ఎదురుచూపులకు తెరదించేసిన నాగ చైతన్య!

ఎదురుచూపులకు తెరదించేసిన నాగ చైతన్య!

Published on Oct 26, 2016 9:34 PM IST

sss
దసరా కానుకగా ‘ప్రేమమ్’ సినిమాతో వచ్చి హిట్ కొట్టేసిన నాగ చైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ అన్న సినిమా కూడా ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ వర్షన్ కాస్త ఆలస్యమవుతూ రావడంతో తెలుగు వర్షన్ కూడా విడుదలకు నోచుకోకుండా వచ్చింది. ఇక ఇప్పుడు తమిళ వర్షన్ కూడా అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకోవడంతో గౌతమ్ మీనన్ ఈ సినిమాను నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఎప్పుడో టీజర్, ట్రైలర్ విడుదలవ్వడంతో సినిమాను ప్రేక్షకుల్లోకి మరోసారి కొత్తగా తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో తమిళ వర్షన్‌కు సంబంధించిన ఓ కొత్త ట్రైలర్‌ను ఈమధ్యే విడుదల చేశారు. ఇక అప్పుడు తెలుగు వర్షన్ ట్రైలర్ కూడా విడుదల అవుతుందనుకున్నా కొన్ని అనుకోని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఇక తాజాగా ఈ ట్రైలర్ పనులన్నింటినీ పూర్తి చేసిన టీమ్ రేపు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించేసింది. దీంతో సాహసం శ్వాసగా సాగిపో కోసం ఎదురుచూస్తోన్న అభిమానులకు రేపటి ట్రైలర్ కొత్త ఉత్సాహాన్నిస్తుందని చెప్పుకోవచ్చు.

ఏ మాయ చేశావే లాంటి క్లాసిక్ హిట్ తర్వాత చైతూ, గౌతమ్ మీనన్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో సాహసం శ్వాసగా సాగిపోపై మొదట్నుంచీ మంచి అంచనాలున్నాయి. ఏ.ఆర్.రెహమాన్ అందించిన ఆడియో ఇప్పటికే సూపర్ హిట్ అయింది. ప్రేమమ్‌తో హిట్ కొట్టిన చైతూ, ఈ సినిమాతో అది కొనసాగిస్తారా లేదా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు