‘లవ్’.. నా కెరీర్ బెస్ట్ క్యారెక్టర్స్‌లో ఒకటి : విక్రమ్
Published on Aug 16, 2016 12:36 pm IST

vikram
హీరో విక్రమ్ గురించి తెలుగు, తమిళ సినీ అభిమానులకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌతిండియన్ సినిమాలో పలు అద్భుతమైన ప్రయోగాలు చేసి, నటనపై తనకున్న మక్కువ చూపి అందరి మన్ననలూ పొందిన ఈ హీరో తాజాగా ‘ఇరుముగన్’ (తెలుగులో ‘ఇంకొక్కడు’) సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైపోయారు. సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల కానున్న ఈ సినిమా తెలుగు వర్షన్‌కు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా హీరో విక్రమ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకుల అభిమానానికి ఎప్పటికీ ఋణపడి ఉంటానని తెలిపారు. ‘ఇంకొక్కడు’ సినిమాలో తాను అఖిల్, లవ్ అనే రెండు పాత్రలు చేశానని, ఇందులో లవ్ పాత్ర తన కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్స్‌లో ఒకటని అన్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా, నయనతార, నిత్యా మీనన్ విక్రమ్ సరసన హీరోయిన్లుగా నటించారు. తన గత రెండు చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో విక్రమ్ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు.

 

Like us on Facebook