అనుష్క ‘సైజ్ జీరో’ సాహసం ఫలిస్తుందా?

అనుష్క ‘సైజ్ జీరో’ సాహసం ఫలిస్తుందా?

Published on Nov 26, 2015 7:39 PM IST

size-zero3
అనుష్క.. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో ఈ జనరేషన్ కథానాయికల్లో ఎవ్వరికీ సాధ్యం కాని ఓ ప్రత్యేక గుర్తింపును, స్టార్‌డమ్‌ను తెచ్చుకున్న హీరోయిన్. ‘అరుంధతి’, ‘వేదం’ లాంటి సినిమాలు అనుష్కను స్టార్‌ను చేస్తే, తాజాగా ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాలు ఏకంగా సూపర్ స్టార్ స్టేటస్‌ను తెచ్చిపెట్టాయి. ఈ రెండు తాజా హిట్ సినిమాల తర్వాత అనుష్క చేసిన మరో అతిపెద్ద సాహసం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెల మూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కోసం అనుష్క ఏకంగా 15 కేజీలకు పైనే బరువు పెరిగి సినిమాపై తనకున్న మక్కువ చూపుకున్నారు.

కథ రీత్యా ‘సైజ్ జీరో’ సినిమాలో అనుష్క పాత్ర, మొదట్లో లావుగా ఉండి ఆ తర్వాత బరువు తగ్గే పరిస్థితుల మధ్యన నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొదట లావుగా ఉండాల్సిన సన్నివేశాల్లో అనుష్కను స్పెషల్ ఎఫెక్ట్స్, లేదా సాంకేతికతను ఉపయోగించి లావుగా చూపించాలనే ఆలోచన చేశారట. అయితే అనుష్క మాత్రం ఈ రోల్ కోసం బరువు పెరుగుతానని మాటిచ్చి, కొద్ది నెలల్లో ఆ పాత్ర కోసం లావయ్యారు. ఇక ఇంత పెద్ద సాహసానికి మొదట్లో అనుష్కను అందరూ హెచ్చరించినా, ఇప్పుడు సినిమా ట్రైలర్, పోస్టర్స్‌కు వస్తోన్న రెస్పాన్స్ చూశాక ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఆర్య మరో ప్రధాన పాత్రలో నటించగా, పీవీపీ సంస్థ నిర్మించిన ఈ సినిమా రేపు (నవంబర్ 27న) తెలుగు, తమిళ భాషల్లో పెద్ద ఎత్తున విడుదల కాబోతోంది. ఓ స్టార్ హీరో సినిమా విడుదలవుతుంటే ఉండేంత క్రేజ్‌తో సైజ్ జీరో రేపు విడుదలకు సిద్ధమైందంటే అనుష్క స్టార్‌డమ్ ఏ స్థాయిదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి హీరోయిన్‌గా తన కెరీర్‌కు కొంత ఇబ్బంది పెట్టేదే అయినా ఇంత పెద్ద సాహసానికి వెనుకాడకుండా అనుష్క చేసిన ఈ ‘సైజ్ జీరో’ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందీ? అన్నది వేచిచూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు