‘ఓం నమో వెంకటేశాయ’ రాఘవేంద్రరావు ఆఖరి సినిమా?

raghavendra
దర్శకుడు రాఘవేంద్రరావుకు తెలుగు సినీ చరిత్రలో పలు మరపురాని సినిమాలను తెరకెక్కించిన పేరుంది. స్టార్ కమర్షియల్ డైరెక్టర్స్‌లో ఒకరుగా పేరుగాంచిన ఆయన, దర్శకేంద్రుడు అన్న బిరుదును సైతం అందుకొని పలు బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించారు. ఇక తాజాగా ఆయన ‘ఓం నమో వెంకటేశాయ’ పేరుతో ఓ భక్తిరస చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. కింగ్ అక్కినేని నాగార్జునతో అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీ సాయి లాంటి చిత్రాలను తీసిన రాఘవేంద్రరావు, ఆ కోవలోనే ఓం నమో వెంకటేశాయను మరో అద్భుతమైన భక్తిరస చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.

ఇక తాజాగా నిన్న సాయంత్రం జరిగిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకలో భాగంగా రాఘవేంద్రరావుకు ఇది ఆఖరి సినిమా కావొచ్చని నాగార్జున అనడం ఆసక్తికరంగా మారింది. ఓం నమో వెంకటేశాయతో ఇక సినిమాలను ఆపేయాలనుకుంటున్నట్లు, ఇదే తన ఆఖరి సినిమా కావొచ్చని షూటింగ్ సందర్భంగా రాఘవేంద్రరావు చాలాసార్లు నాగ్‌తో చెప్పారట. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నాగార్జున నిన్న మాట్లాడారు. మరి ఈ సినిమాతో నిజంగానే రాఘవేంద్రరావు సినిమాలను ఆపేస్తారా? అన్నది కాలమే నిర్ణయించాలి.

 

Like us on Facebook