ఇంటర్వ్యూ : క్రాంతి – నటుడిగా నా స్థాయిని పెంచే సినిమా ‘వారధి’!

ఇంటర్వ్యూ : క్రాంతి – నటుడిగా నా స్థాయిని పెంచే సినిమా ‘వారధి’!

Published on Apr 15, 2015 5:51 PM IST

karnthi1
‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటుడు క్రాంతి. ఆ సినిమా ద్వారా ఆయన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘ఆ ఐదుగురు’ అనే సినిమాలో హీరోగా నటించారు. తాజాగా కొత్త దర్శకుడు సతీష్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వారధి’లో లీడ్ రోల్ చేశారు. శ్రీ దివ్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం (ఏప్రిల్ 17న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో క్రాంతితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) వారధి సినిమా గురించి చెప్పండి?

మూడు పాత్రల మధ్య అందంగా నడిచే ఓ అందమైన ప్రేమకథే వారధి. దర్శకుడు సతీష్ కార్తికేయ ఓ మంచి కథతో తెలుగు పరిశ్రమకు పరిచయం కానున్నాడు. ఇప్పటివరకూ ఇలాంటి ప్రేమకథ మన సినిమాల్లో రాలేదు. కమర్షియల్ ఫార్మాట్‌లోనే ఓ అందమైన ప్రేమకథను చెప్పాం. తప్పకుండా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) సినిమాల్లోకి ఎలా వచ్చారు?

నా స్వస్థలం గుంటూరు. చిన్నప్పట్నుంచీ సినిమాల్లో నటించాలన్న ఆసక్తి ఉండేది. నేనో మధ్యతరగతి అబ్బాయిని కావడంతో లైఫ్‌ని రిస్క్‌లో పెట్టేముందు ఏదైనా బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుందని ఎంబీబీఎస్ చదివా. నా మీద నాకు పూర్తి నమ్మకం రాగానే ఇక సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించా. ఆ క్రమంలోనే ‘మల్లెలతీరంలో తీరంలో సిరిమల్లెపువ్వు’, ‘ఆ ఐదుగురు’ వంటి అవకాశాలు వచ్చాయి. ఇక ఇప్పుడు నా మూడో సినిమాగా వారధి విడుదల కాబోతోంది.

ప్రశ్న) ఈ అవకాశం ఎలా వచ్చింది?

నేను ఇంతకుముందు చేసిన సినిమాలను చూసి దర్శకుడు ఈ సినిమాకు సెలెక్ట్ చేసుకున్నారు. మొదట ఈ పాత్ర కోసం కొంత స్క్రీనింగ్ టెస్ట్ చేశాక ఈ సినిమాలో నటించే అవకాశం దక్కింది.

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?

ఈ సినిమాలో వినయ్ అనే పాత్రలో కనిపిస్తా. తన సంతోషం కోసం ఇతరులను బాధపెట్టే శాడిష్టు తరహా పాత్ర ఇందులో చేశాను. నటించడానికి చాలా స్కోప్ ఉన్న పాత్ర కావడంతో వెంటనే ఓకే చేశా. వారధి.. నటుడిగా నా స్థాయిని పెంచే సినిమాగా నిలిచిపోతుందని నమ్మకంగా చెబుతున్నా.

ప్రశ్న) ‘వారధి’ అనే టైటిల్ పెట్టడానికి కారణం?

ఈ సినిమాలో ఒక పాత్ర మరో పాత్రను కలవడానికి ఎవరో ఒకరు వారధిలా పనిచేస్తుంటారు. పాత్రల మధ్య బంధానికి ఇలా ఈ వారధులు కారణమవడం వల్ల సినిమాకు ‘వారధి’ అనే టైటిల్ బాగుంటుందని పెట్టాం. ఈ సినిమాకు సరిగ్గా సరిపోయే టైటిల్ వారధి.

ప్రశ్న) ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు?

నటించడానికి మంచి అవకాశమున్న పాత్ర ఎలాంటిదైనా నటించేందుకు నేను సిద్ధమే. నాకు సరిగ్గా సరిపోయే పాత్ర వచ్చినపుడు అది నెగటివ్ రోల్ అయినా చేస్తా.

ప్రశ్న) తదుపరి సినిమాలేంటి?

ప్రస్తుతం ‘చంద్రుడిలో ఉండే కుందేలు’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నా. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇదేకాక మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి.

ఇక అక్కడితో నటుడు క్రాంతితో మా ఇంటర్వ్యూ ముగిసింది. ఈ వారమే ఆయన నటించిన ‘వారధి’ విడుదలవుతున్న సందర్భంగా ఆయనకు 123తెలుగు తరపున ఆల్ ది బెస్ట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు