‘గంగ’తో భయపెట్టనున్న తాప్సీ!

‘గంగ’తో భయపెట్టనున్న తాప్సీ!

Published on Apr 21, 2015 11:59 AM IST

ganga-muni
తన అందం, నటనతో తెలుగులో వరుస సినిమాలతో ఆకట్టుకున్న తాప్సీకి అటు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ మంచి అవకాశాలు వచ్చిపడ్డాయి. అయితే తనకు ఇంత క్రేజ్ తెచ్చిపెట్టిన తెలుగు సినిమాల్లో తాప్సీ కనిపించక దాదాపుగా రెండేళ్ళయింది. ఆమె చేసిన చివరి తెలుగు సినిమా 2013లో విడుదలైన ‘సాహసం’ కాగా, అదే సంవత్సరంలో ‘ఆరంభం’ అనే డబ్బింగ్ సినిమాలో మెరిసింది. ఆ తర్వాత తెలుగు సినిమాలో తాప్సీ కనిపించలేదు.

ఇక తాజాగా తాప్సీ నటించిన తమిళ సినిమా ‘కాంచన 2’, తెలుగులో ‘గంగ’ పేరుతో ఈ వారమే విడుదల కానుంది. నిజానికి ఈ సినిమా గత వారమే విడుదల కావాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అయితే తమిళంలో మాత్రం ఈ సినిమా అనుకున్న విధంగానే ఏప్రిల్ 17న విడుదలై మంచి రివ్యూలను సంపాదించింది. ఈ సినిమాలో లారెన్స్ నటనతో పాటు తాప్సీ, నిత్యామీనన్‌ల నటన కూడా బిగ్గెస్ట్ ప్లస్‌పాయింట్స్ అని తెలుస్తోంది. తాప్సీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. మొదటిసారిగా ఓ భయపెట్టే తరహా పాత్రను చేసిన తాప్సీ, అన్ని విధాలా ఆకట్టుకుంది.

హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగంతో వచ్చిన ‘ముని’, ‘కాంచన’ సిరీస్‌లో మూడో సినిమాగా ‘గంగ’ తెరకెక్కింది. రాఘవ లారెన్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ విడుదల చేస్తున్నారు. రెండేళ్ళుగా ఏ తెలుగు సినిమాలోనూ కనిపించని తాప్సీ, మళ్ళీ గంగ సినిమా ద్వారా ఆ లోటును భర్తీ చేయాలని భావిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు