ఇంటర్వ్యూ : బాలకృష్ణ – సంక్రాంతికి పోటీ అనేది ఎప్పుడూ ఉండేదే!

ఇంటర్వ్యూ : బాలకృష్ణ – సంక్రాంతికి పోటీ అనేది ఎప్పుడూ ఉండేదే!

Published on Jan 10, 2017 2:23 PM IST

bala-krishna-jpg-m
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చేయడం పూర్వ జన్మ సుకృతం అని తెలిపిన బాలయ్యతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) కెరీర్‌కు ఎంతో ప్రతిష్టాత్మకమైన వందో సినిమాకు చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా ఎంచుకున్నారు ఎందుకని?

స) గౌతమిపుత్ర శాతకర్ణి నేను కావాలని వందో సినిమాగా ప్లాన్ చేసింది కాదు. వందో సినిమా అంటే ప్రత్యేకంగా ఉండాలని చాలా కథలు విన్నా. అందులో ఈ కథ ఎందుకో విపరీతంగా నచ్చింది. ఎవ్వరికీ పెద్దగా తెలియని ఒక గొప్ప వ్యక్తి కథ చెప్తున్నామన్న ఆలోచన కలగగానే వెంటనే ఒప్పేసుకున్నా. నిజానికి ఇలాంటి ఒక ప్రత్యేక సినిమా నా వందో సినిమా కావడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తా.

ప్రశ్న) ఒక కమర్షియల్ సినిమా కాకుండా ఇలా హిస్టారికల్ సినిమా అంటే రిస్క్ అనిపించలేదా?

స) లేదు. నేనెప్పుడూ ఇలాంటి కొత్తదనమున్న సినిమాలు తీయడం రిస్క్ అనుకోను. ధైర్యంగా ముందడుగు వేస్తేనా ఏదైనా సాధించగలం. మేమందరం ఈ సినిమాను మొదట్నుంచీ బలంగా నమ్మాం. ఇప్పుడు ఫైనల్ ఔట్‌పుట్ చూశాక విజయంపై అంతే ధీమాగా ఉన్నాం.

ప్రశ్న) ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కథలో మీకు అంతగా నచ్చిన అంశాలేంటి?

స) తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తుల్లో ఒకరు శాతకర్ణి. అలాంటి వ్యక్తి కథ ఎంతమందికి తెలుసు? అలాంటి వ్యక్తి జీవితంలోని రకరకాల భావోద్వేగాలు ఎంతమందికి తెలుసు? ఇవన్నీ ఆలోచించడంతోనే నాకు చాలా ఉత్సాహం వచ్చేసింది. ఇక నాన్నగారు (నందమూరి తారకరామారావు) ప్రసాదించిన వరమో ఏమో తెలియదు కానీ, ఇలాంటి సినిమాలు చేయాలన్న ఆలోచన ఆయనను తలచుకున్నప్పుడల్లా బలపడుతూ ఉంటుంది.

ప్రశ్న) శాతకర్ణి పాత్ర కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?

స) ప్రత్యేకంగా పాత్ర కోసం కసరత్తులు చేయడం అంటూ ఏమీ లేదు. దర్శకుడు క్రిష్ గారి విజన్, నాన్నగారు కూడా ఈ సినిమా చేయాలనుకొని ఉండడం లాంటివన్నీ నన్ను ముందుకు నడిపించాయి. సినిమా చేస్తున్నంత కాలం నాన్నగారు ఎక్కడో ఓ అదృశ్య శక్తిలా నన్ను నడిపించారని అనిపిస్తూంటుంది. బహుశా ఆయన ప్రేరణ లేకపోతే ఈ సినిమా ఇంత సులువుగా చేయగలిగేవాడిని కాదేమో!

ప్రశ్న) దర్శకుడు క్రిష్ గురించి చెప్పండి?

స) క్రిష్ ఒక అద్భుతమైన దర్శకుడు. ఆయన గతంలో చేసిన ఐదు సినిమాలూ వేటికవే ప్రత్యేకమైనవి. నా దగ్గరకు వచ్చే దర్శకులు చాలామంది ఒకే రకమైన మూస కథలను పట్టుకొస్తూ ఉంటారు. క్రిష్ ఇలాంటి కొత్త కథను తీసుకురావడమే నాకు ఉత్సాహాన్నిచ్చింది. నన్నడిగితే ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో క్రిష్‌ను పోల్చవచ్చు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఉండే స్పీల్‌బర్గ్‌తో క్రిష్‌ను పోల్చానంటే ఆలోచించండి.

ప్రశ్న) తక్కువ రోజుల్లోనే ఇంత భారీ బడ్జెట్ సినిమాను పూర్తి చేయడం ఎలా సాధ్యమైంది?

స) ఆ క్రెడిట్ అంతా టీమ్ ప్లానింగ్‌కు దక్కాలి. ఒక మంచి పనిచేస్తున్నపుడు పంచ భూతాలన్నీ మనకు సహకరిస్తాయంటారు. అలా ఈ సినిమా షూటింగ్ జార్జియా, మొరాకో లాంటి ప్రాంతాల్లో చేసినప్పుడు కూడా మాకు ఏ ఇబ్బంది కలగలేదు. జార్జియాలో అయితే అంతటా వర్షం పడేది కానీ, మా షూటింగ్ ప్రాంతం మాత్రం మామూలుగా ఉండేది. ఇవన్నీ మన పనికి సహకరించేవిగానే చెప్పుకోవచ్చు.

ప్రశ్న) యుద్ధ సన్నివేశాల కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?

స) గుర్రపు స్వారీ, కత్తి తిప్పడం లాంటివి నేనెప్పుడూ నేర్చుకోలేదు. ఆదిత్య 369, భైరవద్వీపం ఆ సమయంలో సినిమాకు అవసరం అంటే చేసేశా. అదే ఉత్సాహంతో ఇప్పుడూ ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఏదీ తీసుకోలేదు.

ప్రశ్న) శ్రియ, హేమా మాలిని.. ఇలా ఇతర తారాగణం గురించి చెప్పండి?

స) ఈ సినిమా విషయంలో ముందే చెప్పినట్టు మాకు అన్నీ సహకరించాయి. హేమా మాలిని లాంటి గొప్ప నటి మా సినిమాలో నటించారు. నాన్నగారి సినిమాలో ఒకసారి నటించారామె. మళ్ళీ ఇన్నేళ్ళకు తెలుగులో ఒక బలమైన పాత్రతో మెప్పించనున్నారు. ఇక శ్రియ చాలా తెలివైన నటి. ఆమె ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. కబీర్ బేడి కూడా విలన్‌గా చాలా బాగా చేశారు.

ప్రశ్న) ఫైనల్ ఔట్‌పుట్ చూశాక మీ వందో సినిమా స్థాయికి తగ్గట్టు గౌతమిపుత్ర శాతకర్ణి ఉందనిపించిందా?

స) కచ్చితంగా నా వందో సినిమా స్థాయికి తగ్గ సినిమాగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని చెప్పుకోవచ్చు. సినిమా చూసిన మేమంతా ఒక మంచి సినిమా తీశామన్న నమ్మకంతో, విజయంపై ధీమాగా ఉన్నాం. 2 గంటల 15 నిమిషాల్లో కథకు అవసరమయ్యే అన్ని అంశాలతో క్రిష్ ఒక గొప్ప సినిమా తీశాడు. సినిమాకు ఏది అవసరమో దాన్నే చెప్పడానికి అందరినీ ఒప్పించడంలో క్రిష్ చూపిన ప్రతిభ వల్లే ఇది సాధ్యమైందనుకుంటున్నా.

ప్రశ్న) సంక్రాంతికి ఖైదీ నంబర్ 150తో పాటు గౌతమిపుత్ర శాతకర్ణి వస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య పోటీని ఎలా చూస్తారు?

స) పండక్కి సినిమాల మధ్య పోటీ ఉండడం అన్నది ఎప్పుడూ ఉండేదే. ముఖ్యంగా సంక్రాంతికి ప్రతిసారీ రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతూనే ఉంటాయి. చిరంజీవి గారికి, నాకూ ఇప్పుడొస్తున్న సినిమాలు ప్రతిష్టాత్మకమైనవి. రెండు సినిమాలూ విజయం సాధించాలని కోరుకుంటున్నా.

ప్రశ్న) తదుపరి సినిమా ఏంటి?

స) కృష్ణవంశీతో ఓ సినిమా విషయమై చర్చలు జరుగుతున్నాయి. 100వ సినిమా తర్వాత కెరీర్‌ను ప్రత్యేకంగా ప్లాన్ చేయాలనుకున్నా. ఈ క్రమంలోనే ఇకపై వచ్చే నా సినిమాల్లో కొత్త బాలకృష్ణను చూస్తారు. మరో మాటగా చెప్పాలంటే ఇకనుంచి బాలకృష్ణ శకం మొదలవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు