తెలుగు సినిమా కలెక్షన్ల వైభవంలో నిజమెంత?

తెలుగు సినిమా కలెక్షన్ల వైభవంలో నిజమెంత?

Published on Apr 25, 2015 12:41 PM IST

telugu-cinema-flag
ఒకప్పుడు ఓ తెలుగు సినిమా విజయం సాధించిందంటే చాలు.. వంద రోజుల పండుగ, 25వారాల పండుగ అంటూ ఆ సినిమా లాంగ్‌రన్‌తో బాక్సాఫీస్ వద్ద కళకళలాడేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వందరోజుల పండుగ అనేది కేవలం కలగానే మిగిలిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఎంత పెద్ద విజయం సాధించిన సినిమా అయినా రెండు వారాలకు మించి థియేటర్లలో ఉండడంలేదన్నది జగమెరిగిన సత్యం. ఇక నెగటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా అయితే థియేటర్లలో వారం కూడా నిలబడలేని పరిస్థితి.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఓ సినిమా ఎంత కలెక్ట్ చేయాలన్నా అది కేవలం ఆ పది రోజుల్లోనే! మరి ఆ పదిరోజుల్లో సినిమాకు పెట్టిన డబ్బంతా తిరిగొచ్చి నిర్మాత లాభాల బాట పడతాడా? అంటే సమాధానం ప్రశ్నార్థకమే! ఇక్కడే సినిమాపై ఎక్కడిలేని ప్రచారాన్ని మొదలుపెట్టాల్సిన పరిస్థితి వచ్చిపడుతుంది. కొన్ని సందర్భాల్లో క్రేజ్ కోసం ఫేక్ కలెక్షన్లను సృష్టించాల్సిన పరిస్థితి కూడా కలుగుతుందనేది సినీ వర్గాల అభిప్రాయం. ఇలాంటి పరిస్థితులు ఎందుకొచ్చాయ్? ఓ సినిమా కేవలం పది రోజుల్లోనే లాభాల బాట పట్టాలంటే ఏం చేయాలి? అనేది అందరినీ వేదిస్తున్న ప్రశ్న.

ఈ ప్రశ్నలకు అందరినుంచీ వస్తోన్న ఒకే ఒక సమాధానం.. సినిమా వర్కింగ్ డేస్. ఒకప్పుడు కేవలం 60,70 రోజుల్లో పూర్తయ్యే ఓ పెద్ద సినిమా, ఇప్పుడు 160రోజులకు పైనే షూటింగ్ జరుపుకుంటోంది. సినిమా వర్కింగ్ డేస్ పెరుగుతున్నా కొద్దీ ప్రొడక్షన్ ఖర్చులు కూడా అమాంతం పెరిగిపోతాయన్నది వాస్తవం. ఆ విధంగా అంతా పకడ్బందీగా జరిగిపోతే అయ్యే బడ్జెట్‌కు దాదాపుగా రెట్టింపు బడ్జెట్ ఖర్చు చేస్తున్నామంటే అది కచ్చితంగా సరైన ప్లాన్‌తో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళకపోవడమే అన్నది అందరి అభిప్రాయం.

ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళే ముందే, ప్రీ ప్రొడక్షన్ దశలోనే సరిగ్గా ప్లాన్ చేస్తే అనుకున్నన్ని రోజుల్లో సినిమాను పూర్తి చేయవచ్చనేది ఇంతకుముందు చాలా సినిమాలు నిరూపించి చూపాయి. ఇదేమీ తెలుగు సినిమాకు తెలియని విద్య కాదు. ప్రస్తుతం తెలుగు సినిమా పాటించని సూత్రం మాత్రమే అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమైనా అనవసర ఆర్భాటాలకు సినిమా దూరం కావాలి. అతి తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేసేందుకు మొదట్నుంచీ చివరివరకూ సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. బడ్జెట్ తగ్గితే సినిమా సేఫ్ సైడ్ నిలుస్తుంది. సినిమా సేఫ్ సైడుంటే వరుసగా సినిమాలు రూపొంది తెలుగు సినిమా ఖ్యాతి పెరుగుతుంది. తెలుగులోనూ ప్రయోగాత్మక సినిమాలు నిర్మించడానికి నిర్మాత వెనుకాడని రోజు వస్తుంది. అప్పుడు నిజంగానే తెలుగు సినిమా వైభవాన్ని చూడొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు