సమీక్ష : ఖ‌య్యూం భాయ్ – ఈ భాయ్ కు దూరంగా ఉండటం మంచిది !

సమీక్ష : ఖ‌య్యూం భాయ్ – ఈ భాయ్ కు దూరంగా ఉండటం మంచిది !

Published on Jun 30, 2017 5:40 PM IST
Khayyam Bhai movie review

విడుదల తేదీ : జూన్ 30, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : భరత్

నిర్మాత : శ్రీ‌మ‌తి క‌ట్టా శార‌ద చౌద‌రి

సంగీతం : శేఖ‌ర్ చంద్ర

నటీనటులు : క‌ట్టా రాంబాబు, తార‌క‌ర‌త్న

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్ స్టర్ అయిన నయీమ్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘ఖ‌య్యూంభాయ్’. నయీమ్ ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత రూపుదిద్దుకోవడం వలన ఈ సినిమా కాస్త అటెంక్షన్ ను సంపాదించుకుంది. మరి ఈ రోజే రిలీజైన ఈ చిత్రం నయీమ్ ను ఈమేరకు స్క్రీన్ మీద ఆవిషరించిందో చూద్దాం…

కథ :

మొదటి నుండి క్రిమినల్ మైండ్ సెట్ కలిగిన ఖ‌య్యూం ఎవరి భయం లేకుండా పెరిగి యుక్త వయసులోనే పీపుల్స్ వార్ పట్ల ఆకర్షితుడై నక్సలైట్లలో చేరి దళంలో ఏర్పడ్డ బేధాభిప్రాయాలతో బయటికొచ్చి కొంతమంది పోలీసులతో చేతులు కలిపి కోవర్ట్ గా మారి నక్షలైట్ల ఎన్కౌంటర్లకు కారణమవుతాడు. అలా మెల్లగా పోలీసు వయ్వస్థనే తన బలంగా చేసుకుని నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన ఖ‌య్యూం సెటిమెంట్లు, హత్యలు, కిడ్నాపులు చేస్తూ చివరికి తనకు అండగా నిలిచిన ప్రభుత్వానికే ప్రమాదంగా పరిణమిస్తాడు.

దాంతో పోలీసులు ఇక లాభం లేదనుకుని పక్కా ప్లాన్ ప్రకారం అతన్ని హతం చేస్తారు. ఈ మొత్తం వాస్తవ పరిణామాలకు దర్శకుడు భరత్ కొంత సినిమాటిక్ టచ్ ఇచ్చి కథను తయారు చేసుకున్నాడు. ఆ కథ ఏమిటి ? అసలు నయీమ్ అలియాజ్ ఖ‌య్యూం ఎవరెవర్ని హత్యలు చేశాడు ? అనేదే తెరపై నడిచే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ అంటే గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడమే. ఈ అంశం కారణంగా థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకుడు సినిమాలో నెక్స్ట్ ఏం చూపిస్తారు, న్యూస్ చానెళ్లు చెప్పని కొత్త విషయాలేమైనా ఉంటాయేమో చూడాలి, అసలు నయీమ్ లైఫ్ స్టైల్, అతను క్రైం చేసే విధానం ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సుకత కొంత వరకు సినిమాను తట్టుకునే బలాన్నిచ్చింది.

దీంతో సినిమాలో చాలా సేపు ఏవైనా ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయేమో అనే ఆతురత మైంటైన్ అయింది. అలాగే నయీమ్ తన స్వలాభం కోసం ఎవరెవర్ని చంపాడు అనే విషయాల్ని కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు చెప్పారు. నయీమ్ పాత్రదారి క‌ట్టా రాంబాబు పోలికల్లో చూడ్డానికి చాలా వరకు నయీమ్ లానే ఉండటం చెప్పుకోదగ్గ అంశం.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో పైన ప్రస్తావించిన కొన్ని అంశాల మినహా మిగతా వ్యవహారమంతా పరమ బోర్ అనిపించింది. కొన్ని సన్నివేశాలైతే ఒక్కో దశలో చిరాకు తెప్పించాయి కూడ. గ్యాంగ్ స్టర్ నయీము ఎవరెవర్ని హత్య చేశాడు, ఎలా చనిపోయాడు అనే విషయాలు అందరికీ తెలిసినవే. కనుక దర్శకుడు సామాన్య జనానికి తెలియని నయీమ్ ఆ హత్యలు ఎందుకు చేశాడు, ఎవరి కోసం చేశాడు, ఎలా చేశాడు, అతని ఎన్కౌంటర్ వెనుక ఎవరున్నారు, అతని నేర చరిత్రలో పోలీసుల భాగస్వామ్యమెంత, అసలు నయీమ్ ఎలాంటి జీవితం గడిపేవాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, ముఖ్య వ్యక్తుల హత్యలకు ప్లాన్ ఎలా రెడీ చేసేవాడు, వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేసేవాడు అనే అంశాలను పరిశోధన చేసి చెప్పాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు.

అందరికీ పైపైన తెలిసిన అంశాలనే దర్శకుడు చెప్పాడు. వాటిని కూడా ఒక ఇంటెన్సిటీతో ఆకట్టుకునే విధంగా చెప్పాడా అంటే అదీ లేదు. బలహీనమైన, సిల్లీగా అనిపించే స్క్రీన్ ప్లేతో, డైలాగులతో సినిమాను చుట్టేశాడు. ఇక వాస్తవ కథకు అతనిచ్చిన సినిమాటిక్ టచ్ కూడా పరమ రొటీన్ గా అనిపించింది. సినిమా మొదలైన అరగంటకు కూడా నయీమ్ పాత్రను ప్రవేశపెట్టకుండా ఎసిపి సత్య (తారకరత్న) యొక్క రొమాంటిక్ ట్రాక్ ను నడిపి ఆరంభంలోనే నిరుత్సాహపరిచేశాడు. నయీమ్ పాత్రదారి కట్టా రాంబాబు చూసేందుకు కొంచెం నయీమ్ పోలికలతోనే ఉన్నా అతని నటనలో మాత్రం సీరియస్ నెస్, క్రుయాలిటీ కనిపించలేదు.

స్క్రీన్ మీద అతని చూస్తుంటే నయీమ్ అంటే ఇంతేనా, ఇలానే ఉంటాడా అనే తక్కువ స్థాయి భావన కలిగింది. ఇక మధ్యలో వచ్చే పాటలు, మరీ ముఖ్యంగా ఐటమ్ సాంగ్స్ పెద్ద తలనొప్పిగా పరిణమించాయి. క్లైమాక్స్ లో నయీమ్ ఎన్కౌంటర్ వెనకున్న అసలు వాస్తవాల్ని అయినా చూపిస్తారేమో అనుకుంటే దాన్ని కూడా రొటీన్ గా, ఉన్నపళంగా ముగించేయడం అస్సలు నచ్చలేదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు భరత్ సినిమా కోసం ఎంచుకున్న పాయింట్ ఆసక్తికరమైనదే అయినా కూడా దాన్ని తెరపై చూదగ్గ రీతిలో ఆవిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఎక్కడా కొత్త విషయాలు చెప్పకుండా కేవలం న్యూస్ పేపర్, టీవీ ఛానెళ్ల ఇన్ఫర్మేషన్ తో ఆయన తయారుచేసిన కథనం చాలా బ్యాడ్ గా ఉంది. ప్రధానమైన ఈ అంశాల్లోనే విఫలమవడంతో సినిమా అక్కడే కుంటుబడిపోయింది.

ఇక శేఖర్ చంద్ర అందించిన సంగీతం ఏ కోశానా ఆకట్టుకోలేదు. ఐటమ్ సాంగ్ అయితే చిరాకు పుట్టించేశాయి. కెమెరా పనితనం ఒక సినిమాకుండాల్సిన స్థాయిలో లేదు. ప్రతి సీన్ ఏదో తీయాలి కాబట్టి తీసినట్టే ఉంది. నిర్మాణ విలువలు కూడా చెప్పుకోదగిన రీతిలో లేవు. ఎడిటింగ్ ద్వారా సెకండాఫ్లో కొన్ని సన్నివేశాల్ని కత్తిరించి ఉండాల్సింది.

తీర్పు :

గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవితం ఆధారంగా దర్శకుడు భరత్ రూపొందించిన ఈ ‘ఖ‌య్యూంభాయ్’ చిత్రం ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేదు. కొత్త అంశాలు చెప్పకపోగా సామాన్య జనం టీవీల్లో, పేపర్లో చూసి తెలుసుకున్న విషయాలనే ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేని కథనంతో, ఒక పద్ధతంటూ లేని టేకింగ్ తో చూపించడంతో సినిమా వీక్షించలేని విధంగా తయారైంది. మొత్తం మీద చెప్పాలంటే ఈ వారాంతంలో ‘ఖ‌య్యూంభాయ్’ జోలికి పోకుండా మరేదైనా చాయిస్ చూసుకోవడం బెటర్.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు