అహర్నిశలూ శ్రమించిన ‘అతిలోక సుందరి’ శ్రీదేవి !

అహర్నిశలూ శ్రమించిన ‘అతిలోక సుందరి’ శ్రీదేవి !

Published on Feb 26, 2018 1:28 PM IST

శ్రీదేవి అంటే ఆకర్షించే అందం, అబ్బురపరిచే అభినయం. కొన్ని దశాబ్దాల పాటు భారతీయ సినీ ప్రేమికుల్ని నటనతో రంజింపజేసిన అతిలోక సుందరి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రంలో ‘మానవా.. మాది అమరావతి. నా పేరు ఇంద్రజ. నా జనకుడు స్వర్గాధిపతి ఇంద్రుడు’ అంటూ ఆమె పలికిన మాటలు విని ప్రేక్షకలోకమంత నిజంగా ఈమె దేవకన్యే అని నమ్మేశారు. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమల్లో అగ్ర హీరోలతో సమానంగా స్టార్ డమ్ శ్రీదేవి సంపాదించుకుంది. బయటి జనానికి అంతటి స్టార్ డమ్ అనుభవిస్తున్న శ్రీదేవి ఎంతటి అదృష్టవంతురాలో అనే భావన ఉన్నా ఆ అదృష్టం వెనుక అహర్నిశలూ కష్టపడినా ఆమె శ్రమ ఉంది.

1963 ఆగష్టు 13న శివకాశీలో జన్మించిన ఈమె నాలుగేళ్ల వయసులోనే బాలనటిగా చిత్ర సీమలోకి అడుగుపెట్టారు. ఇక అప్పటి నుండి వివాహమై పిల్లలు కలిగే వరకు నటిస్తూనే ఉన్నారామె. ‘మా నాన్న నిర్దోషి’ చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి బాలనటిగా ప్రవేశించిన ఆమె 13 ఏళ్ల వయసులోనే బాలచందర్ నటించిన ‘మూండ్రు ముడిచ్చు’ చిత్రంతో కథానాయకిగా అవతరించారు. ఆ తరవాత తెలుగులో 15 ఏళ్ల చిరు ప్రాయంలోనే 16 ఏళ్ల వయసులో బరువైన కథానాయిక పాత్రను భుజానికెత్తుకొని తిరుగులేని హీరోయిన్ గా అవతరించారు.

అలా పిన్న వయసులోనే కథానాయకిగా మారిన ఆమె ఎన్టీఆర్, ఎంజీఆర్, ఏఎన్నార్ దగ్గర్నుంచి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి రెండో తరం హీరోలతో సైతం అలవోకగా నటించేశారు. ఇలా ఏ హీరో పక్కన నిలబడితే అతనికి జోడీగా కుదిరిపోవడం ఆమె ప్రత్యేకత. ఈ ప్రత్యేకత కూడ ఆమెకు ఊరికే రాలేదు. నటించే హీరోకి తగ్గట్టు తన బాడీ లాంగ్వేజ్ ను, పాత్రకు ప్రాణం పోసేలా తన నటన శైలిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చారామె. ఒకానొక దశలో ఒకరోజు ఒక హీరోతో ఒక భాషలో ఓకే రకమైన పాత్రలో నటిస్తే మరుసటి రోజు ఇంకో హీరోతో ఇంకో భాషలో ఇంకో ప్రతేయకమైన పాత్రలో నటించాల్సి వచ్చేది. అలాంటి క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవడం ఎంతటి గొప్ప నటులకైనా కష్టమే. ఇలాంటి కష్టానన్నే శ్రీదేవి కొన్నేళ్ళపాటు అనుభవించారు. ఆ కష్టంలోనే ఆనందాన్ని వెతుకున్నారు.

తమిళం, తెలుగు, మలయాళం,కన్నడ, హిందీ భాషల్లో సుమారు 300పైగా చిత్రాల్లో నటించిన ఆమె ఖాతలో ఎన్టీఆర్ తో చేసిన ‘వేటగాడు, కొండవీటి సింహం, బొబ్బిలి పులి’ ఏఎన్నార్ తో ‘ప్రేమాభిషేకం, ముద్దుల కొడుకు, ప్రేమ కానుక’, శోభన్ బాబుతో ‘కార్తీక దీపం, దేవత’, చిరంజీవితో చేసిన ‘జగదేవక వీరుడు అతిలోక సుందరి’, కృష్ణతో చేసిన ‘కిరాయి కోటిగాడు, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లోడు, కలవారి సంసారం’ వంటి హిట్ సినిమాలు చేశారామె.

ఒకవైపు తెలుగుతో అగ్రతారగా వెలుగొందుతూనే తమిళ, హిందీ భాషల్లో కూడ అగ్ర హీరోలందరినీ చుట్టేసి సాటిలేని మేటి కథానాయకిగా యావత్ దేశాన్ని ఉర్రూతలూగించి చివరికి అందరినీ శోక సంద్రంలో ముంచి 55 ఏళ్ల వయసు కూడ నిండకుండానే స్వర్గ తీరాలు చేరుకుంది. స్క్రీన్ మీద ఈమెను చూసే ఎందరో హీరోయిన్లు అవ్వాలనే కోరికతో ఇండస్ట్రీల గడపలు తొక్కితే ఆమె ప్రయాణాన్ని, అంకిత భావాన్ని స్ఫూర్తిగా చేసుకుని ఇంకెందరో అగ్ర హీరోయిన్లుగా ఎదిగారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు