ఫీచర్ స్టోరీ : రావు రమేష్.. తెలుగు సినిమాకు ఓ కొత్త వరం!

ఫీచర్ స్టోరీ : రావు రమేష్.. తెలుగు సినిమాకు ఓ కొత్త వరం!

Published on Aug 7, 2016 5:15 PM IST

Rao-Ramesh1

వారం వారం సినిమాలు వస్తూంటాయి, పోతూంటాయి. అందులో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బలంగా నిలబడితే, ఇంకొన్ని ఎటూకాకుండా పోతాయి. ఇక ఎలాంటి సినిమా అయినా అది చూసి బయటకు రాగానే మనం ఆ సినిమాలో ఆకట్టుకున్న విషయాలేంటని చర్చించుకుంటూ ఉంటాం. ఒకసారి హీరో అనితర సాధ్యమైన నటననో, రచయిత తిరుగులేని పనితనాన్నో, దర్శకుడి మేకింగ్‌నో.. ఇలా దేన్నో ఒకదాని గురించి మాట్లాడుకుంటాం. అలాగే కొన్ని సందర్భాల్లో ఆ సినిమాలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టుల ప్రస్తావన కూడా వస్తూ ఉంటుంది. ఎస్.వీ.రంగారావు, గుమ్మడి మొదలుకొని తెలుగులో ఎందరో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు సినిమాల్లో తమ బలమైన ముద్రను చాటుకున్నారు. తాజాగా అలా తనదైన బ్రాండ్ సృష్టించుకున్న నటుల్లో ఒకరే రావు రమేష్.

ప్రఖ్యాత నటుడు రావు గోపాలరావు కుమారుడైనా కూడా రావు రమేష్‌కు ఇండస్ట్రీలో స్థానం అంత సులువుగా దక్కలేదు. మొదట్లో ఫోటోగ్రఫీపైన ఇష్టంతో అటువైపే వెళ్ళిన రమేష్, ఆ తర్వాత తల్లి సలహా మేరకు సినిమాల్లోకి వచ్చేశారు. ‘గమ్యం’ సినిమాతో పూర్తి స్థాయి నటుడిగా పరిచయమైన ఆయన, అంతకంటే ముందే గోపీచంద్-చంద్రశేఖర్ ఏలేటిల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఒక్కడున్నాడు’ సినిమాలో కనిపించారు. ఆ సినిమాలో తన తల్లికి బాంబే బ్లడ్ గ్రూప్ అవసరమంటూ తిరిగే పాత్రలో ఆయన నటించారు. ఇక గమ్యంలో ఓ నక్సలైట్‌గా కనిపించిన రమేష్, ‘కొత్త బంగారు లోకం’ అనే సినిమాతో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయారు. ఇప్పటి రావు రమేష్ స్టార్ స్టేటస్‌కు ఈ సినిమానే బీజంగా చెప్పుకోవాలి. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమాలో రావు రమేష్ డైలాగ్స్ ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో సాధారణ జనం కూడా వాడుతూ ఉంటారు.

తెలుగులో రావు రమేష్ ఎంట్రీ ఇచ్చే సమయానికి క్యారెక్టర్ ఆర్టిస్టుల అవసరం బాగా పెరగడం కూడా ఆయనకు కలిసివచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా త్రివిక్రమ్, శ్రీకాంత్ అడ్డాల, హరీష్ శంకర్ లాంటి దర్శకులు రావు రమేష్‌ను తమ సినిమాల్లో ఆస్థాన నటుడిగా మార్చేసుకున్నారు. రావు రమేష్ కోసం ఈ దర్శకులు రాసిన అద్భుతమైన పాత్రలన్నీ ఈతరం సినిమాల్లో గుర్తుంచుకోదగ్గ పాత్రలుగా నిలిచాయి.

ఒక్కసారి ఆ పాత్రలేవో చూసుకుంటే, ‘కొత్త బంగారు లోకం’లోని లెక్చరర్ పాత్ర, ‘మగధీర’లోని మాంత్రికుడి పాత్ర, ‘ఖలేజా’లో స్వామిజీ తరహాలో కనిపించే ఓ పాత్ర, ‘పిల్ల జమీందార్’ సినిమాలో కాలేజీ ప్రిన్సిపాల్ పాత్ర, ‘జులాయి’లోని పోలీసాఫీసర్ పాత్ర, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో ఓ ఎగువ మధ్య తరగతి తండ్రి పాత్ర, ‘అత్తారింటికి దారేది’లో హీరోయిన్ తండ్రి పాత్ర, ‘కార్తికేయ’లో విలన్ పాత్ర, ‘సినిమా చూపిస్త మావా’, ‘ముకుంద’, ఈమధ్యే వచ్చిన ‘బ్రహ్మోత్సవం’, ‘అ..ఆ..’ సినిమాల్లో తన స్థాయికి తగ్గ పాత్రలు.. ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం కొన్నేళ్ళ కెరీర్‌లోనే రావు రమేష్ చెరిగిపోని సినిమాల్లో అద్భుతమైన పాత్రల్లో నటించారని చెప్పుకోవచ్చు.

రావు రమేష్‌కి కేవలం దర్శకులు సృష్టించిన పాత్రల వల్లనే ఈ పేరు రాలేదన్నది సుస్పష్టం. ఆ పాత్రలను ఆకళింపు చేసుకొని, వాటికి తనదైన టచ్ ఇస్తూ, డైలాగుల్లో, నటనలో కొత్తదనం చూపిస్తూ రావు రమేష్ ఈ స్థాయిని పొందారు. ముఖ్యంగా ఆ డైలాగ్ డెలివరీని ఈతరం ప్రేక్షకులు కూడా రోజూవారీ మాటల్లో కాపీ కొడుతుంటారంటే అతిశయోక్తి కాదు. ఈ తరహాలో ప్రతి పాత్రలో తనదైన మార్క్ చూపెట్టుకోవడం వల్లనే రావు రమేష్, నేడు తెలుగు సినిమాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల పరంగా ఓ వరంగా నిలిచారు. ఇప్పటికీ పైన చెప్పుకున్న టాప్ దర్శకులతో పాటు, ఎంతోమంది తమ సినిమాల్లో రావు రమేష్ ఉండాలని, ఆయన ప్రెజెన్స్ సినిమాకు ఓ స్థాయిని తెచ్చిపెడుతుందని నమ్ముతూ వస్తున్నారు. ఈ నమ్మకాన్ని రావు రమేష్ కూడా నిలబెడుతూ ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ దూసుకుపోతున్నారు.

రావు రమేష్ చేసిన సినిమాల్లో కొన్ని చెరిగిపోని డైలాగ్స్‌ని ప్రాస్తావించుకుంటే, చాలానే ఉంటాయి. అందులో కొన్ని ఇక్కడ చూద్దాం..

‘కొత్త బంగారు లోకం’ సినిమాలో మనిషి జీవితం టీనేజ్‌లో, యంగ్ ఏజ్‌లో, ఆ తర్వాత ఎలా ఉంటుందో చూపుతూ ఆయనొక డైలాగ్ చెబుతారు. అందులో చివర్లో ‘ఎవడోస్తే వాడు.. ఎవర్తొస్తే అది..’ అన్న ఫినిషింగ్ టచ్ ఇప్పటికీ పాపులర్.

ఇక ‘ఖలేజా’ సినిమా ఎండ్‌కార్డ్స్ పడేప్పుడు.. “ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం” అన్న అద్భుతమైన త్రివిక్రమ్ రాసిన డైలాగ్‌ను రావు రమేష్ తన పాత్ర ద్వారా చెప్పిన తీరు మర్చిపోలేనిది.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో రావు రమేష్ పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఈ సినిమాలో ఆయన చేసిన పాత్ర గురించి మాట్లాడుకున్నంతగా యువత మరే సినిమా గురించీ మాట్లాడుకోలేదేమో. ఇందులో ‘వాడ్ని ఎవడికైన చూపించడ్రా!’, ‘దాన్నేమంటారూ.. యోగ్యత.. ఆయ్.. అది ఉండాలండీ..’, ‘సగం సగం పనులు చేయకండ్రా!’ ఇలా ఒక్కో డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో యువత రోజూ ఏదో సందర్భంలో వాడుతూనే ఉంటారు.

‘ముకుంద’, ‘సినిమా చూపిస్త మావా’, ‘గీతాంజలి’, ‘అత్తారింటికి దారేది’.. ఇలా ప్రతి సినిమాలోనూ రావు రమేష్ చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ వాడుకలోనే ఉన్నాయి. ఈమధ్యే విడుదలైన ‘అ..ఆ..’ సినిమా గురించైతే ఎంత చెప్పినా తక్కువే. అందులో ఓ కామెడీ విలన్ పాత్రలో రావు రమేష్ అదరగొట్టారు. ‘శత్రువులెక్కడో ఉండర్రా! ఇదిగో.. మన చుట్టూ ఇలా కూతుర్లుగా, చెల్లెల్లుగా తిరుగుతూ ఉంటారు’ లాంటి డైలాగ్స్ ‘అ..ఆ..’లో కోకొల్లలుగా వినిపిస్తాయి. ‘అ..ఆ..’ సినిమా రావు రమేష్ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిందనే చెప్పొచ్చు. ఇక ఇప్పుడు తన స్థాయికి తగ్గ పాత్రలనే ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళుతోన్న రావు రమేష్, భవిష్యత్‌లో ఇలాంటి మరెన్నో సినిమాల్లో నటించాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు