సమీక్ష : బెంగాల్ టైగర్ – రవితేజ మార్క్ మాస్ మసాల.!

సమీక్ష : బెంగాల్ టైగర్ – రవితేజ మార్క్ మాస్ మసాల.!

Published on Dec 12, 2015 7:00 PM IST
bengal-tiger-review

విడుదల తేదీ : 10 డిసెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : సంపత్ నంది

నిర్మాత : కెకె రాధా మోహన్

సంగీతం : భీమ్స్

నటీనటులు : రవితేజ, తమన్నా, రాశీ ఖన్నా, బొమన్ ఇరానీ..

‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ లాంటి వరుస హిట్స్ ఇచ్చిన సంపత్ నంది దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బెంగాల్ టైగర్’. గ్లామర్ డాల్స్ తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీగా అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ బెంగాల్ టైగర్ థియేటర్స్ లో ఏ రేంజ్ లో గర్జించింది అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

కమ్యూనిస్టు భావాలతో పాటు, ఊరికి పెద్దగా అండగా నిలిచిన జయ నారాయణ్ (నాగినీడు) వారుసుడే మన హీరో ఆకాష్ నారాయణ్(రవితేజ). కంప్యూటర్స్ లో మాస్టర్స్ చేసినా ఏ పనీ చేయకుండా తన ప్రెండ్స్ తో కలిసి జులాయిలా తిరుగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. పెళ్లి చేసుకోవాలని పెళ్లి చూపులకు వెళితే అక్కడ పెళ్లి కూతురైన అక్ష తను చేసుకోబోయేవాడు ఫేమస్ అయ్యుండాలని, ఇలా జులాయిలా తిరిగేవాణ్ణి చేసుకోనని మొహానే చెప్పి ఆకాష్ ని అవమానిస్తుంది. దాంతో మన ఆకాష్ వెంటనే ఫేమస్ అయిపోవాలని ఆలోచించి, లోకల్ పొలిటికల్ పార్టీ మీటింగ్ ని నాశనం చేస్తూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫేమస్ అవుతూ ఉంటాడు. అలా ఫేమస్ అయిన ఆకాష్ ని తన టాలెంట్ చూసి, హోం మినిస్టర్ నాగప్ప(రావు రమేష్) తన కుమార్తె శ్రద్ధ(రాశీ ఖన్నా)కి బాడీ గార్డ్ గా పెడతాడు. ఈ జర్నీలో శ్రద్ధ ఆకాష్ ప్రేమలో పడుతుంది.

కట్ చేస్తే నాగప్ప శ్రద్ధ ప్రేమని అంగీకరించి వారిద్దరికీ పెళ్లి చేయడానికి సిద్దమవుతాడు. కానీ ఆకాష్ దానికి నో చెప్పి, తను సిఎం అశోక్ గజపతి(బొమన్ ఇరానీ) కుమార్తె మీర(తమన్నా)ని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అసలు సడన్ గా పరిచయమే లేని మీరని ప్రేమిస్తున్నానని ఆకాష్ ఎందుకు చెప్పాడు.? అసలు ఎందుకు సిఎం అశోక్ గజపతిని ఆకాష్ టార్గెట్ చేసాడు. అసలు మొదటి నుంచి ఆకాష్ ఇదంతా కేవలం తను ఫేమస్ అవ్వడం కోసమే చేసాడా? లేక దీని వెనుక ఏదన్నా గతం ఉందా? అనేదే మీరు చూసి తెలుసుకోవాల్సిన కథ.

ప్లస్ పాయింట్స్ :

మాస్ మహారాజ్ రవితేజ పాత్రని, ఆ పాత్రలోని పవర్ ని సినిమా ఇంట్రడక్షన్ లోనే చూపించి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ చేసేయ్యడమే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. దాంతో ఆడియన్స్ ఆ పాత్రకి సింక్ అవుతూ సినిమాలో లీనమవుతారు. అక్కడి నుంచి రవితేజ పాత్రని హైలైట్ చేస్తూ పూర్తి ఫన్ ఉండేలా ఫస్ట్ హాఫ్ ని తీర్చిదిద్దిన విధానం సినిమాకి చాలా పెద్ద హైలైట్ అయ్యింది. ముఖ్యంగా రవితేజ – పృథ్వి – పోసానిల కామెడీ సినిమాలో ఆడియన్స్ నవ్విస్తూ ఫస్ట్ హాఫ్ ని ఎంటర్టైనింగ్ గా సాగేలా చేసింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అండ్ ట్విస్ట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ డీసెంట్ అనిపిస్తాయి.

మాస్ మహారాజ్ గా రవితేజ మరోసారి ఆకాష్ నారాయణ్ అనే మాస్ పాత్రని రాఫ్ఫాడించాడని చెప్పాలి. సినిమా మొత్తాన్ని తన పాత్ర, తన డైలాగ్స్, తన పవర్ఫుల్ యాక్షన్ తో ముందుకు నడిపించాడు. సినిమాలో ఎంతమంది స్టార్స్ ఉన్నా రవితేజ మాత్రమే సినిమాలో మేజర్ హైలైట్ అవుతాడు, అంతలా అతని రోల్ హైలైట్ అవుతుంది. గత సినిమాలో మిస్ అయిన రవితేజ మార్క్ కామెడీ, యాక్షన్, మాస్ డైలాగ్స్ ఇందులో చూడచ్చు. ఇక చూడటానికి రవితేజ సన్నగా కనపడినా లుక్ మాత్రం చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. ఇక తమన్నా ఎక్కువగా తన అందాలతో, అలాగే తనకి ఇచ్చిన చిన్న పాత్రకి నటన పరంగా న్యాయం చేసింది. ముఖ్యంగా ‘చూపులతో దీపాల’ సాంగ్ లో అయితే తమన్నా నుంచి మీరు చూపు తిప్పుకోలేరు. రాశీ ఖన్నా కాస్త క్యూట్ క్యూట్ గా ఉన్న పాత్రలో బాగానే చేసింది. అలాగే తను కూడా మోడ్రన్ లుక్ లో అందాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఓ సీఎన్ లో బికినీలో కనిపించి అందరినీ తన మత్తులో పడేసుకుంది. ఓవరాల్ గా ఇద్దరు హీరోయిన్స్ గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ అనిపించుకున్నారు. సిఎంగా హుందా తనాన్ని చూపడంలో, అలాగే సెటిల్ గా నెగటివ్ షేడ్స్ చూపడంలో బొమన్ ఇరానీ సింప్లీ సూపర్బ్.

కమెడియన్స్ లో ఫ్యూచర్ స్టార్ గా పృధ్వీ, సెలబ్రిటీ శాస్త్రిగా పోసాని కృష్ణమురళి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ని ఆడియన్స్ కి అందించారు. సత్యం రాజేష్, శకలక శంకర్ లు ఓకే అనిపిస్తే, రావు రమేష్, సాయాజీ షిండే, ప్రియదర్శని రామ్, పవిత్రా లోకేష్, నాగినీడులు పాత్రల మేర నటించి మెప్పించారు. సినిమాలో ఇంట్రడక్షన్ ఫైట్, హైవే ఫైట్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే బురద ఫైట్ సీక్వెన్స్ లు మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్ :

డైరెక్టర్ సంపత్ నంది ఇదొక రెగ్యులర్ ఫార్మాట్ లో రూపొందించిన కమర్షియల్ సినిమా అని రిలీజ్ కి ముందే చెప్పాడు. దీనిలో రెగ్యులర్ మాస్ ఆడియన్స్ కి నచ్చే అన్ని అంశాలు పొందు పరిచినప్పటికీ కథ రెగ్యులర్ అయినప్పుడు ఆడియన్స్ 100% సంతృప్తిచెందరు. అదే ఈ సినిమాలోనూ జరిగింది. చూసేపుడు సీన్స్ కి అక్కడక్కడా బాగా కనెక్ట్ అయినా ఓవరాల్ గా కథ పెద్దగా లేదు అనే ఫీలింగ్ ఆడియన్స్ కి రావడమే ఈ సినిమాకి మొదటి మైనస్. అలాగే స్క్రీన్ ప్లే బేస్ మూవీ అయిన ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ని సూపర్బ్ గా రాసుకొని, సెకండాఫ్ ని మాత్రం ఎందుకో అంత ఎఫ్ఫెక్టివ్ గా రాసుకోలేకపోయాడు. సెకండాఫ్ మొదలైన 10 నిమిషాలకే సినిమా మరీ మరీ రొటీన్ గా మారిపోయి, సాగదీస్తున్న ఫీలింగ్ ని తీసుకు రావడమే కాకుండా ఊహాజనితంగా సాగుతుంది. అది సినిమాకి మరో బిగ్గెస్ట్ మైనస్.

అలాగే క్లైమాక్స్ అయితే మరీ మరీ రొటీన్ అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసే కామెడీ ఉంది, కానీ సెకండాఫ్ లో ఆ కామెడీ ఫ్లేవర్ అనేదే పెద్దగా కనిపించదు. సెకండాఫ్ లో కామెడీ లేకపోవడం, తెలిసిన కథ అనే ఫీలింగ్ వలన ఆడియన్స్ బాగా బోర్ ఫీలవుతారు. దానికి తోడూ సెకండాఫ్ లో డైరెక్టర్ దగ్గర కంటెంట్ లేక వరుసగా మూడు పాటలు పెట్టేసాడు. పాటలు చూడటానికి ఓకే కానీ సినిమా ఫ్లోని మాత్రం బాగా దెబ్బ తీస్తాయి. సెకండాఫ్ లో బ్రహ్మానందం పాత్ర మరోసారి ఆడియన్స్ ని నవ్వించడంలో ఫెయిల్ అయ్యింది. సాగాదీసినట్టున్న సీన్స్ ని కట్ చేసి రన్ టైంని ఇంకాస్త తగ్గించాల్సింది.

సాంకేతిక విభాగం :

రొటీన్ సినిమా కథే అయినప్పటికీ టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో చాలా విభాగాలు సినిమాని కొత్తగా ఉండేలా చూసుకున్నాయి. ముందుగా సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ సినిమాకి హెల్ప్ అయ్యింది. ప్రతి ఫ్రేం, ప్రతి విజువల్ సినిమాని చాలా గ్రాండ్ గా ఉండేలా చూసుకున్నాయి. ఆ విజువల్స్ కి చిన్నా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రాణం పోసాడు. ఇక భీమ్స్ అందించిన పాటలకి సూపర్బ్ పిక్చరైజేషన్ దొరకడంతో సినిమాకి అవి కూడా విజువల్ గా హెల్ప్ అయ్యాయి. ఎడిటింగ్ లో గౌతమ్ రాజు ఫస్ట్ హాఫ్ మీద చూపిన శ్రద్ధ సెకండాఫ్ లో చూపలేదు. అందుకే సెకండాఫ్ లో సాగదీసిన ఫీలింగ్ ఎక్కువ అనిపిస్తుంది. డివై సత్యనారాయణ ఆర్ట్ వర్క్ బాగుంది. నటీనటులకు చేసిన స్టైలింగ్ బాగుంది. రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ అదుర్స్ అనిపిస్తాయి.

కథ – కథనం – మాటలు – దర్శకత్వం, ఈ నాలుగు డీల్ చేసింది సంపత్ నంది. కథలో ఒక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని కొత్తగా అనుకున్నప్పటికీ మిగతా అంతా చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ముందు నుంచే ఇది స్క్రీన్ ప్లే బేస్ కథ అన్నారు, కానీ ఆద్యంతం స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికి వచ్చే ఫీలింగ్ సెకండాఫ్ అయ్యేటప్పటికి రాలేదు అంటే సెకండాఫ్ లో ఎక్కడో ఏదో మిస్ అయ్యింది, అదే స్క్రీన్ ప్లే. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయేలా సంపత్ నంది రాసిన డైలాగ్స్ బాగున్నాయి. వన్ లైన్ డైలాగ్స్ బాగా పేలాయి. రొటీన్ కథనే ఎంచుకున్నప్పటికీ డైరెక్టర్ గా మాత్రం రెగ్యులర్ మూవీ లవర్స్ ని సినిమా థియేటర్స్ లో కూర్చునేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. మూవీ లవర్స్ కి నచ్చే అన్ని అంశాలను బాగానే మిక్స్ చేసాడు. రాధా మోహన్ నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉండడమే కాకుండా సినిమా విజువల్స్ పరంగా చాలా చాలా కలర్ఫుల్ గా ఉండేలా చూసుకున్నాడు.

తీర్పు :

కమర్షియల్ సినిమాలు కోరుకునే మూవీ లవర్స్, రవితేజ ఫాన్స్ మరియు బి, సి సెంటర్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించే సినిమానే ఈ ‘బెంగాల్ టైగర్’. సంపత్ నంది అదే రెగ్యులర్ పంథాని ఫాలో అయినప్పటికీ, సెకండాఫ్ లో ఫ్లో తగ్గినప్పటికీ ఓవరాల్ గా రవితేజ మార్క్ మాస్ మసాలా సీన్స్ బాగా పండించడం వలన మాస్ మసాలా ఎంటర్టైనర్ అనే ఫీల్ తో ఆడియన్స్ బయటకి వస్తారు. అందుకే సినిమాలో రవితేజని క్లాస్ గా చూపించినా సినిమాని మాత్రం మాస్ కి మాత్రమే ఎక్కువ సింక్ అయ్యేలా చేసాడు సంపత్ నంది. రవితేజ మార్క్ కామెడీ – యాక్షన్, తమన్నా – రాశీ ఖన్నాల అందాల ఆరబోత, పోసాని – పృధ్వీల కామెడీ, ఫస్ట్ హాఫ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అయితే రొటీన్ కథా విస్తరణ, సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ లోపించడం, కథనం, అనవసరపు సాగాదీత సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. రెగ్యులర్ సినిమాలు ఇష్టపడని వారికి ఇది పెద్దగా నచ్చదు. ఓవరాల్ గా ఈ వారం థియేటర్స్ లో బి, సి సెంటర్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేయదగిన మాస్ మసాలా మూవీనే ‘బెంగాల్ టైగర్’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు