ఏఎన్నార్ మరణాన్ని ఎలా ఎదిరించారో వివరించిన రాజమౌళి !
Published on Sep 17, 2017 7:17 pm IST


‘బాహుబలి’ తో దేశవ్యాప్త కీర్తిని ఆర్జించిన దర్శకుడు రాజమౌళికి ఈరోజు అక్కినేని నేషనల్ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. అక్కినేని నాగార్జున సారథ్యంలో గౌరవనీయులు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు ముఖ్య అతిధులుగా హాజరవగా వేడుక వైభాగంగా జరిగింది. అవార్డును స్వీకరించిన అనంతరం రాజమౌళి కాస్త భావోద్వేగంగా, ఆసక్తికరంగా మాట్లాడారు. అక్కినేని నాగేశ్వరరావుగారు తన క్రమశిక్షణతో చావును ఎలా ఎదిరించారో వివరించారు.

‘1974లో ఏఎన్నార్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు డాక్టర్లు ఆపరేషన్ చేసి 14 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందీ ఉండదని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే ఆయనకు 14 ఏళ్ళు ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఆ తర్వాత 1988లో మరోసారి గుండెనొప్పి వచ్చింది. అప్పుడు డాక్టర్లు లాభంలేదని చెప్పగా నాగేశ్వరరావుగారు డాక్టర్ల సాయంతో 14 ఏళ్ళు బ్రతికాను, ఇప్పుడు నా మనోధైర్యంతో ఇంకో 14 ఏళ్ళు బ్రతుకుతాను అనుకున్నారట. అనుకున్నట్టే బ్రతికారు.

మళ్ళీ 2002లో ఇంకో 9 ఏళ్ళు బ్రతకాలని అనుకున్నారు. అనుకున్నట్టే బ్రతికారు. ఇక చివరికి 2011లో ఆయనకే ఆ ఆటతో బోర్ కొట్టి చావును ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు రా అని అన్నారు. అప్పుడే ఆయనకు మరణం సంభవించింది. అలా చావును అనుకున్నప్పుడే దగ్గరకు రానిచ్చిన వాళ్లలో భీష్మాచార్యులు ఒకరు, ఆ తర్వాత ఏఎన్నార్ ఒకరు. అంతటి గొప్ప వ్యక్తి పేరు మీదున్న ఈ అవార్డు నా భుజాల మీద చాలా బరువుగా ఉంది. ఈ అవార్డుకు నేను తగినవాడిని కాదని అనుకుంటున్నాను. అయినా నన్ను నమ్మి ఈ అవార్డును ఇచ్చినందుకు ఇంకా కష్టపడతాను’ అన్నారు.

 
Like us on Facebook