సీడెడ్‌లో భారీ ధర పలికిన బాలయ్య సినిమా!

Gautamiputra-Satakarni
నందమూరి నటసింహం బాలయ్య హీరోగా నటిస్తోన్న వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళకముందు నుంచే బిజినెస్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు ఇప్పట్నుంచే ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద ఎత్తున జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సీడెడ్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడైనట్లు సమాచారం.

ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సీడెడ్ హక్కులను సుమారు 9 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చారిత్రక నేపథ్యంలో సాగే శాతకర్ణి జీవిత కథతో రూపొందుతోన్న ఈ సినిమాను, క్రిష్, భారీ బడ్జెట్‌తో స్వయంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2017న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Bookmark and Share