ఇంటర్వ్యూ : ఆస్కార్ రవిచంద్రన్ – శంకర్ – విక్రమ్ ల ‘ఐ’ బడ్జెట్ 180 కోట్లు.!

ఇంటర్వ్యూ : ఆస్కార్ రవిచంద్రన్ – శంకర్ – విక్రమ్ ల ‘ఐ’ బడ్జెట్ 180 కోట్లు.!

Published on Aug 25, 2014 5:20 PM IST

oscar-v-ravichan
శంకర్… ‘రోబో’తో భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన దర్శకుడు. ప్రస్తుతం విక్రమ్ హీరోగా ‘మనోహరుడు'(తమిళంలో ‘ఐ’)ను రూపొందిస్తున్నారు. విక్రమ్ సరసన బ్రిటీష్ మోడల్ అమీ జాక్సన్ నటిస్తున్న ఈ సినిమాను ఆస్కార్ ఫిల్మ్స్ బ్యానర్ పై రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. చెన్నైలో ఆదివారం మీడియా ప్రతినిధుల కోసం ట్రైలర్, ప్రోమోస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమాకు సంబందించిన ఆసక్తికరమైన విశేషాలను నిర్మాత వెల్లడించారు. ఎన్నో భారి చిత్రాలను నిర్మించిన ఆస్కార్ రవిచంద్రన్ ఒక సినిమా గురించి మీడియాతో విశేషాలను పంచుకోవడం ఇదే మొదటిసారి. ఆ విశేషాలు ఆయన మాటల్లో…

కథ వినలేదు, 180 కోట్లు ఖర్చు పెట్టారు.

సౌత్ ఇండియన్ మూవీ హిస్టరీలో భారి బడ్జెట్ సినిమా ‘ఐ’. అలాగే నిర్మాత రవిచంద్రన్ కెరీర్లో కూడా. ఇప్పటి వరకు ‘ఐ’ నిర్మాణం కోసం 180 కోట్లు ఖర్చుపెట్టారు. శంకర్ ఈ సినిమా ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు శంకర్ పై నమ్మకంతో కథ వినకుండా రవిచంద్రన్ ఓకే చెప్పారట.

భయంకరంగా విక్రమ్ గెటప్…

సినిమా కోసం విక్రమ్ చాలా కష్టపడ్డారు. 70 కిలోల బరువుండే విక్రమ్ ఒక గెటప్ కోసం 130 కిలోలు పెరిగారు. భయంకరంగా కనిపిస్తారు. మేకప్ కోసం 12 గంటలు పట్టేది. ఒక రకమైన యాసిడ్ ను మేకప్ లో వినియోగించడం వలన విక్రమ్ పూర్తి ఏ.సి.లోనే(చల్లటి ప్రదేశంలో) ఉండాల్సి వచ్చేది. అందువల్ల చాలా జాగ్రత్తలు తీసుకొన్నాం. అయినా ఒకసారి యాసిడ్ వలన విక్రమ్ చర్మం కాస్త కాలింది.

చైనాలో సైకిల్ ఫైట్, ఇండియాలో సాంగ్…

మొత్తం ‘మనోహరుడు’ సినిమా చిత్రీకరణ కోసం 2 ఏళ్ళ 8 నెలలు పట్టింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చైనాలో షూట్ చేసిన ఫైట్, ఇండియాలో మూడెకరాల సెట్లో షూట్ చేసిన సాంగ్ సినిమాకి హైలైట్. మరో నాలుగు ఫైట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి షూట్ చేయడానికి 40 రోజులు పట్టింది. సన్నివేశాలు అనుకున్న విధంగా రావడం కోసం శంకర్ ఎన్ని రోజులు చిత్రికరిస్తున్నాం, ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలను పట్టించుకోలేదు.

శంకర్ – ఇండియన్ జేమ్స్ కామెరూన్..

తెరపై ‘మనోహరుడు’ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు థ్రిల్‌కు గురి అవుతారు. ఇదొక అద్బుతమైన సినిమా. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఈ సినిమా ఒక మైలురాయిలా నిలుస్తుంది. శంకర్ అంత అద్బుతంగా సినిమాను మలిచారు. ఇలాంటి సినిమా చేయడం శంకర్ కు మాత్రమె సాధ్యం.

సెప్టెంబర్ 15న ఆడియో.. ముఖ్య అతిధిగా జాకీ చాన్

ఎఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘ఐ’ ఆడియోను సెప్టెంబర్ 15న భారి ఎత్తున నిర్వహించడానికి సన్నహాలు చేస్తున్నాం. ఈ సినిమాలో రెహమాన్ ఒక పాట పాడారు. ఆడియో విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాలీవుడ్ సూపర్ స్టార్ జాకీ చాన్, ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్‌లను ఆహ్వానిస్తున్నాం. మరొకొన్ని రోజులలో ఆడియో వేదిక తదితర వివరాలను వెల్లడిస్తాం.

ప్రపంచవ్యాప్తంగా 20 వేల థియేటర్లలో విడుదల..

మనోహరుడు(ఐ) సినిమాను ప్రపంచవ్యాప్తంగా 20 వేల థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో ఒక్క చైనాలోనే 15 వేల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఒక సౌత్ ఇండియన్ మూవీ చైనాలో ఇంత భారి ఎత్తున విడుదల కావడం ఇదే తొలిసారి. తమిళంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, మలయాళం, చైనీస్ లతో పాటు పలు భాషలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు.

‘మనోహరుడు’ ముందు… ‘మనోహరుడు’ తర్వాత..

దీపావళి కానుకగా ‘మనోహరుడు’ను అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. సినిమాను చూసిన తర్వాత ‘మనోహరుడు’కు ముందు… ‘మనోహరుడు’ సినిమా తర్వాత అని చెప్పుకుంటారు. సినిమా అంత అద్బుతంగా వచ్చింది. గతంలో విక్రమ్, శంకర్, నా కాంబినేషన్లో వచ్చిన ‘అపరిచితుడు’ సినిమా కంటే మనోహరుడు 100 రెట్లు గొప్పగా ఉంటుంది. అని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు