సేవ్ సినిమా అంటున్న తమిళులు !
Published on Jul 3, 2017 12:38 pm IST


కోలీవుడ్ సినీ పరిశ్రమ స్తంభించిపోయింది. తమిళనాట అన్ని థియేటర్లు తాత్కాలికంగా మూతబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుండి అమలు చేసిన జీఎస్టీ విధానంతో మోయలేని పన్నుల భారం మీద పడటంతో సినిమాలు ప్రదర్శించడం కష్టమని తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ఈ నిరసన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం రూ. 100 లోపు టికెట్లకు 18 శాతం రూ. 100 పైన టికెట్లకు 28 శాతం పన్ను విధించగా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపై అందనంగా 30 శాతం పన్నును వేస్తున్నాయి.

దీంతో 48 శాతం నుండి 58 శాతం వరకు టాక్సుల రూపంలోనే ప్రభుత్వం చేతికి పోతే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యానికి నష్టాలు తప్పవని, తాము జిఎస్టీని వ్యతిరేకించడంలేదని, కానీ ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే తమిళనాడు ప్రభుత్వం కూడా లోకల్ పన్నుల్ని రద్దు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇన్నాళ్లు తమిళనాట ఏ ప్రభుత్వమున్నా సినీ పరిశ్రమకు మాత్రం ఎలాంటి లోటు లేకుండా చూసుకుంది.

అన్ని విధాలా సహకరిస్తూ సామాన్య ప్రేక్షకులపై భారీ మొత్తంలో పన్ను భారం పడకుండా ఆదుకున్నాయి. అలాంటిది ఒక్కసారిగా 58 శాతం పన్ను వచ్చి నెత్తి మీద పడటంతో తమిళులు తాళలేకపోతున్నారు. సామాన్య ప్రేక్షకులు, థియేటర్ యాజమాన్యాలతో పాటు శంకర్ వంటి సెలబ్రిటీలు కూడా సేవ్ తమిళ్ సినిమా అంటూ నినదిస్తున్నారు. మరో వైపు థియేటర్లు మూతబడటంతో ఈ మధ్యే విడుదలైన సినిమాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. మరి ఈ నిరసనను మన్నించి రాష్ట్ర ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి.

 
Like us on Facebook