మహేష్ నిర్మాతగా ఎందుకు మారాడంటే..?

మహేష్ నిర్మాతగా ఎందుకు మారాడంటే..?

Published on Jul 30, 2015 7:50 PM IST

mahesh-babu
మహేష్ అభిమానులే కాక, సాధారణ సినీ ప్రియులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘శ్రీమంతుడు’ మరో వారం రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే! ఈ సినిమాకు మహేష్ బాబు సహ నిర్మాతగానూ వ్యవహరించడం పోస్టర్ రిలీజ్ అప్పట్నుంచీ ఆసక్తికరంగా కనిపిస్తూ వచ్చిన అంశం. ‘జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో మహేష్ ఓ ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టారు. ఈ బ్యానర్‌పై మొదటి సినిమాగా మహేష్ ‘శ్రీమంతుడు’ను మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మించారు.

ఇక నిర్మాతగా తన ప్రయాణం గురించి ఓ పత్రికతో మాట్లాడుతూ.. సినిమా క్వాలిటీ కోసమే ప్రొడక్షన్‌లోకి దిగానని మహేష్ తెలిపారు. “సినిమా అనేది క్రియేటివ్ వరల్డ్. సినిమా నిర్మాణ సమయంలో క్వాలిటీ విషయంలో రాజీ పడే అవకాశం లేకుండా, నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా ఉంటుందన్న నేపథ్యంలో నేనూ నిర్మాతగా మారా. సినిమా స్కేల్ విషయంలో ఎక్కడా రాజీపడకూడదన్న మేజర్ అజెండాతోనే నిర్మాతనయ్యా” అంటూ మహేష్ స్పష్టం చేశారు. తన తరువాతి సినిమా ‘బ్రహ్మోత్సవం’కు కూడా మహేష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే!

ఇక మహేష్ ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుతూ.. ‘శ్రీమంతుడు’ దర్శకుడు కొరటాల శివ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. మొదట్లో మహేష్ ప్రొడక్షన్ హౌస్ లోగోను భారీ ఎత్తున విడుదల చేయాలని ప్లాన్ చేశారట. అయితే మహేష్ అలాంటివేమీ వద్దని చెప్పడంతో టీజర్‌తో పాటే లోగోనూ విడుదల చేసేశామని శివ తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో ఆగష్టు 7న భారీ ఎత్తున విడుదల కానున్న ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా శృతి హాసన్ నటించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియో ఇప్పటికే బాగా పాపులర్ అయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు