అది కవితైతే ఇది కథ అంటున్న నాని డైరెక్టర్

అది కవితైతే ఇది కథ అంటున్న నాని డైరెక్టర్

Published on Feb 9, 2016 2:17 PM IST

Hanu_Raghavapudi1
హను రాఘవపూడి. మూడేళ్ళక్రితం ఈ పేరు ఎక్కువగా వార్తల్లో నిలిచింది. దానికి కారణం తను దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘అందాల రాక్షసి’ అందరినీ ఆకర్షించడమే. చంద్రశేఖర్ ఏలేటి దగ్గర “ఐతే” నుండి “ఒక్కడున్నాడు” వరకూ దర్శకత్వ విభాగంలో పనిచేసిన హను రాఘవపూడి సాయి కొర్రపాటి, రాజమౌళి లు నిర్మాతలుగా వ్యవహరించిన “అందాల రాక్షసి” భారీ అంచనాల నడుమ రిలీజైంది. కానీ విడుదల అయిన తర్వాత విమర్శకులను మాత్రమే మెప్పించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

దాదాపు మూడేళ్ళ తర్వాత ఇప్పుడు “కృష్ణగాడి వీర ప్రేమ గాధ” అంటూ మళ్ళీ ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు హను రాఘవపూడి. నాని హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ కానుంది. ‘ ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ అనంతపూర్ ఫాక్షన్ నేపథ్యంలో సాగే విభిన్న కథాంశం. నాని చాలా సామాన్యుడు, భయస్తుడు పాత్రలో కనిపిస్తాడు. మహాలక్ష్మి ప్రేమలో పడిన తర్వాత నాని తన జీవితంలోనే అత్యంత సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఆ నిర్ణయం ఈ కథకు ఆయువుపట్టు. “అందాల రాక్షసి” కొందరికే అర్థమయ్యే కవిత్వం లాంటిది అయితే “కృష్ణగాడి వీర ప్రేమ గాధ” అందరికీ అర్థం అయ్యే కథ, ఈ కథలో చాలా వినోదం కూడా ఉంటుందని’ హను రాఘవపూడి అన్నాడు.

ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట మరియు అనిల్ సుంకర లు నిర్మిస్తున్నారు. భలే భలే మగాడివోయ్ హిట్ తర్వాత నాని ఈ చిత్రం లో నడించడంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఇందులో నాని సరసన మెహరీన్ కౌర్ కథానాయికగా నటిస్తుండగా ముఖ్యపాత్రలలో మురళీ శర్మ, సంపత్ రాజ్ నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు