‘సైజ్ జీరో’.. తెలుగు ‘యూ/ఏ’. తమిళ్ ‘యూ’!

‘సైజ్ జీరో’.. తెలుగు ‘యూ/ఏ’. తమిళ్ ‘యూ’!

Published on Nov 24, 2015 4:39 PM IST

size-zero
‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ లాంటి రెండు ప్రతిష్టాత్మక సినిమాల తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ప్రయోగాత్మక సినిమా ‘సైజ్ జీరో’ మరో మూడు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఇక ఇప్పటికే పోస్టర్స్, ట్రైలర్, ఆడియోతో ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా కోసం సైజ్ జీరో టీమ్ చేపట్టిన కార్యక్రమాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇక ఈమధ్యే తెలుగు వర్షన్‌కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఈ ఉదయం తమిళ వర్షన్ (ఇంజి ఇడుప్పగాజి) సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. తెలుగు వర్షన్‌కు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ రాగా, తమిళంలో మాత్రం సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు క్లీన్ క్లీన్ ‘యూ’ ఇవ్వడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. గతంలో ఇదే విషయమై తెలుగు, తమిళ సినిమాల సెన్సార్ రేటింగ్‌లో ఉన్న తేడా వల్ల పలు తెలుగు సినిమాలకు, డబ్బింగ్ వర్షన్‌తో ఇక్కడ విడుదలయ్యే కొన్ని సినిమాలతో తీవ్ర నష్టం జరిగిందని పలువురు తెలుగు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా హర్రర్ సినిమాల విషయంలో తెలుగు, తమిళ సెన్సార్ రేటింగ్స్‌లో తేడా ఇబ్బందిగా తయారైందని అభిప్రాయం వ్యక్తమైంది. ఇక ఇదిలా ఉంటే ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘సైజ్ జీరో’ సినిమాకు రెండు వర్షన్స్‌లో సెన్సార్ రేటింగ్స్‌లో తేడా ఉండడం విశేషం. ఆర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం సమకూర్చగా, పీవీపీ సినిమా ఈ సినిమాను నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు