సమీక్ష : జీలకర్ర బెల్లం – మెసేజ్ ఉన్న బోరింగ్ ప్రేమ కథ..!

సమీక్ష : జీలకర్ర బెల్లం – మెసేజ్ ఉన్న బోరింగ్ ప్రేమ కథ..!

Published on Apr 30, 2016 4:03 PM IST
Jeelakarra Bellam review

విడుదల తేదీ : ఏప్రిల్ 29, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : విజయ్ శ్రీనివాస్

నిర్మాత : ఎ.శోభారాణి, ఆళ్ళ నౌరోజీ రెడ్డి

సంగీతం : వందేమాతరం శ్రీనివాస్

నటీనటులు :అభిజీత్, రేష్మ, రఘుబాబు…

’లైఫ్ బిఫోర్ వెడ్డింగ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు అభిజీత్. ఇప్పుడు ఆయన హీరోగా శ్రీ చరణ్ కార్తికేయ మూవీస్ పతాకంపై నూతన దర్శకుడు విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన సినిమా ‘జీలకర్ర బెల్లం’. ప్రేమికులకు ఓ కొత్త సందేశం ఇవ్వాలనే ప్రయత్నంతో ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తన సందేశాన్ని ఏమేరకు అందించిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులైన రాహుల్(అభిజీత్), రేష్మ (మైథిలి) లు ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ప్రేమ నుంచి పెళ్లి ద్వారా ఒక్కటైన ఈ ప్రేమ జంట తమ జీవితం అనునిత్యం సుఖంగా సాగాలని కోరుకుంటూనే చిన్న చిన్న పొరపాట్లను, సమస్యలను ఈగో వల్ల పెద్దవిగా చేసుకుంటూ కలిసి బ్రతకలేక విడిపోవాలని అనుకుంటుంటారు. అ సమయంలోనే రాహుల్ ను మరొక వ్యక్తి చంపాలని ప్రయత్నం చేస్తుంటాడు. అసలు రాహుల్, మైథిలికి మధ్య ఎలాంటి సమస్యలు తలెత్తాయి..? రాహుల్ ను చంపాలని ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తి ఎవరు..? అతని బారి నుండి రాహుల్ ఎలా బయట పడ్డాడు..? చివరికి రాహుల్, మైథిలిలు తమ పొరపాట్లను తెలుసుకుని ఎలా కలుసుకున్నారు..? అన్నదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ముందుగా చెప్పాల్సింది కథ గురించి. ప్రతి ఒక్కరిని ఆకర్షించే ప్రేమ అనే నేపథ్యాన్ని తీసుకుని అందులో కొత్తగా పెళ్ళైన ప్రేమికులకు ఒక మెసేజ్ ఇవ్వాలని దర్శకుడు చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం. సినిమా చూస్తున్నంతసేపు ఇదేదో మనకు బాగా దగ్గరగా ఉందే అన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అలాగే ప్రేమికుల మధ్య సాధారణంగా తలెత్తే రెగ్యులర్ సమస్యలను, వారి ఈగో లతో వాటిని ఎలా పెద్దవి చేసుకుంటారు? ఎలా ఆలోచిస్తే ఆ సమస్యలను అధిగమించి ప్రేమికులు మంచి భార్యాభర్తలుగా ఉండగలరో వివరించిన తీరు బాగుంది. ఇక హీరో, హీరోయిన్లు అభిజిత్, రేష్మ నటన సహజంగా ఉండి మెప్పిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సన్నివేశం, రామాయణ నాటకంతో భార్యా భర్తల బంధాన్ని చెప్పడం ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ విషయానికొస్తే మొదటి భాగంలో హీరో, హీరోయిన్ల మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలు కొన్ని ఒకే విధంగా ఉండి బోర్ కొడతాయి. దర్శకుడు చూపిన ఇద్దరు ప్రేమికులు ఎదుర్కునే సమస్యలు సహజంగానే ఉన్నా అవి తలెత్తే సందర్బాలు అసహజంగా ఉండి ప్రేక్షకుడికి మింగుడు పడవు. అలాగే సినిమాలో కామెడీ ఉండాలన్న నియమాన్ని సీరియస్ గా తీసుకున్న దర్శకుడు తాగుబోతు రమేష్, ఎం. ఎస్ నారాయణ, హీరో బాస్, అతని సెక్రటరీలతో కామెడీ పండించడానికి చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టి విసుగు తెప్పిస్తుంది. లవ్ వర్సెస్ ఈగో అన్న దర్శకుడు హీరో, హీరోయిన్లు ఇద్దరిలో ప్రేమను చూపినా హీరోయిన్ చుట్టూ మాత్రమే ఈగోని తిప్పడం అంత సమర్థనీయంగా అనిపించదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు విజయ్ శ్రీనివాస్ తాను ఎంచుకున్న లవ్ వర్సెస్ ఈగో అన్న కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న ప్రేమికుల సమస్యలు, వాటిని వారు పెద్దవిగా చేసుకునే విధానాలను బాగానే రాసుకున్నా ఇంటర్వెల్ ముందు కామెడీ, ప్రీ క్లైమాక్స్ కు ముందు తల్లిదండ్రుల ప్రేమ పేరుతో బోరింగ్ కథనాన్ని నడిపాడు. కొమ్మనాపల్లి గణపతి రావు రాసిన డైలాగులు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ మెప్పించే విధంగా లేదు. వందేమాతరం శ్రీనివాస్ అందించిన సంగీతం సినిమాకి పెద్దగా సహాయపడదు. ఎడిటింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేదు. నిర్మాణ విలువలు ఉన్నంతలో బాగున్నాయి.

తీర్పు :

ఎక్కువమంది ఇష్టపడే ప్రేమ కథను నేపథ్యంగా తీసుకున్న దర్శకుడు కథను చెప్పిన విధానం బాగానే ఉన్నా పెద్దగా ట్విస్టులు, ప్రేక్షకులను కట్టిపడేసే సన్నివేశాలు లేకపోవడంతో సాధారణంగా ఒక ప్రేమ కథలో ఉండాల్సిన ఒక లోతైన అనుభూతి లోపించినట్లు అనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ప్రేమ కథలను అమితంగా ఇష్టపడుతూ, రొమాంటిక్ భావనను కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా సంతృప్తినివ్వదు కాని టైమ్ పాస్ లవ్ స్టోరీలను, మెసేజ్ ప్రేమ కథలను ఇష్టపడేవాళ్ళకు ఈ చిత్రం కొంతమేరా నచ్చే అవకాశం ఉంది.

123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు