‘కాటమరాయుడు’ ఓవర్సీస్ ధర చూస్తే కళ్ళు తిరగాల్సిందే !
Published on Feb 15, 2017 4:00 pm IST


పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రస్తుత చిత్రం ‘కాటమరాయుడు’ పై పరిశ్రమలో, ప్రేక్షకుల్లో మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. పైగా ఈ మధ్యే విడుదలైన టీజర్ సైతం సూపర్ హిట్ అవడంతో ఆ క్రేజ్ ఇంకాస్త పెరిగింది. దీంతో చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ఆకాశమే హద్దుగా జరుగుతోంది. ఇప్పటిదాకా అనేక ఏరియాల్లో రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన చిత్ర హక్కులు ఓవర్సీస్ లో సైతం కళ్ళు తిరిగే ధరకు అమ్ముడయ్యాయి.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఒకటి ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను దాదాపు రూ. 11 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిందట. ఏ స్టార్ హీరో సినిమాకైనా ఇది పెద్ద మొత్తమనే చెప్పాలి. ఇక ఈ పెట్టుబడి తిరిగి రావాలంటే సినిమా భారీ విజయం సాధించి ఓపెనింగ్స్ రోజు నుండే బాక్సాఫీస్ ముందు కనక వర్షం కురిపించాలి. ఇకపోతే డాలి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మార్చి నెలలో రిలీజయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

 
Like us on Facebook