‘అఖిల్’ టైటిల్‌ ట్యాగ్‌లైన్‌పై క్లారిటీ ఇచ్చిన నితిన్!

‘అఖిల్’ టైటిల్‌ ట్యాగ్‌లైన్‌పై క్లారిటీ ఇచ్చిన నితిన్!

Published on Aug 28, 2015 1:31 AM IST

akhil
అక్కినేని వంశంలో మూడో తరం నుంచి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు అక్కినేని అఖిల్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే! ఇప్పటికే పలు వర్కింగ్ స్టిల్స్, మేకింగ్ వీడియోస్‌తో అఖిల్ ఎంట్రీ సినిమా ఏ రేంజ్‌లో ఉండనుందనేది ఋజువైంది. తాజాగా ఈ సాయంత్రం టైటిల్‌తో కలిపి విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ద్వారా అఖిల్ ఎంట్రీ మామూలుగా ఉండడం లేదనే విషయం మరోసారి స్పష్టమైంది. ఈ సినిమా టైటిల్ విషయమై ఇప్పటివరకూ చాలా ప్రచారాలే జరగగా, చివరకు ‘అఖిల్’ అన్న పేరును ఖరారు చేశారు. అఖిల్ పేరునే సినిమా పేరుగా పెట్టడంతో ఈ సినిమాపై సర్వత్రా ఓ ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది.

దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత నితిన్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను అన్నివిధాలా ది బెస్ట్ అనిపించేలా చేసేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేశారన్న విషయం ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తో స్పష్టమైంది. ఇక ఇదలా ఉంచితో ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో అందరికీ ఆసక్తికరంగా మారిన అంశం ఒకటుంది. అదే అఖిల్ సినిమా ట్యాగ్‌లైన్. ‘ది పవర్ ఆఫ్ జువా’ అన్న ట్యాగ్‌లైన్‌తో అఖిల్ సినిమా రానుంది. పోస్టర్ విడుదలైనప్పట్నుంచే ఈ జువా అంటే అర్థం ఏమై ఉంటుందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది.

ఇక ఈ చర్చలకు, రకరకాల ఊహాగానాలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నంగా నితిన్, జువా అనే దానికి అర్థం తెలిపారు. జువా అంటే సూర్యుడు అనే అర్థం వస్తుందని నితిన్ ఈ సందర్భంగా తెలిపారు. ఆఫ్రికాకు చెందిన స్వాహిలి భాషలో జువా అంటే సూర్యుడు అని అర్థం. ఇక నితిన్ ఇచ్చిన ఈ క్లారిటీ తర్వాత ఆఫ్రికన్ నేపథ్యానికి, సినిమా కథకు ఎలాంటి సంబంధం ఉందనే చర్చ మళ్ళీ కొత్తగా మొదలైంది. ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ‘అఖిల్’ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు