ఇంటర్వ్యూ: గోపీచంద్ మలినేని – ‘విన్నర్’ విజయం నేను స్టార్ హీరోలతో సినిమా చేసేలా చేస్తుంది !

ఇంటర్వ్యూ: గోపీచంద్ మలినేని – ‘విన్నర్’ విజయం నేను స్టార్ హీరోలతో సినిమా చేసేలా చేస్తుంది !

Published on Feb 23, 2017 1:11 PM IST


ఈ వారం రిలీజవుతున్న చిత్రాల్లో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో మంచి అంచనాలున్నాయి. ప్రీ రిలీజ్ బజ్ ప్రకారం ఈ చిత్రం మంచి కమర్షియల్ సక్సెస్ గా నిలుస్తుందని తెలుస్తున్న నైపథ్యంలో చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని మీడియాతో సమావేశమయ్యారు. ఆ సమావేశ విశేషాలు మీకోసం…

ప్ర) చెప్పండి.. ఈ చిత్రంలో హైలెట్ గా నిలిచే అంశాలేవిటి ?
జ) ఇదొక పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్. ఇందులో మంచి యాక్షన్ సన్నివేశాలు, కామెడీతో పాటు కదిలించే ఎమోషన్ కూడా ఉంటుంది. అది ఫ్యామిలీ ఆడియన్సుకు బాగా కనెక్టవుతుంది. సినిమా మొదలైన దగ్గర్నుంచి ఎండింగ్ వరకు చాలా ఎగ్జైటింగా సాగుతుంది. చివరి 15 – 20 నిముషాల రేసింగ్ సీక్వెన్స్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తుంది.

ప్ర) హీరో ధరమ్ తేజ్ ఇందులో ఎలా కనిపిస్తారు ?
జ) సాధారణంగానే తేజ్ లో ఎనర్జీ లెవల్స్ చాలా ఎక్కువ. యాక్షన్ సీక్వెన్సెస్, డ్యాన్సులు, హార్స్ రేస్ వంటి వాటిలో చాలా బాగా నటించాడు. అతని కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎమోషన్ల సీన్లలో అద్భుతంగా నటించాడు. ఈ చిత్రం హీరోగా అతని స్థాయిని పెంచే చిత్రమవుతుంది.

ప్ర) మొత్తంగా సినిమాలో ఏం చెప్పబోతున్నారు ?
జ) సినిమా టైటిల్ ‘విన్నర్’. అంటే హీరో విన్నర్ అవడానికి ఎలాంటి జర్నీ చేశాడు. ఆ జర్నీలో అతను పడ్డ కష్టాలేంటి, కిందపడి మళ్ళీ విన్నర్ గా మారడానికి ఏం చేశాడు అనేది చూపిస్తాం.

ప్ర) హీరో నైపథ్యం ఎలా ఉంటుంది ?
జ) హీరోకి గుర్రాలన్నా, రేసులన్నా, తండ్రన్నా అస్సలు పడదు. అలాంటి హీరో చివరకు తండ్రి కోసం, ప్రేమ కోసం ఎలాంటి పోరాటం చేస్తాడు అనేదే నైపథ్యం. తేజ్ తండ్రిగా జగపతిబాబు నటించారు. వాళ్ళిద్దరికీ మధ్య వచ్చే సీన్లు చాలా ఎమోషనల్ గా ఉంటాయి.

ప్ర) హార్స్ రేస్ సీక్వెన్సులు ఎలా షూట్ చేశారు ?
జ) రేసింగ్ సీక్వెన్సెస్ అన్నీ టర్కీలో షూట్ చేశాం. అక్కడ గుర్రాలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. మొత్తం పది గుర్రాల్ని ఫైనల్ రేస్ లో వాడాం. సన్నివేశాలు చాలా బాగా వచ్చాయ్. హాలీవుడ్ స్టంట్ కోరియేగ్రాఫర్ దీని కోసం పని చేశారు. ఆయన గతంలో ‘గ్లాడియేటర్, ఫాస్ట అండ్ ఫ్యూరియస్, ట్రాయ్’ సినిమాలకి పని చేశారు.

ప్ర) అంత ప్రమాదకరమైన గుర్రాలతో పని చేయడం రిస్క్ అనిపించలేదా ?
జ) అవును.. ఆ గుర్రాలతో పని చేయడం చాలా రిస్క్. ముఖ్యంగా తేజ్ వాడిన గుర్రానికి సుమారు 20 సంవత్సరాల అనుభవం ఉంది. చాలా హాలీవుడ్ సినిమాల్లో నటించింది. వెల్ ట్రైన్డ్ హార్స్. యాక్షన్ అంటే పరిగెడుతుంది, కట్ చెప్తే ఆగిపోతుంది. మా యాక్షన్ కొరియోగ్రాఫర్ చాలా జాగ్రత్తగా తేజ్ కు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకున్నాడు. ఆయనకు ఆ గుర్రాలు బాగా అలవాటు. ఆయన వల్లే ఆ గుర్రాలతో షూట్ చేయగలిగాం.

ప్ర) ఇంకా ఎక్కడెక్కడ షూట్ చేశారు ?
జ) సినిమా మొదటి భాగం హైదరాబాద్లో జరుగుతుంది. మిగతా సగం బెంగుళూరులో జరుగుతుంది. అందుకే అక్కడున్న విజయ్ మాల్య 700 ఎకరాల స్టడ్ ఫామ్ లో షూట్ చేశాం. ఆయన గెస్ట్ హౌస్ కూడా వాడుకున్నాం.

ప్ర) రకుల్ ప్రీత్ ఈ సినిమాలో ఎలా కనిపిస్తుంది ?
జ) రకుల్ ప్రీత్ తో పని చేయడం ఇది రెండోసారి. ఆమె చాలా డేడికేటెడ్ గా వర్క్ చేస్తుంది. అనుష్క ఎంత అంకితభావంతో పని చేస్తారో రకుల్ కూడా అలాగే పని చేస్తుంది. ఈ సినిమాలో ఆమె ఒక అథ్లెట్ గా కనిపిస్తుంది. ఎప్పటికైనా రన్నింగ్ రేస్ లో మెడల్ సంపాదించాలని అనుకునే పాత్ర. సాధారణంగానే రకుల్ కు ఫిటెన్స్ మీద ఎక్కువ శ్రద్ద కనుక ఈ పాత్రలో సులభంగా ఇమిడిపోయింది.

ప్ర) కామెడీ కంటెంట్ కూడా ఎక్కువగా ఉన్నట్టుంది ?
జ) అవును.. ఇందులో కామెడీ ఎంటర్టైన్మెంట్ కు చాలా బాగుంటుంది. సింగం సుజాత పాత్రలో పృథ్వి, పీటర్ హైన్స్ క్యారెక్టర్లో అలీ, హీరో ఫ్రెండ్ పద్మగా వెన్నెల కిశోర్ ల కామెడీ బాగా నవ్విస్తుంది. ఎక్కడెక్కడ కామెడీ ఉండాలో అక్కడ ఉండేలా చూసుకున్నాం.

ప్ర) మీరు సినిమాలు బాగా గ్యాప్ తీసుకుని చేస్తున్నారు ఎందుకు ?
జ) అంటే ఒక సినిమా చేస్తుండగానే ఇంకో సినిమా అనడం నాకు నచ్చదు. ఒక సినిమాపైనే పూర్తి దృష్టి పెడతాను. మనల్ని నమ్మి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చాలా డబ్బు పెడతారు. వాళ్లకు లాభాలు వచ్చేలా చూడాలి. సినిమా ఫ్లాప్ కాకూడదని ముందే అన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమా మొదలుపెడతాను. కథ వర్కౌట్ అవుతుందని అనిపిస్తేనే టేకప్ చేస్తాను. అందుకే కాస్త ఆలస్యమవుతుంది.

ప్ర) అనసూయతో స్పెషల్ సాంగ్ చేయించడం, సుమతో పాడించడం ఎవరి ఐడియా ?
జ) స్పెషల్ సాంగ్ అనుకున్నప్పుడు అనసూయ అయితే బాగుంటుందని అనుకున్నాం. ఎందుకంటే ఆమె టీవీ ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. కనుక అది ప్లస్ అవుతుందని భావించి ఆమెను అడిగాం. మొదట ఆమె ఒప్పుకోలేదు. తర్వాత పాట విన్నాక చేస్తానన్నారు. ఇక సుమతో పాడించడం థమన్ ఐడియా. నేను కూడా సరే అన్నాను. పాట పూర్తయ్యాక వింటే ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడినట్టు అనిపించింది.

ప్ర) ఒకటి రెండు సినిమాలు చేసినవాళ్లు కూడా స్టార్ హీరోలతో చేస్తున్నారు. మీరెప్పుడు చేస్తారు ?
జ) నెక్స్ట్ పెద్ద హీరోతోనే సినిమా చేయాలని అనుకుంటున్నాను. రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయ్. ఈ సినిమా సాధించే విజయం నేను స్టార్ హీరోలతో సినిమాలు చేసేలా చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు