ఇంటర్వ్యూ: మంచు మనోజ్ – నా కెరీర్లో పెద్ద హిట్టైన ఆ సినిమాని బలవంతం మీదనే చేశాను !

ఇంటర్వ్యూ: మంచు మనోజ్ – నా కెరీర్లో పెద్ద హిట్టైన ఆ సినిమాని బలవంతం మీదనే చేశాను !

Published on Feb 26, 2017 3:06 PM IST


యంగ్ హీరో మంచు మనోజ్ త్వరలో రెండు సరికొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వాటిలో ముందుగా ‘గుంటూరోడు’ చిత్రం మార్చి 3న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ చిత్ర విశేషాలు మీకోసం…

ప్ర) ఈ సినిమా రిలీజ్ ఎందుకు ఆలస్యమైంది ?
జ) ముందుగా ఫిబ్రవరి 24న విడుదలచేద్దామని అనుకున్నాం. కానీ అప్పటికే అన్ని థియేటర్లలో మంచి సినిమాలు ఉండటం వలన మా సినిమాకి అనుకున్ననన్ని ఎక్కువ థియేటర్లు దొరకలేదు. అందుకే కాస్త ఆగి థియేటర్లు చూసుకుని మార్చి 3న రిలీజ్ చేస్తున్నాం.

ప్ర) ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ?
జ) ఇందులో నేను పూర్తి స్థాయి మాస్ హీరోగా, సరికొత్తగా కనిపిస్తాను. అన్యాయం జరగడం చూస్తే తట్టుకోలేక ఎవరినైనా ఎదిరించే పాత్ర. సంతోషం కలిగినా, భాధ కలిగినా ఎక్కువ తట్టుకోలేను. మొత్తంగా చెప్పాలంటే గుంటూరు మిర్చీలాగా చాలా హాట్ గా ఉంటుంది.

ప్ర) ఇంతకు ముందు చేసిన ప్రయోగాలు పెద్దగా సక్సెస్ కాలేదు కదా.. మళ్ళీ అలాంటివి చేస్తారా ?
జ) ఖచ్చితంగా చేస్తాను. ప్రస్తుతానికి కమర్షియల్ హిట్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాను. నా తరువాత సినిమాలు ప్రయోగాత్మకంగానే ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకుంటూ వెళుతున్నాను. నిజాంనికి నా కెరీర్లో పెద్ద కమర్షియల్ హిట్టైన ‘పోటుగాడు’ బలవంతంగా చేసిందే. నేను చేసిన వాటిల్లో ఇప్పటికీ నాకిష్టమైనవి ‘ప్రయాణం, వేదం, నేను మీకు తెలుసా’ సినిమాలే. అవి ఇపుడు చూసిన ఫ్రెష్ గానే ఉంటాయి.

ప్ర) మీ దర్శకుడు సత్య గురించి చెప్పండి ?
జ) సత్య.. టాలెంట్ ఉన్న దర్శకుడు. చెప్పింది చెప్పినట్టే తీశాడు. అతను నాకు చేసి చూపిన యాక్షన్ నే ఫాలో అయిపోయాను. సినిమా చివర్లో ఎమోషనల్ సన్నివేశాలను చాలా బాగా తీశాడు. ఖచ్చితంగా ఇది మంచి హిట్టవుతుంది.

ప్ర) మీరు కథలు ఎంచుకునేప్పుడు ఎవరి సలహా అయినా తీసుకుంటారా ?
జ) లేదు. ఎవరి సలహాలు తీసుకోను. ఏదైనా నేనే ఫైనల్ చేస్తాను. అంతేగాని మా నాన్నకు, అన్నయ్యకు, మేనేజర్ కు కథ చెప్పమని చెప్పను. ఎవరైనా సరే కథ ఉందని వస్తే నేనే విని, ఫైనల్ డెసిషన్ తీసుకుంటాను.

ప్ర) పెళ్ళైన తర్వాత సినిమాల పట్ల మీ దృక్పథం ఏమైనా మారిందా ?
జ) లేదు. అస్సలు మారలేదు. కానీ చిన్న చిన్న మార్పులైతే వచ్చాయి. ఇంతకు ముందు ఇంటిని పెద్దగా పట్టించుకోకుండా పని చేసేవాడిని. కానీ ఇప్పుడు రెండింటినీ ఒకేలా చూసుకోవాలని అర్థమైంది.

ప్ర) ఒకసారి ప్రయోగం విఫలమైతే రెండోసారి చేయడానికి కావాల్సిన ఇన్స్పిరేషన్ ఎక్కడి నుండి తీసుకుంటారు ?
జ) ఇంట్లో మా నాన్న ఉన్నారు. ఆయన జీవితం ఎత్తులు, పల్లాలు అన్నీ చూసింది. ఆయన వెనకే నడుస్తూ మేము కూడా అన్నీ చూశాం. ఓటమిని ఎలా తట్టుకోవాలో ఆయన నుండే నేచుకున్నాం. ఇంకా చిరంజీవి అంకుల్ లాంటి వాళ్ళున్నారు. వాళ్లంతా మాకు ఇన్స్పిరేషనే.

ప్ర) ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్లు ఎలా ఉంటాయి ?
జ) ఇందులో యాక్షన్ ఎంత కావాలో అంతే ఉంటుంది. ఎక్కువవదు, తక్కువవదు. ముఖ్యంగా నాకు సంపత్ గారికి మధ్య నడిచే సీన్లు చాలా హెవీగా అంటాయి. ఆయన నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన వలనే నేను కూడా ఇంకా బాగా పెర్ఫార్మ్ చేయడానికి ట్రై చేశాను.

ప్ర) సినిమాలు కోసం ఇలా బరువు పెరగడం, తగ్గటం ఎలా అనిపిస్తుంది ?
జ) గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు సినిమాలకి నాలో 8 కేజీల బరువు తేడా ఉంటుంది. ఈ బరువును కేవలం 20 రోజుల్లో తగ్గించా. బరువు పెరగడం సులభమే కానీ తగ్గటమే కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా ఒకసారి అలవాటైతే పర్లేదు చేసేయ్యొచ్చు.

ప్ర) ఒక్కడు మిగిలాడు సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) అది కూడా మంచికమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. దర్శకుడు అజయ్ చాలా బాగా తీశాడు. చివర్లో వచ్చే వార్ సీన్ అయితే అదిరిపోతుంది. అందులో నేను ఎల్టీటీఈ ప్రభాకరన్ పాత్ర చేశాను. సినిమా మే నెలలో రిలీజవుతుంది.

ప్ర) ఆ సినిమా వలన సమస్యలేమైనా రావొచ్చా ?
జ) లేదు. అందులో శ్రీలంకలోని తమిళులపై జరిగే అన్యాయాలను చూసి ప్రభాకరన్ ఒక నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేదే చూపిస్తాం. 1990, 2017 లో నడిచే రెండు కథలు ఉంటాయి. తమిళ ప్రేక్షకులకు అయితే బాగా నచ్చుతుంది.

ప్ర) తమిళ పరిశ్రమలోకి వెళ్లే ఆలోచనలేమైనా ఉన్నాయా ?
జ) మే నెల నుండి ఒక ద్విభాషా చిత్రాన్ని స్టార్ట్ చేస్తాను. ఈ ‘గుంటూరోడు’ సినిమాని కూడా తమిళంలోకి రీమేక్ చేద్దామని అనుకుంటున్నాను. త్వరలోనే అది కూడా డిసైడవుతుంది.

ప్ర) భావన పై జరిగిన ఘటనపై మీ స్పందన ఏంటి ?
జ) అది చాలా ఘోరం. ఇవొక్కటే కాదు సొసైటీలో ఆడవాళ్లు, చిన్న పిల్లలపై చాలా ఘోరాలు జరుగుతున్నాయి. అవి చూస్తుంటే కోపమొస్తుంటుంది. ఎలాగైనా వాటిపై పోరాడాలనిపిస్తుంది. అందుకే ఈ అంశం మీద త్వరలోనే ఒక సినిమా చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. స్టోరీ రెడీ అవుతోంది.

ప్ర) మీ హీరోయిన్ ప్రగ్య గురించి చెప్పండి ?
జ) ప్రగ్య జైస్వాల్ మంచి కో స్టార్. చాల మంచి నటి కూడా. ఎప్పుడూ హుషారుగా, నవ్వుతో ఉంటుంది. సెట్లో అల్లరి చేస్తూనే ఉంటాం. మా టీమ్ అంతా ఎప్పుడూ పాజిటీవ్ గానే పని చేశాం. చిన్నా రీరికార్డింగ్, వసంత్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అవి బాగా హైలైట్ అవుతాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు