‘టెంపర్’ ఆడియో ఆవిష్కరణ విశేషాలు

‘టెంపర్’ ఆడియో ఆవిష్కరణ విశేషాలు

Published on Jan 28, 2015 11:02 PM IST

Temper2
ప్రతి సినిమా కష్టపడి చేశాను, ఈ సినిమా కసితో చేశాను. ఆ కసికి కారణం మీరు, మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చకపోయినా పర్వాలేదు, నందమూరి అభిమానులు కలర్ ఎగరేసుకుని తెరిగేవరకు సినిమాలు చేస్తూనే ఉంటాను. అని అన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ హీరో నటించిన తాజా సినిమా ‘టెంపర్’. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం రాత్రి శిల్పకళా వేదికలో అభిమానుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ పైవిధంగా స్పందించారు. ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘టెంపర్’. పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ కార్యక్రమంలో నందమూరి సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఆదిత్య మ్యూజిక్ ద్వారా ‘టెంపర్’ ఆడియో మార్కెట్ లోకి విడుదలైంది.

ముఖ్య అతిధిగా హాజరయిన తొలి సిడిని నరేంద్ర చౌదరి, వివి వినాయక్ సంయుక్తంగా ఆవిష్కరించి నందమూరి కళ్యాణ్ రామ్ కు అందజేశారు. అనూప్ రూబెన్స్ లైవ్ పెర్ఫార్మన్స్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమానికి పూరి జగన్నాధ్, శ్యాం ప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, సుకుమార్‌, కాజల్ అగర్వాల్, డి.సురేష్‌ బాబు, అనూప్ రూబెన్స్, ఛార్మి, జెమినీ కిరణ్, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, వక్కంతం వంశీ, పివిపి, భాస్కర భట్ల తదితరులు హాజరయ్యారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ… అభిమాన సోదరులు అందరికి నమస్కారాలు. ఈమధ్య ఎం మాట్లాడాలో క్లారిటీ ఉండడం లేదు. ప్రతిసారి ఆడియో వేడుకలలో సినిమా బాగుంది అని చెప్తున్నాం. కానీ, గత రెండు మూడు సినిమాల నుండి నేను మిమ్మల్ని నిరశపరుస్తున్నాను. కట్టుకున్న భార్యను ఎంత బంగారంగా చూసుకోవాలో, కన్నబిడ్డను ఎంత భాద్యతగా చూసుకోవాలో, దేవుడు నాకు ఇచ్చిన ఈ అభిమానులు అందరిని అంత ప్రేమగా చూసుకోవాలి. మీవల్లే నేను ఈ స్థానంలో ఉన్నాను. లేకపోతే, ఈ బతుకు లేదు, ఈ జన్మ లేదు. మీకు నచ్చే వరకు సినిమాలు తీస్తూనే ఉంటా. హిట్టు, ప్లాపులు వద్దు. ఈ భూమి మీద నందమూరి అభిమాని అయిన ప్రతి ఒక్కరు కాలర్ ఎగరేసి తిరగాలనేది నా కోరిక. ప్రతి సినిమా కష్టపడి చేశాను, ఈ సినిమా కసితో చేశాను. ఆ కసికి కారణం మీరు, మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చకపోయినా పర్వాలేదు, మీరు కలర్ ఎగరేసుకుని తెరిగేవరకు సినిమాలు చేస్తూనే ఉంటాను. ‘పటాస్’తో మొదలైన ఈ విజయపరంపర కొనసాగుతుంది. తాతయ్య గారు ఆశీసులతో ఈ ఏడాది నందమూరి నామ సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ‘టెంపర్’, తర్వాత బాబాయి ‘లయన్’ హిట్ ఖాయం. 13 ఏళ్ళ తర్వాత పూరితో చేశాను. అప్పుడు రిజల్ట్ వేరు, ఇప్పుడు వేరు. మంచి కథ ఇచ్చిన వంశీకి, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ కు థాంక్స్. బండ్ల గణేష్ సినిమాను అద్బుతంగా నిర్మించారు. అని అన్నారు.

బండ్ల గణేష్ మాట్లాడుతూ…. అలలకు అదుపు లేదు, కలలకు రూపు లేదు, శిలలకు చూపు లేదు, అభివృద్ధికి అంతు లేదు, ఈ ‘టెంపర్’కు తిరుగు లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆయన నా ‘బాద్ షా’. ‘బాద్ షా’ షూటింగ్, ఆయనతో ప్రయాణం నాకో తీపి గుర్తు. అప్పుడే నాతో సినిమా చేస్తానని మాటిచ్చారు. వంశీ దగ్గర ఒక లైన్ ఉంది వినమని పూరి గారికి చెప్పారు. పూరితో నాకు 25ఏళ్ళ సాన్నిహిత్యం. నిర్మాతగా నా మొదట సినిమా చేయమని పూరి గారిని అడిగాను. ఆయనంటే నాకు ఎంతో గౌరవం. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేద్దామని అనుకున్నాను, కుదరలేదు. ‘టెంపర్’తో మీముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇదో గొప్ప సినిమా అవుతుంది. ఎన్టీఆర్ నటించిన 24 సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. యంగ్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కొత్త అవతారంలో కనిపిస్తాడు. ఆయన నడక, డాన్స్, స్టైల్, ఫైట్ అన్ని కొత్తగా ఉంటాయి. ఫిబ్రవరి 13న ఉదయం 5.07 నిముషాలకు సినిమాను మీముందుకు తీసుకొస్తాం. బ్లాక్ బస్టర్ సినిమా ఇది. అని అన్నారు.

పూరి జగన్నాధ్ మాట్లాడుతూ…. ఈ సినిమాలో హీరో ఎన్టీఆర్, విలన్ ఎన్టీఆర్, కమెడియన్ ఎన్టీఆర్, ఐటెం కూడా ఎన్టీఆరే. ‘టెంపర్’ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఇచ్చిన ఇంపాక్ట్ ఇప్పట్లో పోదు, అక్కడ ఎక్కడో ఉంటాడు. 2004లో నేను తారక్ తో చేసిన ‘ఆంధ్రావాలా’ బిగ్ డిసప్పాయింట్. ఫాన్స్ అందరూ నన్ను తిట్టుకున్నారు. ఈసారి నన్ను నమ్మండి, ఈ సినిమాతో ఈ 11 ఏళ్ళలో ఎన్టీఆర్ చేసిన సినిమాలు మర్చిపోతారు. ఈ సినిమాలో కొత్త ఎన్టీఆర్ చూస్తారు. 6 ప్యాక్ చేశాడు. ఒక సన్నివేశం కోసం 18 గంటలు ఒక చుక్క నీరు కూడా తాగలేదు. ఈ సినిమా చూస్తే అనిపించింది. నందమూరి కుటుంబం నుండి కొత్త హీరోని లాంచ్ చేస్తున్నాం. అంత ప్రాణం పెట్టి సినిమా చేశాడు. అంత మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. నేను ఒక ఎన్టీఆర్ కి చెప్పాను, అది నచ్చింది. షూటింగ్ స్టార్ట్ చేసే ముందు ఎన్టీఆర్.. భయ్యా 4 ఏళ్ళ క్రితం వంశి ఓ పాయింట్ చెప్పాడు, బాగుంది. వింటావా..? వేరే వాళ్ళ కథ చేస్తావా..? అని అడిగాడు. నాకంటే మంచి కథ ఎవరు చెప్పినా చచ్చినట్టు చేస్తాను అని చెప్పాను. వక్కంతం వంశి ఓ మంచి కథను, అద్బుతమైన స్క్రిప్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యు వంశి. అనూప్ రూబెన్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.

శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… అన్ని క్యారెక్టర్లు అందరూ చేయలేరు. కొందరే చేయగలరు. ఆ రోజుల్లో మహానుభావుడు ఎన్టీఆర్ గారు కృష్ణుడైనా, దుర్యోధనుడైనా, కర్ణుడైనా, బృహన్నల అయినా.. ఏ క్యారెక్టర్ అయినా ఆయనకే సాధ్యం. అలా ఈ రోజుల్లో ఆ మహానుభావుడి మనవడు, ఆ పోలికలతో ఉండే ఎన్టీఆర్ వలెనే సాధ్యం. ఈ సినిమా హిట్ అవుతుంది అనడంలో ఎటువంటి డౌట్స్ లేవు. ‘టెంపర్’ టైటిల్‌కి తగ్గట్టు ఎన్టీఆర్‌ ఫిజిక్‌ని, బాడీ లాంగ్వేజ్‌ని మార్చారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది. ఇండస్ట్రీలో కూడా సినిమా పెద్ద హిట్ అవుతుంది అనే టాక్ ఉంది. అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమానికి హాజరయిన అతిధులు సినిమా విజయవంతం కావలని కోరుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు