ఇంటర్వ్యూ : తరుణ్ భాస్కర్ – సురేష్ బాబు గారిచ్చిన సపోర్ట్ మర్చిపోలేను!

ఇంటర్వ్యూ : తరుణ్ భాస్కర్ – సురేష్ బాబు గారిచ్చిన సపోర్ట్ మర్చిపోలేను!

Published on Jul 28, 2016 5:02 PM IST

Tarun-Bhaskar
సినిమాలపై ఉన్న ఇష్టంతో మొదట తన జర్నీని షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి ‘సైన్మా’ అనే షార్ట్ ఫిలిమ్స్ తో ఇండస్ట్రీలోని కొందరు పెద్దల దృష్టిని ఆకర్షించిన వ్యక్తి ‘తరుణ్ భాస్కర్’. గ్లోబల్ సినిమా తరహాలో మన చుట్టూ నిత్యం జరిగే కథలనే సినిమాగా తెరకెక్కించాలని ‘పెళ్లి చూపులు’ అనే ఓ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించాడు. ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేసినప్పటి నుండి ప్రివ్యూ షోల వరకూ అనూహ్య స్పందన సొంతం చేసుకున్న ఈ చిత్రం రేపు (జూలై 29న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా సినిమా గురించి తరుణ్ భాస్కర్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) అసలు మీ ఈ సినిమా జర్నీ ఎలా మొదలైంది ?

జ) ముందుగా ‘అష్టాచమ్మా’ నిర్మాత రామ్మోహన్ గారి ద్వారా బీటెక్ అనే డ్రామా స్క్రిప్ట్ ను షార్ట్ ఫిల్మ్ గా తీయడంతో నా ఫిల్మ్ మేకింగ్ కెరీర్ మొదలైంది. ఆ తరువాత ‘సైన్మా’ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా కాస్త పేరొచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ తో ఈ ‘పెళ్లి చూపులు’ అనే ఫ్యామిలీ డ్రామా స్క్రిప్ట్ తయారుచేసుకున్నాను.

ప్రశ్న) ఈ స్క్రిప్ట్ ను రాయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ?

జ) నేను ముందునుంచీ రియాలిటీ బేస్డ్ స్టోరీనే రాద్దామనుకున్నాను. నేను పెరిగిన వాతావరణం, తిరిగిన ఫ్రెండ్స్, మాట్లాడిన వ్యక్తులు ఇలా అన్నీ కలిసి ఓ రియలిస్టిక్ స్టోరీని రాసేలా ప్రేరేపించాయి.

ప్రశ్న) ఇలాంటి రియాలిటీ బేస్డ్ స్టోరీ రాస్తున్నప్పుడు ఎలా ఫీలయ్యారు ?

జ) స్టోరీ రాస్తున్నప్పుడు నా జర్నీ చాలా కష్టమవుతుందని అనుకున్నాను. ఎందుకంటే ఇంకా మన దగ్గర హీరోయిజం, డైలాగ్ ఓరియంటెడ్ సినిమా ఉంది కాబట్టి జనాలు చూస్తారా చూడరా, ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తారా చెయ్యరా అని భయపడ్డాను. కానీ ప్రయత్నం చేసి చూద్దామని చేశాను.

ప్రశ్న) మొదట ఈ కథని ఎవరికి చెప్పారు ?

జ) మొదట నా సైన్మా షార్ట్ ఫిల్మ్ చూసి మంచు లక్ష్మి గారు నన్ను పిలిచి సినిమాకి అడ్వాన్స్ ఇచ్చారు. అప్పుడామెకు ఈ స్టోరీ చెప్పగానే ఆమెకు కూడా కథ బాగా నచ్చి చేద్దామనుకున్నాం, కానీ ఆమెకున్న బిజీ వల్ల కుదరలేదు. ఆ తరువాత రాజ్ కందుకూరి గారిని కలిసి ఆయనకు కథ చెప్పగానే నచ్చి సినిమా మొదలుపెట్టాం.

ప్రశ్న) ఈ సినిమాకి పని చేసేటప్పుడు మీ అనుభవాలు చెప్తారా ?

జ) మా టీమ్ మొత్తం ఈ సినిమా కోసం క్లౌడ్ ప్రొడక్షన్ ను యూజ్ చేశాం. అంటే ‘ప్రొడక్షన్ మైన్స్’ అనే సాఫ్ట్ వేర్ ద్వారా మొత్తం స్క్రిప్ట్, లొకేషన్స్, డైలాగ్స్ ఇలా అన్నీ దాని ద్వారానే టీమ్ తో పంచుకునే వాళ్ళం. పైగా షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనుభవం ఉండటం వల్ల పెద్దగా ఇబ్బందులేవీ రాలేదు. మొత్తం 32రోజుల్లో సినిమాని షూట్ చేసేశాం.

ప్రశ్న) మొదటిసారి అవుట్ ఫుట్ చూశాక ఎలా అనిపించింది ?

జ) మొదటిసారి రఫ్ కట్ చూడగానే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కాస్త కంగారనిపించింది. కానీ సురేష్ బాబు గారికి సినిమా చూపించగానే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా అన్నారు.

ప్రశ్న) అసలు సినిమాకి ముందుగా ప్రివ్యూ వెయ్యాలనేది ఎవరి ఐడియా ?

జ) ఇది సురేష్ బాబుగారి ఐడియా. 700ల మందికి చూపిస్తే అందులో 99% మందికి ఖచ్చితంగా నచ్చుతుందని, సినిమాలో పెద్ద స్టార్లు లేరు కాబట్టి మంచి మౌత్ టాక్ హెల్పవుతుందని, మన దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది కాబట్టి ధైర్యంగా చూపించమన్నారు. ఆయన అన్నట్టే ఈరోజు అదే జరిగింది. ఆయనకు ధ్యాంక్స్ చెప్పాలి. మొదట సురేష్ బాబుగారంటే, పెద్ద నిర్మాతలంటే మంచి సినిమాలు తీయరని, ఏవేవో విన్నాను కానీ ఆయనను నన్ను ఓపెన్ హార్ట్ తో రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమా విషయంలో ఆయనిచ్చిన సపోర్ట్ మర్చిపోలేను.

ప్రశ్న ) మొదట స్టోరీని సురేష్ బాబుగారికి చెప్పారా ?

జ) అవును. మొదట సురేష్ బాబుగారికి కథ చెప్పగానే ఆయనకు సెకండ్ హాఫ్ నచ్చలేదు. మార్చమన్నారు. నేను అలాగే దాని మీద వర్కవుట్ చేసి తీసుకెళ్ళాను. తరువాత సురేష్ బాబుగారే రాజ్ కందుకూరికి నన్ను పరిచయం చేశారు. తరువాత రాజ్ గారు కథ వినడం, ఒకే చెప్పడం అన్నీ జరిగిపోయాయ్.

ప్రశ్న ) ఎదో సాఫ్ట్ వేర్ అన్నారు దాని గురించి చెప్తారా ?

జ) చిన్న బడ్జెట్ లో మంచి సినిమా చెబుతున్నామంటే అప్పుడుడప్పుడు లాజిస్టికల్ గా ఫెయిల్ అవచ్చు. లొకేషన్స్, బడ్జెట్, డేట్స్, టైమింగ్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయ్. అలాగే ఒక అనుభవం లేని క్రూతో పనిచేస్తున్నప్పుడు సినిమా అనుకున్నట్టు రాదు. కానీ ఇలాంటి సాఫ్ట్ వేర్ల వల్ల క్రియేటివ్ విజన్, పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇందులో షాట్స్, డైలాగ్స్, క్యారెక్టర్స్, రన్ టైం అన్నీ ఇందులో క్లియర్ గా తెలిసిపోతాయ్. దీన్నీ వల్ల షూటింగ్ మొదటిరోజు ఏం అనుకున్నానో అదే తీశాను.

ప్రశ్న) హీరో విజయ్ మీకెలా తెలుసు ?

జ) షార్ట్ ఫిల్మ్ తీసేటప్పటి నుండి విజయ్ నాకు తెలుసు. అతను చాలా బాగుంటాడు. అంత అందంగా ఉండేవాళ్ళకు నటన రాదని అన్నారు. కానీ ఎవడె సుబ్రహ్మణ్యం చూశాక షాక్. అందులో రిషీ పాత్ర చాలా బాగుంటుంది.

ప్రశ్న) పెళ్లి చూపులు బేసిక్ కాన్సెప్ట్ ఏమిటి ?

జ) ముందుగా ఈ సినిమాకి ‘అనుకోకుండా’ అనే టైటిల్ అనుకున్నాను. కానీ అప్పటికే అది రిజిస్టర్ అయిపోయింది. తరువాత వివాహభోజనంబు, పెళ్లి చూపులు అని రెండు టైటిల్స్ అనుకున్నాం. వాటిలో బాగా చూస్తే సినిమా మొదలయ్యేది, పూర్తయ్యేది పెళ్లి చూపులతోనే కాబట్టి అదే బాగుంటుందని పెట్టాం.

ప్రశ్న) మీ తరువాతి ప్రాజెక్ట్ గురించి చెప్తారా ?

జ) నేను తీసిన సైన్మా అనే షార్ట్ ఫిలిం నే డెవలప్ చేసి ఫీచర్ ఫిలిం గా తియ్యాలన్న ఆలోచన ఉంది. అది సురేష్ బాబుగారికి నచ్చాలి. ఈ సినిమా తరువాత సురేష్ బాబుగారు నన్ను పిలిచి ఇకపై ఇలాగే చిన్న బడ్జెట్ లో మంచి సినిమాలు తీస్తావా లేకపోతే పెద్ద హీరోలతో చేస్తావా అని అడిగారు. నేను మంచి సినిమాలే తీస్తానన్నాను. ప్రస్తుతానికి ఆయన రానా, నాగ చైతన్య ల ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అవన్నీ అవగానే ఖచ్చితంగా కూర్చొని డిస్కస్ చేసుకుంటాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు