‘ప్రేమమ్’ రిలీజ్‌పై ఇంకా క్లారిటీ రాలేదట!

premam
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన రెండు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ కాగా, మరొకటి దర్శకుడు చందూ మొండేటీ తెరకెక్కించిన ‘ప్రేమమ్’. ఈ రెండు సినిమాల విడుదల తేదీల విషయంలో కొద్దికాలంగా చాలా మార్పులు జరిగాయి. ఈమధ్యే ఈ రెండు సినిమాలూ సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తాయని, రెండు సినిమాల నిర్మాతలు ప్రకటించేశారు.

దీంతో నాగ చైతన్య సినిమాల రిలీజ్ విషయమై గందరగోళం నెలకొంది. తాజాగా ఈ విషయమై నాగ చైతన్య స్వయంగా మాట్లాడుతూ.. “రిలీజ్ డేట్ అన్నది నిర్మాతల చేతుల్లోని అంశం. దాని గురించి హీరోగా నేను పూర్తిగా ఏదీ ప్రకటించలేను. ప్రస్తుతానికి ప్రేమమ్ సినిమాను సెప్టెంబర్ 9న, కొన్ని వారాల తర్వాత సాహసం శ్వాసగా సాగిపోను ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే ఈ విషయమై ఓ ప్రకటన వస్తుంది” అని ఓ ప్రముఖ దినపత్రికతో అన్నారు. ఈ నెలాఖరు కల్లా ‘ప్రేమమ్’ ఆడియో విడుదలవుతుందని తెలుస్తోంది.

 

Like us on Facebook