సూర్య కొత్త సినిమా మళ్ళీ వాయిదా!

సూర్య కొత్త సినిమా మళ్ళీ వాయిదా!

Published on Nov 27, 2015 8:00 AM IST

memu

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న హీరో సూర్య తన సొంత బ్యానర్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ బ్యానర్‌లో రూపొందిన ‘మాస్’ సినిమా కొద్ది నెలల క్రితం విడుదలై సూర్యకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత సూర్య తాజాగా నిర్మించిన ‘పసంగ 2’ అనే సినిమా తమిళనాట మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక సూర్యకు తెలుగులోనూ ఉన్న మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాను ‘మేము’ పేరుతో తెలుగులోనూ తీసుకువస్తున్నారు.

జాతీయ అవార్డు గ్రహీత పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను డిసెంబర్ 4న పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు సూర్య టీమ్ సన్నాహాలు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 4వ తేదీ నుండి డిసెంబర్ 24కు వాయిదా వేశారు. నవంబర్ నెలలోనే రావాల్సిన సినిమా ఒకసారి వాయిదా పడి ఇప్పుడు మరోసారి వాయిదా పడడం ఆసక్తికరంగా మారింది. సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్‌మస్, కొత్త సంవత్సరం సీజన్‌ను దృష్టిలో పెట్టుకొనే డిసెంబర్ నెలాఖరుకు వెళ్ళినట్లు తెలుస్తోంది.

సూర్య, అమలాపాల్, బింధు మాధవి పలువురు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా మానసిక వ్యాధితో బాధపడే చిన్నారుల చుట్టూ తిరుగుతుంది. పలువురు బాల నటులు మెయిన్ లీడ్స్‌లో నటించిన ఈ సినిమాలో సూర్య పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాను జూలకంటి మధుసూదన్ రెడ్డి విడుదల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు