చిట్ చాట్ : కిరణ్ – చిరంజీవి గారి స్ఫూర్తితో హీరో అయ్యాను.

చిట్ చాట్ : కిరణ్ – చిరంజీవి గారి స్ఫూర్తితో హీరో అయ్యాను.

Published on Oct 22, 2014 2:40 PM IST

Kiran
కిరణ్, ప్రియాంక జంటగా చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఐ యాం ఇన్ లవ్’. సుజన్ నిర్మాత. ప్రదీప్ కేకే సంగీతం అందించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 24న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో కిరణ్ మీడియాతో సమావేశం అయ్యారు. సినిమా విశేషాలను మాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం.

ప్రశ్న) మీ నేపధ్యం గురించి చెప్పండి..?

స) మా స్వస్థలం గుంటూరు. కాకపోతే, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాం. నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. నేను చెన్నైలో బి.టెక్ చేశాను. చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే బాగా ఇంటరెస్ట్. ఆ ఇష్టంతోనే సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించాను. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ ఫిల్మ్ & మీడియాలో యాక్టింగ్ కోర్స్ చేశాను. ఇప్పుడు ‘ఐ యాం ఇన్ లవ్’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాను.

ప్రశ్న) ఈ సినిమాలో హీరో అవకాశం ఎలా వచ్చింది..?

స) యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆ సమయంలో తెలిసిన వ్యక్తి ద్వారా ‘ఐ యాం ఇన్ లవ్’ సినిమా దర్శకుడు చంద్రశేఖర్ రెడ్డి గారిని కలిశాను. నా పోర్ట్ ఫోలియో, షో రీల్స్ ఆయనకు చూపించాను. అవి నచ్చడంతో నన్ను హీరోగా సెలెక్ట్ చేశారు.

ప్రశ్న) ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి..?

స) కాలేజీలో చదువుకుంటూనే రేడియోలో జాబ్ చేసే కుర్రాడి పాత్రలో నటించాను. రేడియో జాకి (ఆర్.జె.)గా కనిపిస్తాను. స్నేహితులు మరియు నా షోకి ఫోన్ చేసిన కాలర్స్ ప్రేమ సమస్యలకు పరిష్కారం మార్గం చూపిస్తాను. లవ్ గురు అనమాట. నాకు జోడిగా ప్రియాంక నటించింది. ఆట, రంగం వంటి డాన్స్ రియాలిటీ షోలలో పార్టిసిపేట్ చేసిన ఆమెకు హీరోయిన్ ఇది తొలి సినిమా.

ప్రశ్న) ఈ సినిమా ఎ తరహా కేటగిరీకి చెందినది..?

స) ప్రేమ కోసం హీరో ఒక అబద్దం చెబుతాడు, అందులో కూడా ఓ నిజాయితి ఉంటుంది. ఆ అబద్దం వలన అతని జీవితంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయి అనేది సినిమా కథ. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఫిల్మ్ ఇది. ఎటువంటి డబల్ మీనింగ్ డైలాగులు, ఆ తరహా సన్నివేశాలు ఉండవు. ఈ నెల 24న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మంచి విజయం సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నాను.

ప్రశ్న) హీరో కావడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు..?

స) మెగాస్టార్ చిరంజీవి. ఆయన నటన, డాన్సులు అంటే నాకు చాలా ఇష్టం. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తో హీరో అయ్యాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు