ఇంటర్వ్యూ: పి. సునీల్ కుమార్ రెడ్డి – మిగిలిన సినిమాలకన్నా మా సినిమా ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంది !

ఇంటర్వ్యూ: పి. సునీల్ కుమార్ రెడ్డి – మిగిలిన సినిమాలకన్నా మా సినిమా ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంది !

Published on Mar 10, 2017 7:00 PM IST


ప‌వ‌న్‌, కారుణ్య‌ చౌదరి జంటగా న‌టించిన సినిమా `ఏటీఎం వ‌ర్కింగ్‌’. డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్‌, శ్రావ్య ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ‘గంగపుత్రులు’ వంటి మంచి సందేశాత్మక చిత్రంతో అందరి ప్రసంశలు అందుకున్న పి.సునీల్ కుమార్ రెడ్డి డైరెక్ట్ చేశారు. మార్చి 17న చిత్ర రిలీజ్ సందర్బంగా దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) ‘ATM వర్కింగ్’ అనే ఈ వెరైటీ టైటిల్ ను గురించి కాస్త వివరంగా చెప్తారా ?
జ) ఇక్కడ ATM అంటే అనంత్, త్రిలోక్, మహేష్ అనే ముగ్గురు కుర్రాళ్ళు. వాళ్ళు ముగ్గురు జీవితంలో సెటిల్ అవ్వడానికి కష్టపడుతుంటారు. అందుకే ATM వర్కింగ్ అనే టైటిల్ పెట్టాను.

ప్ర) ఇందులో కథ ఎలా ఉండబోతోంది ?
జ) ఈ కథ మోదీ చేసిన డిమానిటైజేషన్ విధానాన్ని అనుసరించి ఉంటుంది. ఆ విధానంలో ఎప్పటికప్పుడు జరిగే కీలక మార్పులను యాడ్ చేసుకుంటూ కథనాన్ని ఏరోజుకారోజు డెవలప్ చేసుకుని సినిమా తీశాం. దాంతో పాటు ఇందులో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంటుంది.

ప్ర) అసలు ఈ ఆలోచన మీకెలా వచ్చింది ?
జ) ఒకసారి ఏటీఎంలో క్యాష్ కోసం నిల్చుని ఉంటే ఒక హీరో హీరోయిన్ కలుసుకోవడానికి ప్రస్తుతం ఇంతకంటే మంచి సిట్యుయేషన్ మరొకటి ఉండదని అనిపించి కథను హీరో హీరోయిన్లు ఏటీఎంలో కలుసుకోవడం ద్వారా మొదలుపెట్టాను.

ప్ర) సినిమాలో డీమానిటైజేషన్ మీద ఒక ఖచ్చితమైన జడ్జిమెంట్ ఏమైనా ఇచ్చారా ?
జ) లేదు..అలాంటి తీర్పులేమీ ఇవ్వలేదు. కానీ దాని వలన రోజువారీ జీవితంలో సామాన్య ప్రజలు పడిన ఇబ్బందుల్ని మాత్రం ఎలివేట్ చేశాం. అలాగే సామాన్యుడి నుండి ధనవంతుడి వరకు ప్రతి ఒక్కరు మోదీ నిర్ణయ ప్రభావానికి ఎలా గురయ్యారు అనేది కూడా చూపించాం.

ప్ర) అంటే ఇందులో అన్ని రకాల రియల్ క్యారెక్టర్స్ ఉంటాయా ?
జ) ఉంటాయి. ఒక నిర్మాత, ఒక దర్శకుడు, ఒక పొలిటీషియన్ ఇలా ప్రతి ఒక్కర్ని ప్రతిబించించే పాత్ర ఈ చిత్రంలో కనిపిస్తుంది.

ప్ర) అంటే పర్టిక్యులర్ గా ఎవరినైనా ఎలివేట్ చేశారా ?
జ) అలాంటిదేం లేదు. మేము చూపించే సీన్లన్నీ ఫన్నీగా, ఒక క్యారికేచర్ లాగా ఉంటాయి తప్ప ఎవరినీ వ్యక్తిగతంగా టచ్ చేసేవిగా ఉండవు.

ప్ర) సెన్సార్ వాళ్ళు ఏవో అభ్యంతరాలు చెప్పారని విన్నాం ?
జ) అవును..ముందుగా ATM నాట్ వర్కింగ్ అని టైటిల్ పెడితే అది మోదీ నిర్ణయాన్ని రిఫ్లెక్ట్ చేసేదిగా ఉంటుందని అభ్యంతరం చెప్పారు. అందుకే ATM వర్కింగ్ అని పేరు మార్చాం. అలాగే సినిమాలో అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళకి థ్యాంక్స్ కార్డు వేస్తే దాన్ని కూడా తొలగించారు. మొత్తం మీద సినిమాలో 3 నుండి 5 నిముషాల లెంగ్త్ కట్ చేశారు. ఇప్పుడు సినిమా డ్యూరేషన్ 100 నిముషాలు అయింది.

ప్ర) సినిమాని ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు ?
జ) డిజిక్వెస్ట్ తో క‌లిసి చేసిన ఈ సినిమాని బాపిరాజుగారు విడుద‌ల చేస్తున్నారు. మొత్తం మీద 50 స్క్రీన్ లలో సినిమా రిలీజవుతుంది.

ప్ర) ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు?
జ) ఈ సినిమాతోపాటు రిలీజయ్యే పెద్ద సినిమాల్ని పక్కనబెట్టి చిన్న సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా తప్పక అందరికీ ఎక్కువగానే నోటీస్ అవుతుంది. ఎందుకంటే ఒక బర్నింగ్ ఎలిమెంట్ తో తీసిన సినిమా కాబట్టి ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి ?
జ) నేను ‘గల్ఫ్’అనే సినిమా చేస్తున్నాను. ఇప్పటికే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఉగాదికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. ఈ సినిమా కోసం చాలా దేశాలు తిరిగాను. ఇతర ఏషియన్ కంట్రీస్ లో కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు