తేడా చూపించడం కోసం చాలానే కష్టపడ్డా.

ప్రశ్న) అభినేత్రి అన్నిభాషలకూ కనెక్ట్ అయ్యే సినిమాయేనా?

స) కచ్చితంగా! ముఖ్యంగా బాలీవుడ్‌లో హర్రర్ కామెడీలు పెద్దగా రావు కాబట్టి అక్కడి ప్రేక్షకులకు ఇది చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇక తెలుగు, తమిళ ప్రేక్షకులకు హర్రర్ కామెడీ పరిచయం ఉండడంతో కథలోని ఎమోషన్ ఇక్కడి వారికి బాగా నచ్చుతుందన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) సినిమా ఎలా భయపెడుతుంది?

స) ఈ సినిమాలో హర్రర్ పార్ట్ ఉంటుంది కానీ, అది రెగ్యులర్ హర్రర్ సినిమాలా కాకుండా వేరేలా ఉంటుంది. ఎక్కువ బ్లడ్ ఉండే హర్రర్ సినిమా అయితే అభినేత్రి కాదు.

ప్రశ్న) లేడీ ఓరియంటడ్ సినిమా ప్రాధాన్యతను ఎలా గుర్తించారు?

స) లేడీ ఓరియంటడ్ సినిమా చేయాల్సిన సమయం వచ్చింది అనిపించాకే అభినేత్రి చేశా. మనకంటూ ఒక గుర్తింపు, మార్కెట్ వచ్చాక పర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న లేడీ ఓరియంటడ్ సినిమాలు చేయడంలో తప్పులేదు.

ప్రశ్న) జాగ్వార్ అనే సినిమా స్పెషల్ సాంగ్ చేయడానికి కారణం?

స) ఇక్కడే సౌతిండియన్ సినిమా ఆలోచనల్లో ఇంకా మార్పు రాలేదనుకుంటా. సూపర్ స్టార్స్ సైతం బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్ చేస్తూంటారు. మనవల్ల ఒక సినిమాకు అదనపు ఆకర్షణ ఉంటుందంటే స్పెషల్ సాంగ్ చేయడంలో తప్పులేదు. అదేవిధంగా రెమ్యునరేషన్ కూడా బాగున్నప్పుడు చేస్తే మంచిదే కదా!

ప్రశ్న) బాహుబలి సినిమా ఎలా వస్తోంది?

స) క్లైమాక్స్ షూటింగ్‌లో నావి కొన్ని కీలక సన్నివేశాలుంటే పూర్తి చేశా. నా పాత్రకు సంబంధించిన షూట్ ఇంకా కొంత భాగం మిగిలే ఉంది.

ప్రశ్న) పెళ్ళెప్పుడు చేసుకుంటున్నారు?

స) ఇప్పటికైతే సినిమాలతో చాలా బిజీగా ఉన్నా. పెళ్ళిదేముంది? కొంతకాలం వెయిట్ చేస్తుంది. ఇప్పుడే పెళ్ళి ఆలోచనలైతే లేవు.

ప్రశ్న) తదుపరి సినిమాలు ఏంటి?

స) ‘బాహుబలి’, ‘అభినేత్రి’ కాకుండా త్వరలోనే మరో సినిమా మొదలుపెట్టనున్నా. అదేవిధంగా శింబుతో చేస్తోన్న ఓ తమిళ సినిమా అక్టోబర్‌లో మొదలవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు