ఆ గ్యాంగ్ స్టర్ కథను వర్మ మూడు భాగాలుగా తీస్తాడట !
Published on Aug 23, 2016 11:44 am IST

rgv
వాస్తవ కథలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మ చేయి తిరిగిన దర్శకుడని చెప్పొచ్చు. ‘రక్త చరిత్ర, వీరప్పన్, 26/11’ వంటి చిత్రాలను తీసి సంచలనం సృష్టించిన ఈ దర్శకుడు త్వరలో మరో వాస్తవ జీవిత కథను సినిమాగా తీస్తాడట. అదే ఈ మధ్య దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తెలంగాణా గ్యాంగ్ స్టర్ ‘నయీముద్దీన్’ కథ. కొద్ది రోజుల క్రితమే నయీముద్దీన్ ను తెలంగాణా గ్రేహౌండ్స్ పోలీసులు ఎంకౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.

వర్మ దీని గురించి ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ ‘ఇప్పుడిప్పుడే నయీమ్ గురించిన విషయాలను తెలుసుకుంటున్నాను. అతను నక్సలైట్ నుండి పోలీస్ ఇన్ ఫార్మర్ గా, ఆ తరువాత గ్యాంగ్ స్టర్ గా మారిన తీరు చాలా భయంకరంగా ఉంది. అతని జీవితాన్ని ఒక్క సినిమాగా తీయడం కష్టం. అందుకే 3 భాగాలుగా తీయాలనుకుంటున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి’ అంటూ ట్వీట్లు పెట్టారు. దీంతో సినీ జనాల్లో వర్మ ఈసారి ఎలాంటి సంచలనం తీస్తాడు అన్న ఆసక్తి మొదలైంది.

 

Like us on Facebook