పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నాని సినిమా!

majnu
నాని ఇప్పుడు తెలుగు సినిమాలో కొత్తగా అవతరించిన ఓ స్టార్. ‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి మొదలుకొని ఈమధ్యే విడుదలైన ‘జెంటిల్‌మన్’ వరకూ ఏడాదిన్నరలో వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకొని దూసుకుపోతోన్న ఈ హీరో, అప్పుడే తన కొత్త సినిమా ‘మజ్ను’ను కూడా శరవేగంగా పూర్తి చేసేస్తున్నారు. ‘ఉయ్యాల జంపాల’తో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మజ్ను’ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఒక పక్క తన కొత్త సినిమా ‘నేను లోకల్’ షూటింగ్‌లో పాల్గొంటూనే, మరోపక్క ‘మజ్ను’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా నాని చకచకా పూర్తి చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ టీజర్ సినిమాపై ఉన్న అంచనాలన్నింటినీ తారాస్థాయికి చేర్చింది. నాని స్టైల్లో కామెడీకి పెద్ద పీట వేసే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రచారం పొందుతోన్న మజ్నును కిరణ్ నిర్మిస్తున్నారు. నాని సరసన అను ఎమ్మాన్యూల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Like us on Facebook