మహేష్ సినిమా కోసం ప్లాన్ మార్చిన కొరటాల!
Published on Nov 9, 2016 8:14 am IST

Mahesh-Babu-Koratala-Shiva
సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు కొరటాల శివల కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’ అనే సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడిదే కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందనగానే అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టేశారు. రేపు (నవంబర్ 9న) వైభవంగా ప్రారంభం కానున్న ఈ సినిమాకు కొరటాల శివ తన గత మూడు చిత్రాలకు భిన్నంగా హీరోయిన్ ఎంపిక విషయం ప్లాన్ మార్చేశారు.

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్.. ఇలా తన దర్శకత్వంలో తెరకెక్కిన మూడు సినిమాలకూ స్టార్ హీరోయిన్లనే ఎంపిక చేసిన కొరటాల, ఇప్పుడు మహేష్‌తో చేస్తోన్న సినిమాకు మాత్రం కొత్త హీరోయిన్ కోసం చూస్తున్నారట. మహేష్‌కు హీరోయిన్‌గా, సినిమా కథ రీత్యా కూడా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని కొరటాల శివ ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి మహేష్‌కు హీరోయిన్‌గా నటించే ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు రవి కే.చంద్రన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.

 
Like us on Facebook