‘బాహుబలి’ రాజమౌళికి రిహార్సల్స్ లాంటిది !

‘బాహుబలి’ రాజమౌళికి రిహార్సల్స్ లాంటిది !

Published on Sep 12, 2017 4:08 PM IST


‘బాహుబలి’.. తెలుగు పరిశ్రమలో మాత్రమేకాక యావత్ దేశాన్ని ఒక ఊపు ఊపేసిన చిత్రం. ఈ చిత్రంతో టాలీవుడ్ గొప్పతనమేమిటో దేశానికి తెలిసొచ్చింది. ఇంత గొప్ప చిత్రాన్ని తీయడానికి దర్శకుడు రాజమౌళి ఎంతో శ్రమించారు. చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమానే జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ అని అనుకుంటుంటారు. కానీ కాదట. ఇది ఆయనకు ఒక రిహార్సల్స్ లాంటిదట. ఈ విషయాన్ని ఆయన తండ్రి, రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ గారు స్వయంగా తెలిపారు.

ఇంతకీ ఇంత పెద్ద రిహార్సల్స్ ఎందుకోసం అనుకుంటున్నారా.. ‘మహాభారతం’ కోసం. అవును రాజమౌళి తన కలల ప్రాజెక్ట్ ‘మహాభారతాన్ని’ ఎప్పటికైనా తీస్తానని గతంలోనే చెప్పారు. అంత గొప్ప మహాకావ్యాన్ని తెరపై ఆవిష్కరించడమంటే మాటలుకాదు. ఆ విషయం తెలిసిన రాజమౌళి ఆ సామర్థ్యం తనలో ఉందో లేదో తెలుసుకోవడానికే ‘బాహుబలి’ ని తీశారట. ‘బాహుబలి’ కథా చర్చలు జరుగుతున్న సమయంలో ఈ విషయాన్ని తండ్రితో చెప్పారట ఆయన.

ఈ ‘బాహుబలి’ రిహార్సల్స్ తో జక్కన్నకు మహాభారతాన్ని తీయగలనన్న నమ్మకం వచ్చిందో లేదో తెలీదు కానీ ప్రేక్షకులకు మాత్రం ఆయనలో ఆ సత్తా ఉందనే దృఢ విశ్వాసం ఏర్పడిపోయింది. అంతేగాక ‘మహాభారతం’ కేవలం ఒక సినిమాగా పూర్తయ్యేది కాదని కనీసం 5, 6 భాగాలు ఉంటే తప్ప ఆ కావ్యానికి న్యాయం జరగదని విజయేంద్రప్రసాద్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు