ఇంటర్వ్యూ : రవిబాబు – ‘అవును 2’.. రెండో భాగమే కానీ సీక్వెల్ కాదు!

ఇంటర్వ్యూ : రవిబాబు – ‘అవును 2’.. రెండో భాగమే కానీ సీక్వెల్ కాదు!

Published on Mar 31, 2015 5:57 PM IST

Ravi-Babu

విలక్షణమైన, విభిన్నమైన అంశాలనే కథా వస్తువుగా ఎంచుకొని ప్రతిసారీ కొత్తదనమున్న కథలనే తెరకెక్కించే దర్శకుడు రవిబాబు. ‘అల్లరి’ సినిమా మొదలుకొని ఇప్పటివరకూ ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమాలన్నీ ఆ కోవలేనివే! పూర్ణ, హర్షవర్ధన్‌ రానేలు నటించగా రవిబాబు దర్శకత్వంలో రూపొంది 2012లో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ‘అవును’. అవును సినిమాకు రెండో భాగంగా రూపొందిన తాజా చిత్రమే.. ‘అవును 2’. ఏప్రిల్ 3న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర దర్శకుడు రవిబాబుతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘అవును’ సినిమాకి, ‘అవును 2’కి లింక్ ఎలా ఉండబోతోంది ?

స ) ‘అవును 2’ సినిమా అవునుకు సీక్వెల్ కాదు. దీన్ని రెండో భాగంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా సీక్వెల్స్ అంటే అందులోని పాత్రలు, థీమ్ మాత్రమే తీసుకొని కొత్త కథలు అల్లుతారు. అయితే ‘అవును 2’ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఎక్కడైతే మొదటి భాగం పూర్తైందో.. సరిగ్గా అదే షాట్‍ నుండి రెండో భాగం మొదలవుతుంది. అందుకే.. ఇది అవునుకి రెండో భాగమే కానీ సీక్వెల్ కాదు.

ప్రశ్న) ‘అవును’ రెండో భాగం ఎందుకు తీయాలనిపించింది ?

కథలో ఆసక్తి మిగిలే ఉన్నపుడు ఎన్ని భాగాలైనా రూపొందించవచ్చు. అవును సినిమాలో ఆ ఎలిమెంట్ ఉంది కాబట్టే రెండో భాగాన్ని రూపొందించా. మొదటి భాగం హిట్ అయింది కాబట్టి ఇప్పుడు రెండో భాగం వచ్చింది. ఇదీ హిట్ అయ్యి ఇంకా చెప్పాల్సింది మిగిలే ఉంటే మూడో భాగం కూడా వస్తుందేమో! (నవ్వుతూ..)

ప్రశ్న) ‘అవును 2’ లో కొత్త పాత్రలు ఉన్నాయా?

‘అవును’ సినిమాలోని పాత్రలతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు ఈ సినిమాలో ఉన్నాయి. కథావసరాల మేరకే తప్ప అనవసర క్యాస్టింగ్ లేదు. కొత్తగా నిఖిత, సంజన, టీవీ ఆర్టిస్ట్ రవి వర్మ లాంటి నటులు ఈ సినిమాలో కనిపిస్తారు.

ప్రశ్న) ‘అవును 2’ ప్రత్యేకత ఏంటి?

‘అవును’లో ఏదైతే సస్పెన్స్ ఎలిమెంట్ ఉందో అది క్లైమాక్స్‌లో కానీ తెలియదు. ఇప్పుడీ సినిమా విషయానికి వచ్చేసరికి మొదటినుంచే ఆ విషయం తెలిసి ఉండడం వల్ల చాలెంజింగ్‌గా ‘అవును 2’ని రూపొందించాం. ‘అవును’ ఫీల్‌ను ఏమాత్రం కోల్పోనివ్వకుండా ఈ సినిమాను రూపొందించాం.

ప్రశ్న) నటీనటుల యాక్టింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?

హార్రర్ సినిమాలో ప్రధానమైనది నటీనటుల పనితీరు. నేనీ సినిమాకు చేసిన మేజర్ ప్లస్ ఏదైనా ఉందంటే అది సరైన నటులను ఎంపిక చేయడమే. పూర్ణ, హర్షవర్ధన్ రానేలతో పాటు మిగతా నటీనటులంతా చాలా బాగా చేశారు. వారి కష్టాన్ని మీరు తెరపై చూడొచ్చు. ముఖ్యంగా పూర్ణ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే!

ప్రశ్న) సినిమాకి సంబంధించిన టెక్నికల్ విషయాల గురించి చెప్పండి ?

నా సినిమాలు టెక్నికల్‌గా ఎప్పుడూ అడ్వాన్స్‌డ్‌గా ఉండాలనుకుంటా. ఈ సినిమాలోనూ లైటింగ్ సిస్టమ్ పనితనాన్ని మీరు కొత్తగా ఆస్వాదిస్తారు. పూర్తి ఎల్‌ఈడీ లైట్లతో లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. ఎక్కడా కేబుల్ అనేదే లేకుండా సినిమాకి లైటింగ్ సమకూర్చాం. ఇక ఈ సినిమాలో 55నిమిషాల పాటు గ్రాఫిక్స్ సన్నివేశాలు ఉన్నా సినిమాలో వాటిని గుర్తించలేనంత క్వాలిటీతో ఆ సన్నివేశాలను తీశాం. ఇక ఇదే సినిమాకు ఒక ప్రయోగం కూడా చేశాం. స్క్రిప్ట్ కోసం ఎక్కడా పేపర్ వాడలేదు. మొత్తం స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే డిజిటల్ డాక్యుమెంట్ వాడుతూ పేపర్ అనేదే వాడకుండా సినిమా తీశాం.

ప్రశ్న) సినిమాకి బడ్జెట్ ఏమైనా పెరిగిందా ?

లేదు. అంతా ప్రీ ప్రొడక్షన్ దశలోనే పక్కాగా ప్లాన్ చేసుకోవడంతో అనవసర ఖర్చు ఎక్కడా చేయలేదు. సినిమాకి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన సురేష్ బాబు ప్లానింగ్ కూడా ఇందుకు పనికొచ్చింది.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల విశేషాలేంటీ ?

ఈ సినిమా తర్వాత ఒక యాక్షన్ సినిమా చేయాలని అనుకుంటున్నా. పెద్ద హీరోలతో సినిమా చేయలనే ఆలోచన ఇప్పటికైతే రాలేదు. నా తర్వాతి సినిమా కూడా నా స్టైల్లోనే ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు మంచి పాత్రల ద్వారా నటుడిగానూ కొనసాగుతూనే ఉంటా.

ఇక ఇక్కడితో దర్శకుడు రవిబాబుతో మా ఇంటర్వ్యూ ముగిసింది. ఈ శుక్రవారం ‘అవును 2’ విడుదల కానున్న సందర్భంగా, సినిమా యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు