సూర్య ’24’ ఫస్ట్‌లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్!

సూర్య ’24’ ఫస్ట్‌లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్!

Published on Nov 24, 2015 2:27 PM IST

24
తమిళ సూపర్ స్టార్ సూర్య హీరోగా రూపొందుతోన్న ’24’ సినిమా గత కొద్దికాలంగా సగటు సినీ అభిమానిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ’13 బీ’, ‘ఇష్క్’, ‘మనం’ లాంటి విలక్షణ సినిమాలతో మెప్పించిన దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడం, ఓ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన వినూత్న సినిమా కావడంతో ’24’ సినిమాకు తెలుగు, తమిళంలో అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు ఇప్పటికే బిజినెస్ కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ కానీ, స్టిల్స్ కానీ ఇప్పటివరకూ విడుదల కాకపోవడంతో ’24’ విషయంలో అభిమానులను సస్పెన్స్ వెంటాడింది.

కాగా తాజాగా నిన్నటి అర్థరాత్రితో ఈ సస్పెన్స్‌కు తెరపడింది. సూర్య 24 సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్ విడుదలై ఆయన అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తేలా చేసింది. రెండు పోస్టర్స్ విడుదల చేయగా సూర్య ఒక పోస్టర్‌లో గన్ పట్టుకొని స్టైలిష్ హెయిర్‌స్టైల్‌లో కనిపిస్తుండగా, చిత్ర కథాంశాన్ని ప్రతిబింబిస్తూ సైన్స్ అంశాలకు సంబంధించిన క్యాప్‌ ధరించి అదిరిపోయే మరో లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ రెండు పోస్టర్స్‌లోనూ బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యాథ్స్, సైన్స్ ఫార్ములాలతో పాటు, సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమా రూపొందుతోందనే విషయాన్ని చెప్పేలా డిజైన్ చేసిన పోస్టర్స్ అదిరిపోయాయనే చెప్పాలి.

ఈ పోస్టర్స్‌కు సూర్య అభిమానుల నుంచే కాకుండా నెటిజన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిన్న అర్థరాత్రి నుంచి ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తూ వచ్చాయి. సూర్య సరసన సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను తెలుగులో ప్రముఖ హీరో నితిన్ విడుదల చేయనున్నారు. సమ్మర్ కానుకగా పెద్ద ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాను సూర్య తన సొంత సంస్థ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు